Kichcha Sudeep about HanuMan: సంక్రాంతి బరిలో ముందుగా ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘హనుమాన్’ మూవీ రిలీజ్ అయ్యింది. మహేశ్ బాబులాంటి స్టార్ హీరో నటించిన ‘గుంటూరు కారం’తో పోటీ అయినా పరవాలేదని తమ కంటెంట్ మీద నమ్మకంతో ‘హనుమాన్’ను కూడా అదే రోజు విడుదల చేశారు మేకర్స్. అంతే కాకుండా విడుదలకు ఒకరోజు ముందే పెయిడ్ ప్రీమియర్స్‌ను ఏర్పాటు చేశారు. ఆ ప్రీమియర్స్ నుండే మూవీకి మంచి టాక్ రావడం మొదలయ్యింది. దీంతో సంక్రాంతి రేసులో ముందుగా విడుదలయిన ‘హనుమాన్’ సంక్రాంతి విన్నర్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇదే సమయంలో కన్నడ హీరో సుదీప్ కూడా ఈ మూవీకి తన సపోర్ట్‌ను తెలియజేశాడు.


కృషి చేశారు..
పలువురు సినీ సెలబ్రిటీలు ‘హనుమాన్’కు తమ మద్దతునివ్వడం కోసం ముందుకొచ్చారు. రానా అయితే ఏకంగా మేకర్స్‌తో కలిసి ముంబాయ్‌లో ప్రమోషన్స్‌లో కూడా పాల్గొన్నాడు. అలా మరికొందరు కూడా ఈ మూవీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. సోషల్ మీడియా ద్వారా తమ విషెస్ తెలిపారు. అలాగే తాజాగా కిచ్చ సుదీప్ కూడా ‘హనుమాన్’ టీమ్‌ను ప్రోత్సహిస్తూ ట్వీట్ చేశాడు. ‘హనుమాన్ టీమ్ మొత్తానికి ఆల్ ది బెస్ట్. గొప్ప కృషి, మంచి ఉద్దేశ్యం అనేది ఎప్పుడూ కీర్తిని తెచ్చిపెడుతుంది’ అని ట్వీట్‌లో తెలిపాడు సుదీప్. ఈ ట్వీట్‌లో నిర్మాత నిరంజన్ రెడ్డిని, దర్శకుడు ప్రశాంత్ వర్మతో పాటు సినిమాలో నటించిన తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్‌ను కూడా ట్యాగ్ చేశారు.






పాజిటివ్ రివ్యూలు..
జనవరి 12న విడుదలయిన ‘హనుమాన్’లో వీఎఫ్ఎక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని రివ్యూలు ఇస్తున్నారు. ముఖ్యంగా హనుమంతుడి వచ్చే సీన్‌లో గూస్ బంప్స్ వచ్చాయని, క్లైమాక్స్ బాగుందని ప్రేక్షకులు చెప్తున్నారు. తేజ సజ్జా యాక్టింగ్ కూడా చాలా బాగుందని, తనలో స్టార్ హీరో అయ్యే  అన్ని లక్షణాలు ఉన్నాయని కొందరు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తన అక్క పాత్రలో వరలక్ష్మి శరత్‌కుమార్ సైతం సూపర్‌గా చేసిందని అంటున్నారు. ఇక విలన్‌గా వినయ్ రాయ్ పాత్ర కూడా కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ.. ప్రేక్షకులకు చెప్పిన విధంగానే ఒక మాస్టర్ పీస్‌ను టాలీవుడ్‌కు అందించాడని సోషల్ మీడియాలో తనపై ప్రశంసలు పెరిగిపోయాయి.


‘ఆదిపురుష్’తో పోలికలు..
ఇక ఇంత తక్కువ బడ్జెట్‌లో ‘హనుమాన్’లాంటి హిట్‌ను అందించినందుకు ప్రశాంత్ వర్మను దర్శకుడు ఓం రౌత్‌తో పోలుస్తున్నారు. ఓం రౌత్ వందల కోట్ల బడ్జెట్ పెట్టి కూడా ప్రభాస్‌లాంటి స్టార్ హీరోతో రామాయాణాన్ని సరిగ్గా తెరకెక్కించలేకపోయాడని విమర్శిస్తున్నారు. అంతే కాకుండా ‘ఆదిపురుష్’ను, ‘హనుమాన్’తో పోలుస్తూ ఔట్‌పుట్ అంటే ఇలా ఉండాలి అంటూ ప్రభాస్ ఫ్యాన్స్.. ఓం రౌత్‌కు పాఠాలు చెప్తున్నారు. ప్రమోషన్స్ సమయంలో తన సినిమాపై దర్శకుడు ప్రశాంత్ వర్మ వ్యక్తం చేసిన ధీమా వల్ల పలుమార్లు ట్రోలింగ్‌కు కూడా గురయ్యాడు. కానీ ఇప్పుడు తను ఇచ్చిన కంటెంట్‌నే చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి ఈ సినిమా వల్ల టాలీవుడ్‌లో ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా ఫ్యూచరే మారిపోతుందని చాలామంది ప్రేక్షకులు భావిస్తున్నారు.


Also Read: సంక్రాంతి హిట్‌ కొట్టిన 'హనుమాన్‌' - ఎవరి రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా? తేజా సజ్జాకు ఎంతంటే!