Retail Inflation Data For December 2023: గత ఏడాది (2023) డిసెంబర్‌ నెలకు సంబంధించిన రిటైల్ ద్రవ్యోల్బణం డేటా మళ్లీ భయపెట్టింది. డిసెంబర్‌లో, వినియోగ ధరల సూచీ ‍‌(Consumer Price Index) ఆధారిత చిల్లర ద్రవ్యోల్బణం (Retail inflation) నెల వ్యవధిలో 0.14 శాతం పెరిగింది. 2023 నవంబర్‌లోని 5.55 శాతం నుంచి డిసెంబర్‌లో 5.69 శాతానికి చేరింది. అంతకుముందు అక్టోబర్ నెలలో ఇది 4.87 శాతంగా ఉంది. కూరగాయలతోపాటు ఆహార పదార్థాల ధరలు పెరగడం వల్ల చిల్లర ద్రవ్యోల్బణం పెరిగింది.


పెరిగిన ఆహార ద్రవ్యోల్బణం, 9.53 శాతానికి చేరిక
నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) విడుదల చేసిన డేటా ప్రకారం, ఆహార ద్రవ్యోల్బణం 2023 నవంబర్‌లోని 8.70 శాతం నుంచి డిసెంబర్‌లో 9.53 శాతానికి (Food Inflation Rate in December 2023) జంప్‌ చేసింది. పండ్లు, కూరగాయలు, పప్పులు, సుగంధ ద్రవ్యాలు, పంచదార, ధాన్యాల ధరలు పెరగడం వల్ల ఆహార ద్రవ్యోల్బణం పెరిగింది.


మండుతున్న కూరగాయల ధరలు
పప్పు దినుసుల ద్రవ్యోల్బణం (Inflation of pulses) కూడా పెరిగింది, నవంబర్‌లోని 20.23 శాతం నుంచి డిసెంబర్‌లో 20.73 శాతానికి ఎగబాకింది. కూరగాయల ద్రవ్యోల్బణం (Vegetable Inflation) అతి భారీగా జూమ్‌ అయింది. ఇది నవంబర్‌లో 17.70 శాతంగా ఉంటే, డిసెంబర్‌లో ఏకంగా దాదాపు 10 శాతం పెరిగి 27.64 శాతానికి చేరింది. ధాన్యాలు & సంబంధిత ఉత్పత్తుల ద్రవ్యోల్బణం ‍‌(Inflation of grains) రేటు స్వల్పంగా తగ్గింది. ఇది నవంబర్‌లో 10.27 శాతంగా ఉంటే, డిసెంబర్‌లో 9.93 శాతంగా నమోదైంది. సుగంధ ద్రవ్యాల ద్రవ్యోల్బణం (Inflation of spices) నవంబర్‌లోని 21.55 శాతం నుంచి డిసెంబర్‌లో 19.69 శాతానికి దిగి వచ్చింది. పండ్ల ద్రవ్యోల్బణం ‍‌(Fruits inflation) నవంబర్‌లో 10.95 శాతంగా ఉంటే, డిసెంబర్‌లో 11.14 శాతానికి పెరిగింది. 


ఖరీదైన EMIల భారం తగ్గేలా లేదు          
ద్రవ్యోల్బణం నాలుగు నెలల గరిష్టానికి పెరగడం ప్రజలకే కాదు.. అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు రిజర్వ్‌ బ్యాంక్‌కు (RBI) ఆందోళన కలిగించే విషయం. కీలక వడ్డీ రేట్లను నిర్ణయించేందుకు ఆర్‌బీఐ పరిగణనలోకి తీసుకునే అంశాల్లో చిల్లర ద్రవ్యోల్బణం ఒకటి. చిల్లర ద్రవ్యోల్బణాన్ని 2% - 6% మధ్యలో (RBI tolerance range) ఉంచేందుకు కేంద్ర బ్యాంక్‌ ప్రయత్నిస్తుంటుంది. ద్రవ్యోల్బణం తగ్గి, ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం ఉందనుకున్నప్పుడు దేశంలో వడ్డీ రేట్లను తగ్గిస్తుంది.  ద్రవ్యోల్బణం, ముఖ్యంగా కూరగాయలు & పప్పు దినుసుల ద్రవ్యోల్బణం ఇప్పట్లో దిగివచ్చే సూచనలు కనిపించడం లేదు. ఈ ప్రభావం మొత్తం రిటైల్ ఇన్‌ఫ్లేషన్‌ రేట్‌పై కనిపిస్తోంది. 


2024 ఫిబ్రవరి నెలలో ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమావేశమై, కీలక రేట్లను ప్రకటిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో రిటైల్ ద్రవ్యోల్బణం పెరగడం వడ్డీ రేట్ల తగ్గింపు ఆశలపై నీళ్లు చల్లింది. వడ్డీ రేట్లు తగ్గకపోతే చౌక రుణాలు అందవు,  EMIల భారం తగ్గదు.


ఈ ఏడాది మూడో త్రైమాసికం (2024 జులై-సెప్టెంబర్‌) నుంచి ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించడం ప్రారంభిస్తుందని గోల్డ్‌మన్ సాక్స్ గతంలో వెల్లడించింది.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి