Export-Import Data: 2022-23లో భారతదేశం వస్తువులు & సేవల ఎగుమతులు రికార్డ్‌ సృష్టించాయి. ప్రభుత్వ లక్ష్యాన్ని మించి ఎగుమతులు సాధ్యమయ్యాయి. పెట్రోలియం, ఫార్మాస్యూటికల్స్‌, రసాయనాలు, సముద్ర ఉత్పత్తులు, ఐటీ, అకౌంటింగ్‌,  బిజినెస్‌ ప్రాసెసింగ్‌ సేవల ఎగుమతుల్లో స్ట్రాంగ్‌ గ్రోత్‌ కనిపించింది. 


గణాంకాలను పరిశీలిస్తే.. గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం నుంచి వస్తువుల ఎగుమతులు 6 శాతం పెరిగాయి, 2021-22లోని 442 బిలియన్ డాలర్లతో పోలిస్తే 2022-23లో 6 శాతం వృద్ధితో 447.46 బిలియన్ డాలర్లకు చేరాయి. సేవల విషయానికి వస్తే.. 2021-22లోని 254.53 బిలియన్‌ డాలర్ల నుంచి 2022-23 ఆర్థిక సంవత్సరంలో 26.8 శాతం వృద్ధితో 322.72 బిలియన్‌ డాలర్లకు చేరాయి. సేవల ఎగుమతుల్లో ఇది జీవనకాల గరిష్టం (ఆల్‌-టైమ్‌ హై) కావడం విశేషం. సేవల్లో... ఐటీ, అకౌంటింగ్‌, బిజినెస్‌ ప్రాసెసింగ్‌ విభాగాల్లో గణనీయమైన వృద్ధి నమోదైంది.


వస్తువులు & సేవల ఎగుమతులు              
2022-23లో భారతదేశం 770 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు, సేవలను ఎగుమతి చేసింది. 2021-22 కంటే 14 శాతం లేదా దాదాపు 94 బిలియన్‌ డాలర్లు ఎక్కువ. 2021-22లో వస్తువులు & సేవల ఎగుమతి 676 బిలియన్ డాలర్లుగా ఉంది. 


పెట్రోలియం, ఫార్మాస్యూటికల్స్‌, కెమికల్స్‌, మెరైన్‌ ఉత్పత్తుల రంగాల్లో మెరుగైన పనితీరు కారణంగా ఎగుమతులు బాగున్నాయని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ (Piyush Goyal) చెప్పారు. సేవల విషయంలో సాధించిన ప్రగతి అంతర్జాతీయ మార్కెట్‌లో భారత్ విస్తరణకు సంకేతమని కేంద్ర మంత్రి వెల్లడించారు. 2020-21లో మొత్తం ఎగుమతులు 500 బిలియన్‌ డాలర్లు మాత్రమేనని చెప్పిన కేంద్ర మంత్రి, ఎగుమతుల్లో వృద్ధి వల్ల కరెంటు ఖాతా లోటు క్రమంగా తగ్గుతోందని వెల్లడించారు.


వస్తువులు & సేవల దిగుమతులు       
భారతదేశంలోకి వస్తువుల దిగుమతులను పరిశీలిస్తే... 2022-23లో 16.5 శాతం పెరిగాయి, 2021-22లోని 613 బిలియన్‌ డాలర్ల నుంచి 714.24 బిలియన్‌ డాలర్లకు చేరాయి. దీంతో, 2022-23లో వాణిజ్య లోటు (trade deficit) 266.78 బి.డాలర్లకు పెరిగింది. 2021-22లో ఇది 191.04 బిలియన్‌ డాలర్లుగా ఉంది.


భారతదేశంలోకి సేవల దిగుమతులను పరిశీలిస్తే... 2021-22లోని 147 బిలియన్‌ డాలర్ల నుంచి 2022-23లో 178 బిలియన్‌ డాలర్లకు చేరాయి. మొత్తం వస్తువులు & సేవల దిగుమతులు 892 బిలియన్‌ డాలర్లకు చేరాయి.


మార్చి నెలలో ఎగుమతులు & దిగుమతులు         
2023 మార్చి నెలను మాత్రం చూస్తే... భారతదేశం నుంచి వస్తువుల ఎగుమతులు 38.38 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి. ఏడాది క్రితం, 2022 మార్చి నెలలో ఈ మొత్తం 44.57 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఊరటనిచ్చే విషయం ఏంటంటే, 2023 మార్చి నెలలో దిగుమతులు కూడా తగ్గాయి. దిగుమతులు 63 బిలియన్‌ డాలర్ల నుంచి తగ్గి 58.11 బిలియన్‌ డాలర్లకు చేరాయి. దీంతో, ఆ నెలలో వాణిజ్య లోటు 19.73 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది.


పీయూష్‌ గోయల్, ఏప్రిల్ 11 నుంచి 13 వరకు ఫ్రాన్స్, ఇటలీ పర్యటనలో ఉన్నారు. అక్కడి నుంచే ఈ సమాచారాన్ని వెల్లడించారు. భారతదేశంతో వాణిజ్యాన్ని మరింత పెంచుకునేందుకు, పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ఆయా దేశాల్లోని ప్రముఖ కంపెనీల CEOలు, ప్రభుత్వ అధికారులతో సమావేశాలు నిర్వహించారు.