Business Loan From Government Schemes: సొంతంగా వ్యాపారం స్టార్ట్ చేయాలని చాలామంది కలలు కంటారు. కానీ, ఎక్కువ మంది ఆలోచనలు ఆగిపోయేది డబ్బు దగ్గరే. పెట్టుబడి లేక ఔత్సాహికుల ప్లాన్ పేపర్ మీదే ఆగిపోతుంది. మన దేశంలో ఈ సమస్యకు చాలా పరిష్కారాలు ఉన్నాయి. వర్ధమాన వ్యాపారవేత్తలకు సాయపడే చక్కటి పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది.
సూక్ష్మ, చిన్న & మధ్యతరహా సంస్థలు (MSMEలు), స్టార్టప్‌ల విషయంలో భారత ప్రభుత్వం చాలా క్లారిటీతో ఉంది. దేశ జీడీపీలో ఎంఎస్‌ఎంఈల ఆదాయాన్ని ప్రస్తుతమున్న 29% నుంచి 2024 చివరి నాటికి 50%కు పెంచాలని చూస్తోంది. తద్వారా 15 కోట్ల మందికి కొత్తగా ఉద్యోగాలు ఇవ్వొచ్చని అంచనా వేసింది.
మీరు కూడా సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలని ప్లాన్ చేస్తుంటే, దానికి సాయం చేయడానికి అనేక పథకాల ద్వారా సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
1. ప్రధాన మంత్రి ముద్ర యోజన
ఈ పథకం కింద మైక్రో యూనిట్స్ డెవలప్‌మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ (ముద్ర) బ్యాంకులు, వివిధ ఆర్థిక సంస్థలు తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు అందిస్తాయి. స్టార్టప్‌లు, సూక్ష్మ, చిన్న & మధ్యతరహా పరిశ్రమలకు (MSMEలు) సులభంగా రూ.10 లక్షల వరకు వ్యాపార రుణాలను అందించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఈ స్కీమ్‌లో, రుణ అర్హతను నిర్ణయించేందుకు మూడు రకాల విభాగాలు ఉన్నాయి:
శిశు: రూ.50,000 వరకు రుణం
కిషోర్: రూ.5 లక్షల వరకు రుణం
తరుణ్: రూ.10 లక్షల వరకు రుణం
2. క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ (CGTSME)
మైక్రో అండ్ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ కోసం క్రెడిట్ గ్యారెంటీ ట్రస్ట్ ఫండ్ (CGTMSE) అనేది భారత MSME మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన పథకం. ఇది స్టార్టప్‌లకు సాయపడుతుంది. ఈ చొరవ కింద, అర్హత కలిగిన స్టార్టప్‌లు, MSMEలకు 1 కోటి రూపాయల వరకు హామీ రహిత రుణాలు దొరుకుతాయి. CGTMSE ద్వారా లోన్ దొరుకుతుంది.
3. సర్టిఫికేషన్ స్కీమ్
జీరో డిఫెక్ట్ (ZED), జీరో ఎఫెక్ట్ మిషన్ ఇది. అధిక నాణ్యమైన ఉత్పత్తుల కోసం కొత్త & ఇప్పటికే ఉన్న తయారీ యూనిట్లను ప్రోత్సహించడం లక్ష్యం. ఈ పథకం సున్నా లోపాలతో ఉత్పత్తి చేసేలా తయారీదార్లను ప్రేరేపిస్తుంది. దీనికోసం ఆర్థిక సాయం, సాంకేతిక మద్దతు, అవసరమైన పరికరాలు అందుతాయి. దీనివల్ల కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం కూడా పెరుగుతుంది.
4. క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ స్కీమ్ (CLCSS) ఫర్ టెక్నాలజీ అప్‌గ్రేడేషన్
CLCSS ద్వారా, భారత్‌లోని స్టార్టప్‌లు, MSMEలకు టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ కోసం ప్రభుత్వం రూ.1 కోటి వరకు పెట్టుబడిపై 15% సబ్సిడీని అందిస్తుంది. కొత్త సాంకేతికతలు అందిపుచ్చుకోవడంలో సాయపడటం ద్వారా ఆంట్రప్రెన్యూర్స్ మధ్య పోటీతత్వాన్ని పెంచుతుంది.
5. MSMEల కోసం డిజైన్ క్లినిక్
ఏ ఆవిష్కరణకైనా డిజైన్ చాలా కీలకం. కొత్త ఉత్పత్తుల తయారీ, ప్రయోగాలు చేసేలా చిన్న వ్యాపారాలను ప్రోత్సహించే లక్ష్యంతో MSME మంత్రిత్వ శాఖ డిజైన్ క్లినిక్ ఏర్పాటు చేసింది. ఈ పథకం కింద, డిజైన్ సెమినార్‌కు హాజరు కావడానికి ప్రభుత్వం రూ. 60,000 వరకు సాయం అందిస్తుంది, సెమినార్ మొత్తం ఖర్చులో 75% వరకు కవర్ చేస్తుంది. MSMEలు, కొత్త వ్యాపారాలు, స్టార్టప్‌లు, ఏజెన్సీలు ఈ డిజైన్ క్లినిక్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
6. స్టార్టప్ ఇండియా
కొత్త స్టార్టప్‌లను ప్రోత్సహించడం ఈ స్కీమ్ లక్ష్యం. ఈ పథకం కింద, స్టార్టప్‌లకు మొదటి మూడేళ్ల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఆర్థిక సాయం కోసం ప్రభుత్వం రూ.10,000 కోట్ల ఫండ్ ఏర్పాటు చేసింది. ఇది కాకుండా, ఇంక్యుబేటర్లు, యాక్సిలరేటర్ల ద్వారా స్టార్టప్‌లకు గైడెన్స్ అందుతుంది.
7. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం (PMEGP)
చిన్న, మధ్యతరహా పరిశ్రమలను స్థాపించడానికి ఈ పథకం ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తారు. వివిధ వ్యాపారాలకు రూ.25 లక్షల వరకు లోన్ దొరుకుతుంది. భారీ మూలధనం లేకుండా కలలను సాకారం చేసుకోవాలనుకునే యువ పారిశ్రామికవేత్తలకు ఇది ఒక వరంలా వర్తిస్తుంది.
8. మేక్ ఇన్ ఇండియా
భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ఇది. దేశంలో తయారీ రంగాన్ని పెంచడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం లక్ష్యం. ఈ చొరవ కింద, వ్యవస్థాపకులు చౌక వడ్డీ రుణాలు సహా చాలా రకాల సాయాలు పొందుతారు. శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ చొరవలో భాగం.
9. ఆంట్రప్రెన్యూర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (EDP)
ఈ ప్రోగ్రామ్ కింద, చిన్న వ్యాపారవేత్తలకు వ్యాపారాలు ప్రారంభించడానికి ట్రైనింగ్, గైడెన్స్ అందుతుంది. వ్యాపారానికి సంబంధించిన వివిధ అంశాలపై శిక్షణ ఇస్తారు. మార్కెటింగ్ కోసం సాంకేతిక సాయం అందిస్తారు.
10. డిజిటల్ ఇండియా అండ్ ఇ-కామర్స్
ఈ చొరవ ద్వారా, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో ఉనికిని పెంచుకోవడానికి చిన్న వ్యాపారాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఉచితంగా లేదా సబ్సిడీ రేటుతో వెబ్‌సైట్‌ను రూపొందించడానికి సౌకర్యాలు అందిస్తుంది. ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో అమ్మడానికి సాయం కూడా చేస్తుంది.
11. షెడ్యూల్డ్ కులాలు, తెగల కోసం
SC, STల కోసం ప్రభుత్వం ప్రత్యేక పథకాలు రూపొందించింది. ప్రత్యేక సబ్సిడీలు, చాలా తక్కువ వడ్డీ రేట్లకు రుణాలను అందిస్తోంది.
పారిశ్రామికవేత్తగా స్థిరపడాలని మీరు కలలుకంటుంటే, ఈ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని మీ కలలను నిజం చేసుకోండి. పక్కా సమాచారం, సరైన ప్రణాళికతో మీ వ్యాపారాన్ని విజయవంతంగా స్టార్ట్ చేయండి.
మరో ఆసక్తికర కథనం: సౌదీ పంచ్‌కు చమురు రేట్ల పతనం - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవి