ED Raids On Ponguleti Srinivasa Reddy Properties: తెలంగాణలో మరోసారి ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఏకంగా మంత్రి నివాసంలోనే సోదాలు చేయడం రాజకీయంగా కూడా కాక రేపుతోంది. సమాచార, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖమంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసంలో తనిఖీలు సంచలనంగా మారుతున్నాయి. ఈ ఉదయం నుంచి ఏక కాలంలో 16 ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌డైరెక్టరేట్‌ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సీఆర్పీఎఫ్‌ భద్రత మధ్య సోదాలు జరుగుతున్నాయి. 


తనీఖీల్లో 16 బృందాలు  


హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని పొంగులేటి నివాసం, హిమాయత్‌సాగర్‌లోని ఫామ్‌హౌస్‌, పొంగులేటి కుమార్తె ఇల్లు, ఇతర బంధువుల ఇళ్లపై ఈ సొదాలు సాగుతున్నాయి. 16 బృందాలుగా విడిపోయి ఈడీ అధికారుల విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. 


అసెంబ్లీ ఎన్నికల టైంలో సోదాలు 


పొంగులేటని శ్రీనివాస రెడ్డి నివాసంలో గతంలో కూడా ఈడీ సోదాలు జరిగాయి. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల టైంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. నవంబర్‌ 3న ఖమ్మం, హైదరాబాద్‌లోని ఇళ్లు, ఆఫీసుల్లో రైడ్స్ నిర్వహించారు. ఇప్పుడు మరోసారి ఆ తనిఖీలకు కొనసాగింపుగానే ఈ సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. 


దాడులను ఖండించిన కాంగ్రెస్


ఈడీ దాడులపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ స్పందించారు. బీజేపీ చేస్తున్న కుట్రలోని భాగంగానే ఈడీ సోదాలు జరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్ నాయకులను భయపెట్టి వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బకొట్టడానికి చేస్తున్న కుట్రగా అభివర్ణించారు. సోనియా గాంధీని, రాహుల్ గాంధీని కూడా భయపెట్టడానికి నిరంతరం దాడులు చేశారన్నారు. కర్ణాటకలో డీకే శివకుమార్‌పై దాడి జరిగిందని గుర్తు చేశారు. ఇలాంటి దాడులతో కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమి లేదన్నారు. బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఎలాంటి చెడ్డ పేరు లేకుండా మంచి వ్యాపారవేత్తగా పేరున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై దాడులను ఖండిస్తున్నట్టు చెప్పారు. సీబీఐ, ఈడీని ఉపయోగించుకొని బిజేపియేతర ముఖ్యమంత్రులు, మంత్రులపై దాడులు చేస్తున్నారన్నారు. అన్ని రాష్ట్రాలలో ఆర్థికంగా బలపడిన కాంగ్రెస్ నాయకులు,ప్రతిపక్ష నాయకులనే టార్గెట్ చేసుకుంటున్నారని అన్నారు.