ర్యాపిడో బైక్‌ సర్వీస్‌ వినియోగించుకున్న యువతిపై ఆ బైక్ డ్రైవర్, అతని అనుచరుడు సామూహిక అత్యాచారం చేసిన ఘటన బెంగళూరులోని ఎలక్ట్రానిక్‌ సిటీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. అక్కడి వార్తా పత్రికలు వెల్లడించిన వివరాల ప్రకారం.. కేరళకు చెందిన 22 ఏళ్ల యువతి బెంగళూరు నగరంలో నివసిస్తోంది. ఎస్‌జీ పాళ్యా నుంచి ఎలక్ట్రానిక్‌ సిటీకి వెళ్లేందుకు అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో ర్యాపిడో యాప్‌ ద్వారా బైక్‌ను బుక్ చేసుకుంది. మార్గమధ్యలో యువతి కాస్త మత్తులో ఉండడాన్ని గమనించిన ర్యాపిడో బైక్ రైడర్ తన స్నేహితుడికి ఫోన్ చేశాడు.


అనంతరం బాలికను ఇంటి వద్ద దింపకుండా నీలాద్రి నగర్‌లోని తన గదిలోకి తీసుకెళ్లి స్నేహితుడితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సందర్భంగా గదిలో నిందితుడి మరో స్నేహితుడు కూడా ఉన్నాడు. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో యువతికి స్పృహ వచ్చింది. ఇది గమనించిన నిందితుడు ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి పారిపోయాడు. అనంతరం యువతి తన స్నేహితురాలికి విషయం తెలియజేసి పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసింది.


ముగ్గురి అరెస్టు
కేసు నమోదు చేసుకున్న ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు వేగంగా ఆపరేషన్ నిర్వహించి ర్యాపిడో బైక్ రైడర్ షహబుద్దీన్ (26), అక్తర్ (24) సహా మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు బీటీఎం లే అవుట్‌లోని ఓ ప్రైవేట్‌ సంస్థలో పని చేస్తూ నీలాద్రి నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నట్లు విచారణలో తేలింది. ఈ ఘటన గత శుక్రవారం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.