తెలంగాణ కుంభమేళా(Telangana Kumbmela)గా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ(Medaram Sammakka Saralamma) జాతర నేటి నుంచి ప్రారంభమైంది. మేడారం జాతర(Medaram Jatara) నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్(CM Kcr) ఈ నెల 18న మేడారం జాత‌ర‌కు వెళ్లనున్నారు. వ‌న దేవ‌త‌లైన‌ స‌మ్మక్క-సార‌ల‌మ్మకు దర్శించుకోనున్నారు. సీఎం కేసీఆర్ బంగారం స‌మ‌ర్పించి, మొక్కులు చెల్లించుకుంటారు. మేడారం జాత‌ర ఇవాళ్టి నుంచి 19వ తేదీ వ‌ర‌కు నాలుగు రోజుల పాటు జరగనుంది. ఈ జాత‌ర‌లో దాదాపు కోటి మందికి పైగా భ‌క్తులు వనదేవతలను దర్శించుకునే అవ‌కాశం ఉంది. సీఎస్ సోమేశ్ కుమార్(CS Somesh Kumar), డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డితో పాటు మంత్రులు సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 


వైభవంగా మేడారం జాతర


ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతర, తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతర ఇవాళ ఘనంగా ప్రారంభమైంది. నేటి నుంచి 19 వరకు మహాజాతరను తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. మంగళవారం మేడారం సమీపంలోని కన్నెపల్లె నుంచి పూజారులు సమ్మక్క కుమారుడు జంపన్నను తీసుకొచ్చి గద్దెపై కొలువుదీర్చారు. ఇప్పటికే భక్తులు మేడారంను సందర్శించుకుంటుండగా నేటి నుంచి మేడారం భక్తుల కోలాహలంతో జన సంద్రంగా కనిపిస్తుంది. ఈ మేరకు సమ్మక్క సారక్క జాతర నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ప్రభుత్వం. మహాజాతర ఘట్టంలో ప్రత్యేకతగా నిలిచే పగిడిద్దరాజు(Pagididdaraju)ను గిరిజన సంస్కృతి, సంప్రదాయాల నడుమ ఈ నెల 16న మేడారానికి తరలించారు.


సమ్మక్క భర్త పగిడిద్దరాజు మేడారం జాతర వేడుకల్లో పాల్గొననున్నాడు. రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క సారలమ్మ(Sammakka Saralamma) జాతరలో పగిడిద్దరాజుకు ప్రత్యేక స్థానముంది. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని పూనుగొండ్లలోని గిరిజన పూజారులు(Tribal Priests) భక్తి శ్రద్ధలతో పగిడిద్దరాజుకు పూజలు చేస్తున్నారు. పగిడిద్దరాజు ఆలయంలో గిరిజన సంప్రదాయరీతిలో కార్యక్రమాలను సిద్ధం చేశారు. మేడారానికి పగిడిద్దరాజు చేరుకున్నాక జాతర ప్రారంభం కావడం అనవాయితీగా వస్తోంది. పగిడిద్దరాజును కొలిచే కోయదొరలు వారి సంస్కృతికి అద్దం పట్టేలా ఈనెల 16న మేడారానికి పంపనున్నారు. ఉదయం తెల్లవారుజామున ఐదుగురు ముత్తైదువులను పంపించి గుడిని శుద్ధి చేయిస్తారు. తలపతి అయిన పెనక వంశీయుల వద్దకు వెళ్లి పనిముట్లను శుభ్రం చేసి ముగ్గులు వేస్తారు. దేవుడికి సంబంధించిన పడిగెలను శుద్ధిచేసి, శివశక్తుల మధ్య గుడి చుట్టూ ఊరేగించి తదనంతరం అరణ్యం గుండా మేడారానికి పగిడిద్దరాజును గిరిజన పూజారులు కాలినడకన తరలిస్తారు. మేడారం(Medaram)లో సమ్మక్కతో వివాహం అనంతరం తిరుగు ప్రయాణం అనంతరం మరుపెళ్లి జాతరను పూనుగొండ్లలో ఘనంగా నిర్వహిస్తారు.