పలు బ్యాంకుల నుంచి రూ.వేల కోట్ల రుణాలు తీసుకుని పరారైన వ్యాపారవేత్త విజయ్ మాల్యాను 'దివాలా దారు'గా ప్రకటిస్తూ లండన్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై ట్విట్టర్ వేదికగా స్పందించిన మాల్యా.. భారతీయ బ్యాంకులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బ్యాంకుల నుంచి తాను చేసిన అప్పునకు రెట్టింపు ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుందని అన్నారు. ఈడీకి సొమ్ము తిరిగి ఇవ్వాల్సి వస్తుందన్న భయంతోనే.. తనను దివాలాదారుగా ప్రకటించమని బ్యాంకులు న్యాయస్థానాన్ని కోరాయని ఆరోపించారు.
మాల్యా దివాలా తీసినట్లు లండన్ హైకోర్టు నిన్న తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. బకాయిలు చెల్లించగల స్థితిలో మాల్యా ఉన్నారనేందుకు తగిన ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయనపై చాలాకాలంగా న్యాయపోరాటం చేస్తున్న బ్యాంకులకు భారీ విజయం లభించింది. ప్రపంచంలో మాల్యాకు ఎక్కడ ఆస్తులు ఉన్నా వాటిని స్తంభింపజేసి తమ బకాయిలను రాబట్టుకొనేలా ఉత్తర్వులు పొందేందుకు భారతీయ స్టేట్ బ్యాంకు నేతృత్వంలోని 13 బ్యాంకుల కన్సార్షియంకు మార్గం సుగమమైంది.
మాల్యా చేయని పనిలేదు..
మాల్యాను భారత్‌కు రప్పించే దిశగా మోదీ ప్రభుత్వం చాలా ప్రయత్నాాలు చేసింది. వీటి నుంచి తప్పించుకోవడానికి మాల్యా కూడా న్యాయవ్యవస్థలో ఉన్న దారులన్నీ వెతికారు. అయితే ఏవీ ఫలించలేదు.
తనపై ఉన్న పరారీ ముద్రను తొలగించుకునేందుకు విజయ్ మాల్యా నానా తంటాలు పడ్డారు. బ్యాంకుల అప్పు తీరుస్తానన్న తన ఆఫర్లకు భారత అధికార వర్గాలను ఒప్పించడానికి విశ్వప్రయత్నాలు చేసిన మాల్యా, సుప్రీంకోర్టును ఆశ్రయించి తన పేరుకు ముందు పరారీ ముద్రను తీసేయాలని, విచారణపై స్టే విధించాలని కూడా విజ్ఞప్తి చేశారు. అయితే, దర్యాప్తు సంస్థల అభియోగపత్రాల ఆధారంగా ఈడీ ఆయనను పరారీలో ఉన్న ఎగవేతదారుగా నిర్ధరించింది.
తనను భారత్‌కు అప్పగిస్తే అక్కడి జైళ్లలో సరైన వసతులు ఉండవంటూ కూడా మాల్యా గతంలో కోర్టులో వాదించారు. ఒకవేళ ఆయనను భారత్‌కు అప్పగిస్తే, విచారణ సమయంలో ఆయన్ను ఏ జైల్లో పెడతారో, అక్కడ ఎలాంటి వసతులు ఉన్నాయో తెలిపేలా ఒక వీడియోను తీసి పంపాలని కేసు విచారణ సందర్భంగా బ్రిటన్ కోర్టు ఆదేశించింది.