హైదరాబాద్‌: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారం రోజులపాటు సంతాప దినాలు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, అదే విధంగా నేడు రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాయి. అది పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రి సేవలపై ప్రభావం చూపింది. అకస్మాత్తుగా ఓపీ సేవలు నిలిపివేయడంతో పేషెంట్లు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తమకు ముందస్తు సమాచారం లేదని, వంద కిలోమీటర్ల నుంచి జిల్లాల నుంచి తాము వస్తే ఓపీ సేవలు నిలిపివేశామని ఆస్పత్రి సిబ్బంది తీరికగా చెప్పారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు సమాచారం ఉంటే తాము ఈరోజు వచ్చేవాళ్లం కాదని, అలాగని హైదరాబాద్ లో ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత తమకు లేదని వాపోతున్నారు. దీనిపై నిమ్స్ హాస్పిటల్ సిబ్బంది మాట్లాడుతూ.. అత్యవసర సేవలు కొనసాగుతున్నాయని, వాటికి ఏ సమస్యా లేదన్నారు.