Consequences of Fake Rent Receipts: కొంతమంది టాక్స్‌పేయర్లు తప్పుడు పత్రాలను సబ్మిట్‌ చేసి, ఆదాయాన్ని తక్కువగా చూపడం లేదా పన్ను చెల్లింపును ఎగ్గొట్టడం చేస్తుంటారు. ఈ ఏడాది కూడా, కొంతమంది వేతనజీవులు నకిలీ అద్దె రసీదులు సమర్పించి, పన్ను మినహాయింపు క్లెయిమ్‌ (tax exemption claims) చేసుకున్నారు. దీనిపై ఆదాయ పన్ను విభాగం దర్యాప్తు మొదలు పెట్టింది. ఇప్పటికే కొంతమందిని గుర్తించి, ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 10 (13A) ప్రకారం వారి పన్ను మినహాయింపు క్లెయిమ్‌లకు సంబంధించిన రుజువులు నోటీసులు జారీ చేసింది. 


రెంట్‌ రిసిప్ట్స్‌ అంటే? ‍‌(What are rent receipts?)
ఒక టాక్స్‌పేయర్‌ అద్దె ఇంట్లో నివశిస్తుంటే, ఆ ఇంటి ఓనర్‌కు రెంట్‌ రూపంలో డబ్బు చెల్లిస్తాడు. ఇలా, ఏటా కొంతమొత్తం ఆదాయాన్ని ఖర్చు చేస్తాడు. చెల్లించిన అద్దెకు సంబంధించి ఇంటి యజమాని నుంచి రసీదులు తీసుకుంటాడు. ఈ రసీదులు పేమెంట్‌ ప్రూఫ్స్‌గా పని చేస్తాయి. వీటి ద్వారా, కంపెనీ ఇచ్చే ఇంటి అద్దె భత్యం (HRA)పై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే, హెచ్‌ఆర్‌ఏ ప్రయోజనాన్ని క్లెయిమ్ చేయడానికి కొందరు ఉద్యోగులు నకిలీ అద్దె రసీదులు సృష్టిస్తున్నారు. అలాంటి వ్యక్తులు "దొరికితే దొంగలు - దొరక్కపోతే దొరలు"గా సమాజంలో తిరుగుతున్నారు. చట్టం చేతికి చిక్కారంటే మాత్రం తీవ్రమైన కష్టనష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.


రెంట్‌ రిసిప్ట్స్‌ ప్రయోజనాలు (Importance of rent receipts)
అద్దె చెల్లింపు రుజువు: అద్దె చెల్లించినట్లు ఇంటి ఓనర్‌ ‍‌(House Owner) నుంచి తీసుకునే అధికారిక రసీదు కాబట్టి, వివాదాల సమయాల్లో అద్దెదార్లను (Tenants) రక్షిస్తుంది.
పన్ను ప్రయోజనాలు: HRA కింద పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు. అద్దెదారు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1 లక్ష కంటే ఎక్కువ రెంట్‌ చెల్లిస్తే, టాక్స్‌ బెనిఫిట్స్‌ క్లెయిమ్ చేయడానికి ఇంటి ఓనర్‌ పాన్ (PAN) వివరాలు అందించడం తప్పనిసరి.
సెక్షన్ 80GG ప్రయోజనాలు: ఒకవేళ ఉద్యోగికి HRA రాకపోయినా, ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80GG ప్రకారం, చెల్లించిన అద్దె మొత్తం నిర్దేశిత మొత్తానికి మించితే, అతను అద్దె తగ్గింపు (rent deduction) కోసం క్లెయిమ్ చేయొచ్చు. 


ఆధునిక సాంకేతికతను ఉపయోగించి, ఆదాయ పన్ను విభాగం టాక్స్‌పేయర్ల ITR ఫైలింగ్స్‌ను పరిశీలిస్తుంది. HRA సహా ఏ క్లెయిమ్ విషయంలో డౌట్‌ వచ్చినా సదరు టాక్స్‌పేయర్‌కు తక్షణమే లీగల్ నోటీసును జారీ చేస్తుంది. తగిన రుజులువు సమర్పించమని అడుగుతుంది. సరైన రుజువును సబ్మిట్‌ చేయలేకపోతే, పన్ను చెల్లింపుదారు క్లెయిమ్ చేసిన మినహాయింపును ఐటీ డిపార్ట్‌మెంట్‌ అనుమతించదు. మీ క్లెయిమ్‌ ఫేక్ అని గుర్తిస్తే, ఆదాయాన్ని కావాలని తప్పుగా చూపారని భావించి చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. నకిలీ అద్దె రసీదులపై ఐటీ డిపార్ట్‌మెంట్‌ విధించే శిక్ష తీవ్రంగా ఉంటుంది, ఉద్యోగులకు చుక్కలు చూపిస్తుంది. 


నకిలీ రెంట్‌ రిసిప్ట్‌ సమర్పించినందుకు శిక్షలు


50% వరకు జరిమానా: ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 270A ప్రకారం, ఆదాయాన్ని తక్కువగా చూపినందుకు ఆ టాక్స్‌పేయర్‌కు 50% ఫైన్‌ విధించొచ్చు. మినహాయింపు పొందిన మొత్తంపై సెక్షన్‌ 234A, 234B, 234C ప్రకారం వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయాన్ని తప్పుగా రిపోర్ట్‌ చేయడానికి ఉద్దేశపూర్వకంగా నకిలీ బిల్లు లేదా రశీదును సబ్మిట్‌ చేసిన వ్యక్తికి ఇది వర్తిస్తుంది. 


200% వరకు జరిమానా: కావాలని ఆదాయాన్ని తక్కువగా చేసి చూపినందుకు, సదరు టాక్స్‌ పేయర్‌ ఆదాయంపై వర్తించే పన్నులో 200% వరకు జరిమానా విధించే హక్కు ఐటీ డిపార్ట్‌మెంట్‌కు ఉంది.


మరో ఆసక్తిర కథనం: పెట్టుబడి తక్కువ, లాభం ఎక్కువ - ఈ వ్యాపారాల్లో లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది!