Digital Infrastructure:
భారత డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (DPI) మోడల్ ఐదేళ్లలో 50 దేశాలకు చేరుకుంటుందని ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్ నీలేకనీ అన్నారు. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ, విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ కూటమి ఈ కలను సాకారం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన దిల్లీలో మాట్లాడారు.
'రాబోయే ఐదేళ్లలో డీపీఐ మోడల్‌ను 50 దేశాలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఏర్పడింది' అని బీ20 సదస్సులో నందన్ నీలేకనీ అన్నారు. 'డిజిటల్ మౌలిక సదుపాయాలపై సరికొత్త ఆలోచనలు చేయడం రాబోయే ఐదేళ్లలో మనం చూడబోతున్నాం. ప్రతి ఒక్కరికీ ఈ సేవలు అందించేందుకు ఓపెన్ నెట్‌వర్క్‌ను వాడుకోవాలి. ప్రపంచ వ్యాప్తంగా డీపీఐ మోడల్ అవసరం ఎంతైనా ఉంది' అని ఆయన తెలిపారు.
దారుణ పరిస్థితుల్లోని ప్రాంతాలు, ప్రజలకు నగదు బదిలీ, వరదల వంటి విపత్తులు ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో అత్యవసర నిధులు పంపిణీ చేసేందుకు డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మోడల్ కీలక పాత్ర పోషిస్తుందని నీలేకనీ తెలిపారు. ఉదాహరణకు సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉన్నవారు పటిష్ఠమైన భవంతులు నిర్మించుకోవాల్సి ఉంటుందన్నారు. అక్కడి వాతావరణ పరిస్థితుల్లో నష్టపోకుండా ఉండేందుకు ఇది తప్పని సరని వెల్లడించారు. అందుకే ముందుగానే నిధులు అందించేందుకు డీపీఐ మోడల్ ఉపయోగపడుతుందని వివరించారు.
రివర్స్ లాజిస్టిక్స్‌ను నిర్మించేందుకు ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) వేదికలు ఉపయోగపడతాయని నీలేకని తెలిపారు. వృథాను తగ్గించేందుకు, రీసైకిలింగ్ చేసేందుకు అవసరమైన ఆర్థిక వ్యవస్థను సాధ్యం చేస్తుందన్నారు. అత్యంత వేగంగా ఎలక్ట్రిక్ వాహనాలకు అలవాటు పడేందుకు డీపీఐ మోడల్‌లోని టెక్నాలజీని ఛార్జింగ్ స్టేషన్ల నెట్‌వర్క్ నిర్మాణానికి ఉపయోగించుకోవాలని సూచించారు.
'డీపీఐ మోడల్ ఇప్పటికే ఎంతగానో ఉపయోగపడింది. ఇక ముందూ ఉపయోగపడుతుంది' అని నీలేకని తెలిపారు. కరోనా మమహ్మారి సమయంలో భారీ స్థాయిలో నగదు బదిలీ, వ్యాక్సినేషన్ ప్రక్రియకు డీపీఐ మోడల్ అద్భుతంగా పనిచేసిందన్నారు. వ్యూహాత్మకంగా ఇదెంతో అవసరమని వివరించారు. డీపీఐ మోడల్ డేటా ఎంపవర్‌మెంట్ ఆర్కిటెక్చర్‌గానూ ఉపయోగపడిందని పేర్కొన్నారు. వ్యక్తులు జీవితంలో ముందుకెళ్లేందుకు డిజిటల్ క్యాపిటల్‌ను వాడుకోవచ్చన్నారు. మెరుగైన రుణాలు, ఉద్యోగాలు, నైపుణ్యాలు పొందేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు.
గ్లోబల్ సౌత్‌లో చాలా దేశాలు ఫార్మలైజేషన్ సవాళ్లను ఎదుర్కొంటున్నాయని నీలేకని తెలిపారు. ఈ సమస్యను డీపీఐ మోడల్ ద్వారా భారత్ అధిగమించిందని పేర్కొన్నారు. దేశంలోని ప్రతిభావంతులు, అంకుర సంస్థలు, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ప్రా కలిపి ఈ పరివర్తనను వేగవంతం చేశాయని వివరించారు. 'సృజన, నియంత్రణ మధ్య భారత్ సమతూకం తీసుకొచ్చింది. సమన్వయ పాలనా విధానమే ఇందుకు కారణం. ఇందులో ప్రభుత్వ నియంత్రణ సంస్థలు, టెక్నాలజీ కంపెనీలు కలిసి పనిచేస్తాయి' అని తెలిపారు.