Crisil Infrastructure Yearbook 2023: ఇండియాలో, మౌలిక సదుపాయాల (రోడ్లు, వంతెనలు, భవనాలు, విద్యుత్ ప్రాజెక్టులు వంటివి) కల్పనకు భారత ప్రభుత్వం ఇప్పటికే భారీగా ఖర్చు చేస్తోంది, బడ్జెట్‌లో ఎక్కువ ప్రాధానాన్ని ఇన్‌ఫ్రా సెక్టార్‌కే ఇచ్చింది. ఈ ప్రాధాన్యత ఇంకా పెరుగుతుందని, గతంలో ఎన్నడూ లేనంత పెట్టుబడుల వరద మౌలిక సదుపాయాలను ముంచెత్తుతుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ (CRISIL) అంచనా వేసింది.
2024 - 2030 ఆర్థిక సంవత్సరాల మధ్య, మౌలిక సదుపాయాల కోసం భారతదేశం దాదాపు రూ. 143 లక్షల కోట్లు ఖర్చు చేస్తుందని చెబుతూ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇయర్‌బుక్ 2023ని క్రిసిల్ రిలీజ్ చేసింది. 2017 -2023 మధ్య కాలంలో, గత ఏడు ఆర్థిక సంవత్సరాల్లో ఖర్చు చేసిన రూ. 67 లక్షల కోట్ల కంటే ఇది రెండింతలకు పైగా ఎక్కువ మొత్తం.
మొత్తం రూ. 143 లక్షల కోట్లలో రూ. 36.6 లక్షల కోట్లు గ్రీన్ ఇన్వెస్ట్‌మెంట్స్‌గా ఉంటాయని, 2017-2023 ఆర్థిక సంవత్సరాల్లో పెట్టిన పెట్టుబడితో పోలిస్తే ఈ మొత్తం ఐదు రెట్లు పెరుగుతుందని క్రిసిల్ లెక్కలు వేసింది.
పెట్టుబడుల ఫలితం
ఈ పెట్టుబడుల ఫలితాన్ని కూడా క్రిసిల్ ఊహించింది. 2031 ఆర్థిక సంవత్సరం నాటికి భారతదేశ స్థూల జాతీయోత్పత్తి (GDP) సగటున 6.7 శాతం వృద్ధి చెందుతుందని, వేగంగా విస్తరిస్తున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని ఏజెన్సీ అంచనా వేసింది. స్థిరంగా అభివృద్ధి చెందడంపై ఫోకస్ పెడుతూ, ఆల్ రౌండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ద్వారా GDP వృద్ధి రేటు సాధ్యమౌతుందని చెప్పింది.
అంతేకాదు, ఈ పెట్టుబడుల వల్ల భారత ప్రజల ఆదాయం పెరిగి, తలసరి ఆదాయం ప్రస్తుతం ఉన్న USD 2,500 నుంచి 2031 ఫైనాన్షియల్ ఇయర్ నాటికి USD 4,500కు చేరుతుందని, మధ్య-ఆదాయ దేశంగా భారత్ అవతరిస్తుందని రిపోర్ట్‌లో పేర్కొంది.
పెట్టుబడులు వెల్లువెత్తే కీలక రంగాలు
మౌలిక సదుపాయాల రంగంలోకి కొత్తగా వచ్చే పెట్టుబడులు ముఖ్యంగా నాలుగు విభాగాల్లోకి వస్తాయని క్రిసిల్ చెబుతోంది. అవి... రోడ్లు & హైవేలు, విద్యుత్తు పంపిణీ ప్రాజెక్టులు, పునరుత్పాదక ఇంధనం, నౌకాశ్రయాలు. వీటికి 10కి 7కు పైగా మార్కులు ఇచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ విభాగాల్లో సంస్కరణలు, అభివృద్ధి వేగం ఎక్కువగా ఉందని ఈ స్కోర్ అర్ధం. అంతేకాదు, ప్రాజెక్టుల పెట్టుబడుల మొత్తం, భారీ సంఖ్యలో మెగా ప్రాజెక్టులు పెరుగుతాయని; తద్వారా మౌలిక సదుపాయాల అభివృద్ధి నెక్ట్స్ లెవెల్‌కు చేరుతుందని రేటింగ్ ఏజెన్సీ వెల్లడించింది.
వీటితోపాటు, ఎలక్ట్రిక్ వెహికల్స్, సోలార్, విండ్, హైడ్రోజన్ ప్రాజెక్టుల్లో కొత్త వేగం కనిపిస్తుందని అంచనా వేసింది. భారతదేశం మొత్తం ఆటోమొబైల్ సేల్స్‌లో EVల వాటా 2030 నాటికి 30%కు చేరే అవకాశం ఉందన్నది క్రిసిల్ లెక్క. ఎలక్ట్రిక్ టూ-వీలర్ అమ్మకాలు 2028 నాటికి ఇతర సెగ్మెంట్లను దాటేస్తాయని అంచనా వేసింది. అయితే, EV బస్సులకు డిమాండ్ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఆధారపడి ఉంటుందని చెప్పింది.
దేశంలోని మొత్తం విద్యుత్ సామర్థ్యంలో రెన్యువబుల్ ఎనర్జీ వాటా 2023 - 2030 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో 4 రెట్లు పెరుగుతుంది. శిలాజ రహిత ఉత్పత్తిలో సోలార్ పవర్‌కు సగం వాటా ఉంటుంది. దీనికి అనుగుణంగా 'ఫ్లోటోవోల్టాయిక్స్' (ఫ్లోటింగ్ సోలార్), ఆఫ్‌షోర్ విండ్ టెక్నాలజీ, గ్రీన్ హైడ్రోజన్ వంటి టెక్నాలజీలు పెరుగుతాయని క్రిసిల్ పేర్కొంది.
వేగంగా పరుగులు పెట్టేందుకు హైడ్రోజన్ సెక్టార్ సిద్ధంగా ఉందని, 2024 - 2030 ఆర్థిక సంవత్సరాల మధ్య ఈ సెక్టార్‌లోకి రూ. 1.5 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని క్రిసిల్ అంచనా వేసింది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial