Steel Plant News :    ఊరించి ఊరించి ఉసూరుమనిపించారు కేంద్ర మంత్రి కులస్తే . రోజ్ గార్  మేళా లో పాల్గొనడానికి వైజాగ్ కు వచ్చిన కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి రిపోర్టర్ లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ స్టీల్ ప్లాంట్ ను ఇప్పటికిప్పుడే అమ్మబోవడం లేదని పైగా దానిని బలోపేతం చేసే చర్యలు చేపడుతున్నట్టు అన్నారు . దీనితో ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేగింది . స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ పై కేంద్రం  వెనక్కి తగ్గిందంటూ ప్రచారం సాగింది . దానితో ఆ క్రెడిట్ ను క్లెయిమ్ చేసుకోవడానికి అన్ని పార్టీలు రంగం లోకి దిగాయి . కానీ సాయంత్రానికి సీన్ రివర్స్ అయింది. 


ఉదయం  ప్రైవేటీకరణ లేదన్న మంత్రి - సాయంత్రం మాట మార్పు 


ఒకవైపు ఇదంతా తాము వైజాగ్ లో అడుగుపెట్టాకే జరిగింది అనీ , EOI లో భాగంగా సింగరేణి తరపున బిడ్డింగ్ వేస్తామని అనగానే కేంద్రం దిగి వచ్చింది అని BRS నేతలు అన్నారు . ఏకంగా హరీష్ రావు లాంటి సీనియర్ నేత కూడా ఇదంతా తమ క్రెడిట్ నే అనడం తో ఏపీలోని అధికార వైసీపీ సెల్ఫ్ డిఫెన్స్ లో పడినట్లయింది .  పైగా ఏపీ మంత్రులు కనీసం స్టీల్ ప్లాంట్ ను కూడా కాపాడుకోలేక పోయారంటూ అనడం తో వైసీపీ ఒక్కసారిగా BRS పై మండిపడింది . మరోవైపు సీబీఐ మాజీ జేడీ లక్ష్ష్మినారాయణ లాంటివారు కూడా కేంద్ర మంత్రి ప్రకటనను సమర్ధిస్తూ మాట్లాడారు .  అయితే వందల రోజుల నుండి దీక్షలు చేస్తున్న  స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి మాత్రం కేంద్రమంత్రి వ్యాఖ్యలపై అనుమానాలు వ్యక్తం చేసింది . ఈలోపు వారిని వచ్చి తనను కలవాలని కేంద్రమంత్రి నుండి పిలుపు రావడం తో వారు ఏదో ఒక శుభవార్త వినకపోతామా అని విశాఖ లోని నోవాటెల్ కు వెళ్లారు . 



4 గంటల్లో  మొత్తం సీన్ రివర్స్


 స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ రద్దు పై ఎంతో ఆశతో నోవాటెల్ కు వెళ్లిన ఉక్కుపరిరక్షణ సమితి కార్యకర్తలకు , వైసిపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ లకు ఒక్కసారిగా ఆశాభంగం అయింది . తాను స్టీల్ ప్లాంట్ ( RINL ) ను లాభాల బాట పట్టించే మార్గాలపై  దృష్టి  పెట్టామని మాత్రమే చెప్పానని ప్రవేటీకరణ రద్దు అంశం తన పరిధి లోనిది కాదని స్పష్టం చేసారు . పైగా కేంద్ర సహాయ మంత్రినైన తాను కేబినెట్ తీసుకున్న నిర్ణయం పై ఎలా మాట్లాడుతానని కార్మిక నేతలకు తెలిపారు . కేవలం ఉద్యోగ ,కార్మిక సంఘాల అభిప్రాయాలను కేంద్ర పెద్దల దృష్టికి తీసుకు వెళతానని వారికి చెప్పారు . దీనితో ఒక్కసారిగా దిగాలుపడిన విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి నేతలు హోటల్ నుండి బయటకు వచ్చారు .


 


 పక్కా వ్యూహం ప్రకారమే ప్రకటనలు చేస్తున్నారా ?


నిజంగా స్టీల్ ప్లాంట్ పై రద్దు నిర్ణయం వెలువడుతుంది అనుకుని ఆ క్రెడిట్ లో తమ భాగం లేకపోతే ఎలా అని అనుకున్నారో ఏమో గానీ అటు వైసిపీ ,ఇటు బీజేపీ నేతలు నోవాటెల్ వద్దకు చేరుకున్నారు . చివరకు విషయం తెలిసి దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేసారు .  BRS పార్టీ వైజాగ్ లో అడుగుపెట్టడం , స్టీల్ ప్లాంట్ కు ముడిసరుకు అందించే బిడ్డింగ్ లో తాము పాల్గొంటామని కెసిఆర్ అనడం ,సింగరేణి నుండి ప్రతినిధులు రావడం ఆ తెల్లారే  కేంద్రమంత్రి విశాఖ వచ్చి  ఇలా గందరగోళ ప్రకటనలు చేయడం చూస్తుంటే ఏదో పెద్ద వ్యూహమే రాజకీయంగా అమలు కాబోతుంది అంటున్నారు విశ్లేషకులు . మరి స్టీల్ ప్లాంట్ కేంద్రంగా జరుగుతున్న ఈ రాజకీయాల్లో లోగుట్టు ఏంటో ఆ పెరుమాళ్ళకే ఎరుక అంటున్నారు సామాన్యులు