IIP Growth Rate April 2023: భారతదేశ పారిశ్రామిక రంగం మళ్లీ పటిష్టంగా మారుతోంది. పారిశ్రామిక ఉత్పత్తి (Industrial Production) క్రమంగా పూర్వ స్థాయికి చేరుతోంది. అధికారిక డేటా ప్రకారం, ఏప్రిల్ నెలలో దేశ పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటులో (IIP Growth Rate) అద్భుతమైన మెరుగుదల కనిపించింది.
మార్చితో పోలిస్తే బంపర్ గ్రోత్
కేంద్ర గణాంకాలు & కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ గణాంకాల కార్యాలయం (NSO) విడుదల చేసిన లెక్కల ప్రకారం, 2023 ఏప్రిల్ నెలలో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు 4.2 శాతంగా ఉంది. మార్చి నెలలో ఐఐపీ వృద్ధి రేటు కేవలం 1.6 శాతంగా ఉంది, ఇది ఐదు నెలల కనిష్ట స్థాయి. పారిశ్రామిక ఉత్పత్తిలో వృద్ధిని పారిశ్రామిక ఉత్పత్తి సూచీ ఆధారంగా గణిస్తారు.
NSO డేటా ప్రకారం, 2023 ఏప్రిల్‌లో 4.2 శాతం వృద్ధితో పారిశ్రామికోత్పత్తి మెరుగ్గా ఉన్నా, సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే కాలంతో పోలిస్తే ఇప్పటికీ తక్కువగానే ఉంది. 2022 ఏప్రిల్ నెలలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ 6.7 శాతంగా నమోదైంది.
2023 ఏప్రిల్ నెలలో, రంగాల వారీగా వృద్ధి:
ఏప్రిల్‌లో తయారీ రంగ వృద్ధి 4.9 శాతంగా ఉంది. ఏడాది క్రితం, 2022 ఏప్రిల్‌లో ఇది 5.6 శాతంగా ఉంది. విద్యుత్ రంగంలో ఉత్పత్తి వృద్ధి 1.1 శాతంగా నమోదైంది, 2022 ఏప్రిల్‌లోని 11.8 శాతం వృద్ధికి ఇంకా చాలా దూరంలో ఉంది. మైనింగ్ రంగంలో ఉత్పత్తి వృద్ధి 5.1 శాతంగా నమోదైంది. 2022 ఏప్రిల్‌లో 8.4 శాతంగా ఉంది. భారీ యంత్ర పరికరాల తయారీ రంగంంలో 6.2 శాతం వృద్ధి నమోదైంది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్‌లో 3.5 శాతానికి తగ్గింది, కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్ ఉత్పత్తి 10.7 శాతానికి పెరిగింది. మౌలిక సదుపాయాలు లేదా నిర్మాణ రంగ వృద్ధి 12.8 శాతంగా నమోదైంది.
మొత్తం 2022-23 ఆర్థిక సంవత్సరానికి పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి 5.2 శాతంగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలోని 11.4 శాతంతో పోలిస్తే సగానిక పైగా తగ్గింది.
రెండేళ్ల కనిష్ట స్థాయిలో ద్రవ్యోల్బణం
దేశంలో రిటైల్ ఇన్‌ఫ్లేషన్ తగ్గుముఖం పడుతోంది. 2023 మే నెలలో 4.25 శాతంగా నమోదైంది, 25 నెలల కనిష్ఠానికి చేరుకుంది. ఏప్రిల్ నెలలో ఇది 4.70 శాతంగా ఉంది. వరుసగా మూడో నెల కూడా వినియోగదారు ధరల సూచీ (CPI) ఆధారిత ద్రవ్యోల్బణం రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించుకున్న 2-6 శాతం పరిధిలోనే ఉంది. ఏప్రిల్ నెలలో 3.84 శాతంగా ఉన్న వినియోగదారు ఆహార సూచీ (CFPI) మే నెలలో 2.91 శాతానికి తగ్గింది. ఇక గ్రామీణ ద్రవ్యోల్బణం 4.17 శాతం, పట్టణ ద్రవ్యోల్బణం 4.27 శాతంగా నమోదయ్యాయి. మొత్తంగా మే నెలలో ద్రవ్యోల్బణం 0.51 శాతంలో మార్పులేదు. కూరగాయల ద్రవ్యోల్బణం రేటు మే నెలలో 8.1 శాతానికి తగ్గింది. ఆహారం - పానీయాలు, ఇంధన రంగాల ఇన్‌ఫ్లేషన్ వరుసగా 3.29 శాతం, 4.64 శాతంగా ఉన్నాయి. పప్పు ధాన్యాల ద్రవ్యోల్బణం 13.67 నుంచి 12.65 శాతానికి తగ్గింది.
రిటైల్ ద్రవ్యోల్బణం నెలనెలా తగ్గుముఖం పట్టడంతో రానున్న కాలంలో రుణ వడ్డీ రేట్లు తగ్గుతాయన్న అంచనాలు పెరిగాయి.
మరో ఆసక్తికర కథనం: మీ లవ్లీ పెట్ కోసమూ బీమా తీసుకోవచ్చు, నిశ్చింతగా ఉండొచ్చు