Oxfam Report on India: భారతదేశంలో ఆర్థిక అసమానతలు ఎంత తీవ్రంగా ఉన్నయన్న విషయాన్ని ఆక్స్‌ఫామ్‌ ఇంటర్నేషనల్‌ రిపోర్ట్‌ (Oxfam International Report) బయట పెట్టింది. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (World Economic Forum - EWF ) వార్షిక సమావేశం తొలి రోజున ఈ నివేదికను ఆక్స్‌ఫామ్‌ ఇంటర్నేషనల్‌ విడుదల చేసింది.


ఆ నివేదిక ప్రకారం... భారతదేశంలో జనాభాతో పాటు ధనికుల సంఖ్య కూడా పెరిగింది. 2020లో మన దేశంలో 102 బిలియనీర్లు ఉండగా.. 2022 చివరి నాటికి ఆ సంఖ్య 166కు పెరిగింది. కుబేరుడు కూడా కుళ్లునేంత సంపద వీళ్ల దగ్గర పోగుపడి ఉంది. 


21 మంది బిలియనీర్ల సంపద భారీగా పెరిగింది
భారతదేశంలో కేవలం 1%గా ఉన్న సంపన్నుల వద్ద, 40% జనాభా దగ్గర ఉన్న సంపద కంటే ఎక్కువ స్థిర, చరాస్తుల ఖజానా ఉందని ఆక్స్‌ఫామ్ ఇండియా నివేదిక (Oxfam India Report) వెల్లడించింది. కోవిడ్-19 తర్వాత దేశంలోని అగ్రశ్రేణి బిలియనీర్లు ప్రతిరోజూ 3000 కోట్ల రూపాయలకు పైగా సంపాదించారని ఈ నివేదిక ద్వారా మరో షాకింగ్ విషయాన్ని వెలుగులోకి తీసుకు వచ్చింది. కరోనా మహమ్మారి వల్ల సామాన్య జనం బతుకులు ఛిన్నాభిన్నం అయిపోతే, అదే సమయంలో 21 మంది బిలియనీర్ల సంపద 121 శాతం పెరిగిందని ఆక్స్‌ఫామ్ ఇండియా నివేదిక పేర్కొంది. ఈ 21 మంది బిలియనీర్లు ప్రతిరోజూ తమ సంపదకు రూ. 3600 కోట్లను జమ చేస్తూ వెళ్లారట.


ఆక్స్‌ఫామ్ ఇండియా రిపోర్ట్‌లో గణాంకాలను నిశితంగా పరిశీలిస్తే... మొత్తం జనాభాలో ధనవంతుల సంఖ్య కేవలం 1 శాతం మాత్రమే. మొత్తం 70 కోట్ల జనాభా సంపదను కలిపినా కూడా ఈ 1 శాతం ధనవంతుల ధనరాశులకు సాటిరాదట. ఇంకా సరళమైన భాష చెప్పాలంటే... దేశంలో 70 కోట్ల మంది వద్ద ఉన్న ఆస్తిపాస్తుల కంటే ఎక్కువ ఆస్తులు కేవలం 21 మంది బిలియనీర్ల వద్ద ఉన్నాయి.


మధ్య తరగతిపైనే అధిక పన్నులు
ఆక్స్‌ఫామ్ ఇండియా నివేదిక ప్రకారం... భారతదేశ జనాభాలో 50% మంది వద్ద, మొత్తం దేశ సంపదలో 3% మాత్రమే ఉంది. ప్రభుత్వం సంపన్నుల కంటే మధ్య తరగతి, పేదలపైనే ఎక్కువ పన్నులు విధిస్తోందని నివేదికలో వెల్లడైంది. వస్తువులు, సేవల కోసం ధనవంతులు చెల్లిస్తున్న పన్నుల మొత్తం కంటే.. మధ్య తరగతి ప్రజలు, పేదలు చెల్లిస్తున్న  పన్నుల మొత్తమే ఎక్కువ. ఇదే సమయంలో, GST చెల్లింపుదారుల సంఖ్య 64 శాతానికి పెరిగింది. 


2022 చివరి నాటికి దేశంలో 100 మంది బిలియనీర్లు ఉన్నారని, వారు 18 నెలల పాటు మొత్తం దేశ ఖర్చులను భరించగలరని ఆక్స్‌ఫామ్ ఇండియా రిపోర్ట్‌ పేర్కొంది. ఈ 100 మంది ధనవంతుల మొత్తం నికర విలువ 660 బిలియన్ డాలర్లు.


దేశంలోని టాప్‌-10 కుబేరుల మీద 5 శాతం పన్ను విధిస్తే రూ. 1.37 లక్షల కోట్లు సమకూరతాయి.


దేశంలోని టాప్‌-10 బిలియనీర్ల సంపద మీద 5 శాతం పన్ను, లేదా టాప్‌-100 కుబేరుల సంపద మీద 2.5 శాతం పన్ను విధిస్తే వచ్చే మొత్తంతో, దేశంలో విద్యకు దూరమైన పిల్లలందరినీ తిరిగి పాఠశాలలకు పంపవచ్చు.


భారతదేశంలో ఉన్న బిలియనీర్ల సంపద మీద ఒక్కసారి 2 శాతం పన్ను (One Time Tax) విధిస్తే.. తద్వారా రూ. 40,423 కోట్లు లభిస్తాయి. ఈ డబ్బుతో వచ్చే మూడేళ్ల పాటు దేశంలో పోషకాహారలోపం లేకుండా చేయవచ్చు.