విశాఖపట్నం రుషికొండ సమీపంలోని గీతం యూనివర్సిటీ వద్ద మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. గీతం ప్రాంగణాన్ని పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నేడు (ఏప్రిల్ 14) తెల్లవారి 2 గంటల నుంచి ఏండాడ, రుషికొండ మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. కనీసం మీడియాని కూడా అనుమతించకుండా, పోలీసులు కిలోమీటర్ దూరంలోనే నిలిపివేశారు. పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులు యంత్రాలతో మోహరించారు. వీరు ఎండాడ, రుషి కొండ మార్గాల్లో ఆక్రమణల తొలగింపు కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. గీతం యూనివర్శిటీ పరిసరాల్లోని దాదాపు 5 ఎకరాల భూముల్లో అక్రమణలను తొలగించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని సమాచారం.


ప్రస్తుతం ఫెన్సింగ్ వేస్తున్నామని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే సర్వే నెంబరు 37, 38లో ఫెన్సింగ్ పూర్తి అయింది. గతంలో ప్రారంభించిన ప్రక్రియకు కొనసాగింపుగా తాజాగా సర్వే నెంబర్ 15, 16, 19, 20 లో ఫెన్సింగ్ వేశారు. మెయిన్ క్యాంపస్‌లోని డెంటల్‌ కాలేజ్‌ వద్ద కిలోమీటర్‌ మేర కంచె వేస్తున్నారు. గత జనవరిలోనూ గీతం యూనివర్సిటీని ఆనుకొని ఉన్న 14 ఎకరాల భూమిని ప్రభుత్వ అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.


గీతం యూనివర్శిటీ పరిసరాలన్నీ అపార్ట్‌మెంట్ కల్చర్‌తో ఉంటాయి. అక్కడ సంపన్నులు ఎక్కువగా నివసిస్తున్నారు. ఐతే.. అక్కడ భూముల ఆక్రమణలు జరిగాయని వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం మొదటి నుంచి చెబుతోంది. ఆ క్రమంలో ఇవాళ పోలీసులు ఆంక్షలు విధించడంతో స్థానికుల రాకపోకలకు ఇబ్బంది అవుతోంది.