Tesla in India: ఎలక్ట్రిక్‌ కార్ల దిగుమతికి సంబంధించి టెస్లా, భారత ప్రభుత్వం మధ్య సయోధ్య వైపు అడుగులు పడుతున్నట్టే అనిపిస్తోంది! టెస్లా కార్లపై దిగుమతి పన్ను, సుంకాలు తగ్గించేందుకు ఓ షరతు విధిస్తోన్నట్టు తెలిసింది. టెస్లా ఎలక్ట్రిక్‌ కార్లలో 500 మిలియన్‌ డాలర్ల మేర భారత్‌లో తయారుచేసిన వాహన పరికరాలనే వాడాలని కేంద్రం షరతు విధించిందని ఓ అధికారి తెలిపారు.


మొదట తక్కువ స్థాయిలోనే భారత పరికరాలు కొనుగోలు చేసేందుకు అవకాశం ఇస్తామని కేంద్రం తెలిపినట్టు సమాచారం. తొలుత 10-15 శాతం కొనుగోలు చేయాలని, ఆ తర్వాత సంతృప్త స్థాయికి తీసుకెళ్లాలని కేంద్రం కోరుకుంటోందట. స్థానిక పనిముట్లు, పరికరాల వాడకం పెంచాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే టెస్లాకు అధికారికంగా తెలియజేశారని ఆ అధికారి వెల్లడించారు. తాము 100 మిలియన్‌ డాలర్ల విలువైన భారత పరికరాలను ఇప్పటికే వాడుతున్నట్టు ఆగస్టులో టెస్లా ప్రకటించిన సంగతి తెలిసిందే.


ఎలక్ట్రానిక్‌ వెహికల్స్‌లో అగ్రశ్రేణి కంపెనీ టెస్లా భారత్‌లో కార్లు తయారు చేయాలని తాము కోరుకుంటున్నామని ప్రభుత్వం తెలిపింది. అయితె తయారీ యూనిట్‌ నెలకొల్పే ముందు మార్కెట్‌ను పరీక్షించాలని టెస్లా భావిస్తోంది. మొదట దిగుమతి చేసిన కార్లను విక్రయించాలన్నది ఆ కంపెనీ ప్రణాళికగా తెలుస్తోంది. మార్కెట్లో కార్లకు డిమాండ్‌ బాగుంటే కంపెనీ పెట్టాలని అనుకుంటోంది. అందుకే దిగుమతి చేసిన కార్లపై ఇంపోర్ట్‌ డ్యూటీ, సుంకాలు తగ్గించాలని ఎలాన్‌ మస్క్‌ డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే వేరే కంపెనీల వాహనాలపై వంద శాతం పన్ను వేస్తున్నప్పుడు టెస్లా ఒక్కదానికే తగ్గించడం న్యాయం కాదని ప్రభుత్వం అంటోంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి.


ప్రస్తుతం మనదేశంలో దిగుమతి చేసుకున్న వాహనాలపై 25 శాతం నుంచి 100 శాతం వరకు ఇంపోర్ట్ డ్యూటీని విధిస్తున్నారు. ఇవి కంప్లీట్ బిల్ట్ యూనిట్లపై (సీబీయూ) విధించే పన్ను. అంటే పూర్తిగా నిర్మించిన యూనిట్ అన్నమాట. విడిభాగాలు దిగుమతి చేసుకుని ఇక్కడ అసెంబుల్ చేస్తే వాటిపై పన్ను వేరేలా ఉంటుంది.


గతేడాది సెప్టెంబర్‌లో రెడ్ టెస్లా మోడల్ 3 కారును దేశ రాజధానిలోని రోడ్ల రవాణా శాఖ భవనం, హైవేలపై నడుపుతూ టెస్లా అధికారులు కనిపించారు. అదే సమయంలో వారు మనదేశంలోని అధికారులను కలిసి టెస్లా ఇండియా బిజినెస్ ప్లాన్లను వివరించారు.