India Q2 GDP Growth Data:


కేంద్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేయబోతున్న జీడీపీ గణాంకాలపై ఆసక్తి నెలకొంది జులై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు మెరుగ్గా ఉంటుందని ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారు. 5.8 నుంచి 7 శాతం వరకు వద్ధిరేటును అంచనా వేస్తున్నారు.


కొవిడ్‌ అవాంతరాలన్నీ క్రమంగా తొలగిపోతుండటంతో భారత ఆర్థిక వ్యవస్థ వార్షిక వృద్ధిరేటు జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో కాస్త నెమ్మదించిందని నిపుణులు అంటున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్న తరుణంలో భారత్‌ ఎంతమేరకు పటిష్ఠంగా ఉందో జీడీపీ గణాంకాల ద్వారా తెలుస్తుందని పేర్కొన్నారు.



సెప్టెంబర్‌ 31కు ముందు వరుసగా మూడు నెలలు 6.2 శాతం వృద్ధిరేటు నమోదవుతుందని రాయిటర్స్‌ పోల్‌ తెలిపింది. గత త్రైమాసికంలోని 13.5 శాతంతో పోలిస్తే ఇది తక్కువేనని వెల్లడించింది. కొవిడ్‌ లాక్‌డౌన్లు, ఎకనామిక్‌ యాక్టివిటీ తక్కువగా ఉన్నప్పటి స్థితిని ఇప్పటితో పోల్చలేమని వివరించింది.


కరోనా కష్టాలన్నీ తొలగిపోవడంతో ఆర్థిక వ్యవస్థ ఏ మేరకు పుంజుకుందో జీడీపీ గణాంకాలు సూచిస్తాయని నిపుణులు అంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు స్పెండింగ్‌, పెట్టుబడులు పెరిగాయని వెల్లడించారు. తయారీ రంగంలో మార్జిన్లు తగ్గడంతో రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు 5.8 శాతంగా ఉంటుందని ఎస్‌బీఐ రీసెర్చ్‌ అంచనా వేసింది.


జీడీపీ సగటు అంచనాల్లో 30 బేసిస్‌ పాయింట్ల కోత విధించింది ఎస్‌బీఐ రీసెర్చ్‌. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ను మినహాయిస్తే మిగిలిన రంగాల నిర్వాహక లాభాలు 2023 ఆర్థిక ఏడాది రెండో త్రైమాసికంలో 14 శాతం మేర తగ్గాయని వివరించింది. అంతకు ముందు ఇదే సమయంలో వృద్ధిరేటు 35 శాతంగా ఉందని పేర్కొంది. ఏడాది క్రితంతో పోలిస్తే టాప్‌లైన్‌ సంస్థల నికర అమ్మకాలు 28 శాతం పెరగ్గా బాటమ్‌ లైన్‌ కంపెనీల విక్రయాలు 23 శాతం తగ్గాయి.


ఇవన్నీ పరిశీలించాక రెండో త్రైమాసికం జీడీపీ వృద్ధిరేటు 5.8 శాతంగా అంచనా వేస్తున్నామని ఎస్‌బీఐ రీసెర్చ్‌ వెల్లడించింది. ఆర్బీఐ అంచనా వేసినట్టే వార్షిక వృద్ధిరేటు మాత్రం 6.8 శాతం ఉంటుందని తెలిపింది. 41 ఇండికేటర్లను ఉపయోగించి ఎస్‌బీఐ ఈ నివేదిక రూపొందించింది.


Also Read: ఈపీఎఫ్‌, పింఛన్‌, బీమాల్లో మార్పు చేస్తున్న కేంద్రం - అన్నీ కలిపి..!


Also Read: ఎక్కువ రిటర్న్‌ ఇచ్చిన టాప్‌-10 బెస్ట్‌ రిటైర్మెంట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇవే!