BWF World Championships 2023:  బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్)  వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో సహచర ఆటగాళ్లంతా వెనుదిరిగినా  ఒంటరిపోరాటం చేసిన  భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్   ప్రయాణం ముగిసింది.  పురుషుల సింగిల్స్‌లో అతడు మరోసారి సెమీస్ గండాన్ని దాటలేకపోయాడు. శనివారం డెన్మార్క్ రాజధాని కోపెన్‌హగన్‌లో ముగిసిన సెమీఫైనల్‌‌లో తొమ్మిదో సీడ్ ప్రణయ్.. 21-18, 13-21, 14-21 తేడాతో థాయ్‌లాండ్‌కు చెందిన ప్రపంచ మూడో ర్యాంకర్ కున్లావత్ వితిద్సన్ చేతిలో ఓడిపోయాడు. ఈ ఓటమితో అతడు కాంస్యానికే పరిమితమయ్యాడు. 


శనివారం ముగిసిన సెమీస్ పోరులో తొలి  గేమ్‌ను గెలుచుకున్న ప్రణయ్.. అదే ఊపును కొనసాగించలేకపోయాడు.  రెండో గేమ్‌లో  కూడా ప్రణయ్ ఒకదశలో  5-1తో ఆధిక్యంలో నిలిచాడు.  కానీ ఆ తర్వాత  లయతప్పాడు.  అనవసర తప్పిదాలతో  ఓటమిని కొనితెచ్చుకున్నాడు.  తొలి గేమ్ పోయినా సమయం కోసం  ఓపికగా వేచి చూసిన కున్లావత్.. ఆచితూచి దెబ్బకొట్టాడు.  ప్రణయ్ లయతప్పడాన్ని ఆసరాగా చేసుకున్న అతడు..  ప్రత్యర్థిపై దాడికి దిగాడు. రెండో గేమ్‌ను గెలుచుకున్న తర్వాత  మూడో గేమ్‌లో కూడా అదే దూకుడును కొనసాగించాడు.   రెండో గేమ్ నుంచి లయ కోల్పోయిన ప్రణయ్.. పదే పదే నెట్‌కు, లైన్ ఆవలకు కొడుతూ  కున్లావత్‌కు పాయింట్లు సమర్పించుకున్నాడు. 


 






గతేడాది  ఆలిండియా ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్‌లో  ప్రణయ్‌ను  ఓడించిన కున్లావత్.. తాజాగా వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో కూడా దెబ్బకొట్టాడు.  వరుసగా రెండో ఏడాది ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరుకున్న అతడు.. నేడు జపాన్‌కు చెందిన నరోకాతో  జరిగే తుదిపోరులో అమీతుమీ తేల్చుకోనున్నాడు. ఇక వరల్డ్ ఛాంపియన్‌షిప్ టోర్నీలలో ప్రణయ్‌కు ఇదే తొలి  పతకం కావడం గమనార్హం. గతంలో అతడు క్వార్టర్స్ వరకే పరిమితమయ్యాడు. తాజా టోర్నీలో ప్రణయ్.. తొలి రౌండ్‌లో కొలిజొనెన్‌ను ఓడించగా  రెండో రౌండ్‌లో డ్వి వార్డొయొను, ప్రీ క్వార్టర్స్‌లో కె.వై. లోహ్‌ను ఓడించి  క్వార్టర్స్ చేరుకున్నాడు.  క్వార్టర్స్‌లో విక్టర్‌ను మట్టికరిపించి  సెమీస్‌కు అర్హత సాధించాడు. 


 






ఐదో షట్లర్.. 


ప్రణయ్ కాంస్యం నెగ్గడంతో  ఈ టోర్నీలో  పతకం నెగ్గిన  ఐదో భారత షట్లర్‌గా నిలిచాడు. గతంలో ప్రకాశ్ పదుకునే (1983), కిదాంబి శ్రీకాంత్ (2021), లక్ష్యసేన్ (2021), సాయి ప్రణీత్ (2019)లు  ఈ జాబితాలో ఉన్నారు.  2011 నుంచి  బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో కనీసం కాంస్యం గెలిచే సంప్రదాయాన్ని కూడా భారత్ కొనసాగించింది. గతేడాది సాత్విక్ - చిరాగ్‌ల ద్వయం పురుషుల డబుల్స్‌లో కాంస్యం నెగ్గింది.




ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial