India - Russia: ఒక సంవత్సరం క్రితం, ఉక్రెయిన్‌పై రష్యా చేసిన దాడిని భారతదేశం సానుకూలంగా మలుచుకుంది. ర్యష్యా నుంచి భారీ సబ్సిడీతో ముడి చమురును దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది. సబ్సిడైజ్డ్‌ క్రూడ్‌ కోసం అమెరికాను సైతం ఎదిరించింది. ఐక్యరాజ్యసమితి ఓటింగ్స్‌లోనూ, రష్యాకు వ్యతిరేకంగా ఓటేయకుండా ఓటింగ్‌కు దూరంగా ఉంది. 


రాయితీ మీద రష్యా అందిస్తున్న ముడి చమురు కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు త్రైమాసికాల్లో (2022 ఏప్రిల్‌ 1 నుంచి డిసెంబర్‌ 31 వరకు) సుమారు $2.5 బిలియన్లను ఆదా చేసే అవకాశం ఉందని ఇండియాట్రేడ్ డేటా చూపిస్తోంది. 


కేవలం $2 కోసమా ఇదంతా?
రష్యా వల్ల భారతదేశ పొదుపు ‍‌($2.5 బిలియన్లు) భారీగా కనిపిస్తున్నా, ఈ లెక్కని ఇంకా విడగొట్టి నిశితంగా పరిశీలిస్తే, ఊహించిన దాని కంటే చాలా తక్కువ లబ్ధి పొందినట్లు అర్ధం అవుతుంది. 


ప్రపంచంలో మూడో అతి పెద్ద ముడి చమురు వినియోగదారు భారతదేశం. 2022 ఏప్రిల్‌ 1 నుంచి డిసెంబర్‌ 31 కాలంలో, అన్ని దేశాల నుంచి మన దేశం దిగుమతి చేసుకున్న ముడి చమురు సగటు ధర బ్యారెల్‌కు 99.2 డాలర్లుగా తేలింది. రష్యా పంపిన క్రూడ్‌ను ఈ లెక్కల్లోంచి తీసేస్తే, సగటున ఒక్కో బారెల్‌ ధర 101.2 డాలర్లగా ఉంది. రష్యన్ చౌక చమురు దిగుమతి వల్ల భారత్‌కు సగటున మిగిలింది ఒక్కో బ్యారెల్‌కు 2 డాలర్లు (101.2 డాలర్లు - 99.2 డాలర్లు) మాత్రమే.


2022 చివరి 9 నెలల కాలంలో భారతదేశ చమురు దిగుమతుల మొత్తం విలువ 126.51 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇతర దేశాల ముడి చమురుకు చెల్లించే సగటు ధరను, ఇండియన్‌ రిఫైనర్లు రష్యన్ చమురు కోసం చెల్లించినట్లయితే, చమురు దిగుమతి బిల్లు సుమారు 129 బిలియన్‌ డాలర్లుగా లేదా 2 శాతం ఎక్కువగా ఉండేదని విశ్లేషణ చెబుతోంది. ఇదే కాలంలో రష్యా నుంచి చమురు దిగుమతుల విలువ సుమారు 22 బిలియన్‌ డాలర్లు.


2022 ఏప్రిల్-డిసెంబర్‌లో భారతదేశానికి రష్యా పంపిన ముడి చమురు సగటు ధర బ్యారెల్‌కు 90.9 డాలర్లుగా ఉంది. రష్యాయేతర దేశాల లెక్కలతో పోలిస్తే బ్యారెల్ ధర దాదాపు 10.3 డాలర్లు తక్కువ. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న ముడి చమురు సగటు ధరపై 10.1% డిస్కౌంట్‌కు ఇది సమానం. ఈ లెక్క కూడా బాగానే కనిపిస్తున్నా, వివిధ నివేదికల్లో రాసుకొచ్చిన డిస్కౌంట్ల కంటే ఇది చాలా తక్కువ. 


రష్యా ముడి చమురు వాటా 19%
2022 ఏప్రిల్-డిసెంబర్‌ నెలల్లో భారతదేశం చమురు దిగుమతుల్లో రష్యా ముడి చమురు వాటా 19 శాతం. ఈ కాలంలో చేసుకున్న దిగుమతుల్లో ఇది 173.93 మిలియన్ టన్నులు లేదా 1.27 బిలియన్ బ్యారెళ్లకు సమానం. సంవత్సరం క్రితం, ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం ప్రారంభం కావడానికి ముందు, భారతదేశానికి చమురు సరఫరా చేసే దేశాల్లో రష్యాది నామమాత్రపు వాటా. ఇప్పుడు, సౌదీ అరేబియా & యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దిగ్గజాలను వెనక్కు నెట్టేసి ముందుకు వచ్చింది. భారతదేశానికి రెండో అతి పెద్ద ముడి చమురు సరఫరాదారుగా ఇరాక్ తర్వాత రెండో స్థానంలో నిలిచింది. 


2022 సెప్టెంబర్-డిసెంబర్‌ కాలం వరకే చూస్తే, భారతదేశానికి చమురు సరఫరాదార్లలో రష్యాదే టాప్‌ ప్లేస్‌.


భారత ప్రభుత్వం కమొడిటీస్‌ వారీగా & దేశాల వారీగా ట్రేడింగ్‌ డేటాను ఆలస్యంగా విడుదల చేస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న డేటా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మొదటి తొమ్మిది నెలలకు వర్తిస్తుంది. జనవరి వరకు ఉండే డేటా మార్చిలో విడుదల అవుతుంది.