India GDP Forecast: అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ రేటింగ్స్ ‍‌(Fitch Ratings), ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2023-24) భారతదేశ వృద్ధి రేటు అంచనాను పెంచింది. ఈ ఫైనాన్షియల్‌ ఇయర్‌లో భారత GDP 6.3 శాతం వృద్ధి చెందుతుందని ఫిచ్ లెక్క వేసింది. అంతకుముందు, ఇండియన్‌ ఎకానమీ గ్రోత్‌ రేట్‌ను 6 శాతంగా అంచనా వేసింది. భారత ఆర్థిక వ్యవస్థలో వేగం, ఔట్‌లుక్‌ మెరుగుపడడం, మొదటి త్రైమాసికంలో (2023 ఏప్రిల్‌-జూన్‌ కాలం) మంచి వృద్ధి రేటు అంచనా ఆధారంగా రేటింగ్ అంచనాను ఫిచ్ అప్‌గ్రేడ్‌ చేసింది.


"భారత ఆర్థిక వ్యవస్థ బలాన్ని చూపుతోంది. Q1FY23లో (జనవరి-మార్చి కాలం) GDP సంవత్సరానికి 6.1 శాతం పెరిగింది. ఇటీవలి నెలల్లో ఆటో సేల్స్, PMI సర్వేలు, క్రెడిట్ వృద్ధి బలంగా ఉంది. కాబట్టి మా అంచనా పెంచాం. 2024 మార్చితో (FY23-24) ముగిసే ఆర్థిక సంవత్సరానికి 0.3 శాతం పాయింట్లను పెంచి 6.3 శాతానికి మా అంచనాను సవరించాం" అని రేటింగ్ ఏజెన్సీ తెలిపింది.


వీడుతున్న చిక్కుముడులు
అంతకుముందు, అధిక ద్రవ్యోల్బణం & ఖరీదైన వడ్డీ రేట్లు, బలహీనమైన ప్రపంచ డిమాండ్ నుంచి సవాళ్ల భారాన్ని భారత్‌ మోయాల్సి వస్తుందని మార్చి నెలలో ఫిచ్‌ అంచనా వేసింది. ఆ పరిస్థితులను పెట్టుకుని, 2023-24 ఆర్థిక సంవత్సరానికి దాని ప్రొజెక్షన్‌ను 6.2 శాతం నుంచి 6 శాతానికి తగ్గించింది. ఇప్పుడు, సవాళ్లు విసిరే మబ్బులన్నీ ఒక్కొక్కటిగా విడిపోతుండడంతో, తాజా రివ్యూలో డీజీపీ గ్రోత్‌ రేట్‌ అంచనాను 6 శాతం నుంచి 6.3 శాతానికి పెంచింది.


వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాలు, 2024-25, 2025-26లోనూ ఇండియా జీడీపీ వృద్ధి 6.5 శాతం చొప్పున దూసుకెళ్తుందని ఫిచ్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. అప్పటికి ద్రవ్యోల్బణం తగ్గి, దేశీయ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని చెబుతోంది.


వివిధ సెక్టార్ల రికవరీ
ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు, భారతదేశ GDP గ్రోత్‌ తాము ఊహించిన దాని కంటే ఎక్కువగా ఉందని ఫిచ్ ప్రకటించింది. అంతకుముందు, వరుసగా రెండు త్రైమాసికాల పాటు తగ్గిన మాన్యుఫాక్చరింగ్‌ సెక్టార్‌ ఇప్పుడు రికవర్‌ అవుతోంది. దీంతో పాటు, నిర్మాణం రంగం ఊపందుకుందని, వ్యవసాయ ఉత్పత్తిలో పెరుగుదల ఉందని ఫిచ్‌ పేర్కొంది.


31 మే 2023న డేటా విడుదల చేసిన నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO), 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ GDP గ్రోత్‌ను 7.2 శాతంగా ప్రకటించింది. ఇది ఊహించిన దానికంటే మెరుగ్గా వచ్చింది. ఈ ప్రకటన తర్వాత, 2023-24లో భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుందని ఎకనామిస్ట్‌ల నుంచి ఏజెన్సీల వరకు అంచనా వేస్తున్నాయి. 


ఈ ఏడాది మార్చి నుంచి పరిస్థితి మారుతున్నట్లు కనిపిస్తోంది. గత రెండు మానిటరీ పాలసీ సమావేశాల్లో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన పాలసీ రేట్లలో (రెపో రేటు) ఎలాంటి మార్పు చేయలేదు. ఏప్రిల్, మే నెలల్లో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గింది. మేలో 4.25 శాతానికి దిగి వచ్చింది. ఇప్పుడు, వడ్డీ రేట్లలో కోతలపై అంచనాలు పెరగడం ప్రారంభమైంది. ఒకవేళ వడ్డీ రేట్లు తగ్గిస్తే, రుణాలు చౌకగా మారతాయి. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూరుస్తుంది.


మరో ఆసక్తికర కథనం: 3 నెలల కనిష్టంలో పసిడి - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial