కాంగ్రెస్ సీనియర్ నేత ఎలేటి మహేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కాసేపట్లో బీజేపీ అగ్రనేతలతో సమావేశం కానున్నారు. తన రాజీనామా లేఖను ఖర్గేకు పంపించారు.
రాజీనామా చేసిన కాసేపటికే ఢిల్లీలో బీజేపీ నేతలతో సమావేశమయ్యారు మహేశ్వర్‌రెడ్డి. ఈటలతో కలిసి తరుణ్‌చుగ్ నివాసానికి వెళ్లి ఆయనతో సమాువేశమయ్యారు. ఈ భేటీలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఉన్నారు. తర్వలోనే బీజేపీలో చేరుతానని చెప్పారు మహేశ్వర్‌రెడ్డి. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అన్నారు.
రెండు రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన ఈటల, బండి సంజయ్ కీలక నేతల చేరికపై చర్చిస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగా బీజేపీలో చేరేందుకు అనుకూలంగా ఉన్న వారితో అధిష్ఠానం పెద్దలతో మంతనాలు జరిపిస్తున్నారు. వీలైతే నేరుగా ఢిల్లీ వెళ్లి అధినాయకత్వంతో మాట్లాడిస్తున్నారు. అందులో భాగంగానే మహేశ్వర్‌రెడ్డి ఢిల్లీ వెళ్లారు.
మహేశ్వర్‌రెడ్డి బీజేపీలోకి వెళ్లిపోతున్నారని గ్రహించిన పీసీసీ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ నాయకత్వంపై విమర్శలు చేశారు. పార్టీ మారేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. దీన్ని తెలుసకున్న పీసీసీ మహేశ్వర్‌రెడ్డికి నోటీసులు ఇచ్చారు.
పీసీసీ షోకాజ్ నోటీసులు ఇవ్వడంపై మహశ్వర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐసీసీ నేతకు పీసీసీ షోకాజ్ నోటీసులు ఇవ్వడం ఏంటని మండిపడ్డారు. తనకు షోకాజ్ నోటీసులు ఇచ్చే అధికారం మీకెక్కడిదని ప్రశ్నించారు. తాను పార్టీని వీడాలంటే ఒక్క నిమిషం పట్టదని.. కానీ తనకు ఆ ఆలోచన ఎప్పుడూ రాలేదన్నారు. అలా స్టేట్‌మెంట్ ఇచ్చిన 24 గంటలు గడవక ముందే బీజేపీలో చేరేందుకు రెడీ అయ్యారు.
గతంలో తనకు సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆఫర్ ఇచ్చారని వాటిని తిరస్కరించి కాంగ్రెస్‌లో కొనసాగినట్టు చెప్పుకొచ్చారు మహేశ్వర్‌రెడ్డి. ఎన్ని ఇబ్బందులు పెట్టినా బాధ పడలేదని అన్నారు. ఎక్కడో సోషల్ మీడియాలో, టీవీల్లో వార్తలు వస్తే తనపై షోకాజ్ ఇస్తారా అని ప్రశ్నించారు.
తన వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పండని, పార్టీ నుంచి వెళ్లిపోతానని అన్నారు మహేశ్వర్‌రెడ్డి. పార్టీలు మారే వారు తనపై ఆరోపణలు చేస్తారా అని మండిపడ్డారు ఎలేటి మహేశ్వర్ రెడ్డి. మచ్చ లేని మనిషిని, ఆస్తులు అమ్ముకొని రాజకీయాలు చేశారన్నారు. తనపై మీద కోపం ఉంటే చెప్పండి కానీ ఇలా అవమానిస్తారా అని ప్రశ్నించారు. తన మీద పగ పట్టారని.. తనను పార్టీ నుంచి పంపించడానికి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. పార్టీ మీద పట్టుకోసం పార్టీనే కబ్జా చేస్తామంటే మీ ఇష్టం అని అన్నారు.