New Rule For Government Pension: ఇకపై ప్రభుత్వ ఉద్యోగం నుంచి పబ్లిక్ సెక్టార్ యూనిట్ (PSU) లోకి వెళ్ళిన వారు అక్కడ తీవ్రమైన అవకతవకలు చేస్తే వారి పదవీ విరమణ పెన్షన్‌ను రద్దు చేసే అవకాశం ఉంది. కేంద్ర పౌర సేవ (పెన్షన్) నిబంధనల్లో సవరణలు చేస్తూ ప్రభుత్వం ఈ కొత్త నిబంధనను అమలులోకి తెచ్చింది.

Continues below advertisement


కొత్త నిబంధన ఏమి చెబుతోంది?


మే 22న పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ (DoPPW) విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, PSUలో చేరిన తర్వాత తప్పుడు ప్రవర్తన లేదా అనైతికత కారణంగా తొలగిస్తే, ప్రభుత్వ ఉద్యోగ కాలంలో సంపాదించిన పెన్షన్ ప్రయోజనాలను రద్దు చేసే అవకాశం ఉంది. సంబంధిత మంత్రిత్వ శాఖ సమీక్షించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంటారు. 


ఏమిటి నిబంధన?


ముందు, PSUలో పనిచేస్తున్న ఉద్యోగిని తొలగించినట్లయితే, వారి ప్రభుత్వ ఉద్యోగంతో సంబంధించిన పెన్షన్, ఇతర పదవీ విరమణ ప్రయోజనాలు ప్రభావితం కావు. నిబంధన 37(29)(సి) ప్రకారం, PSUలో శిక్షాత్మక చర్యల వల్ల ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్‌పై ఎటువంటి ప్రభావం ఉండదని స్పష్టంగా తెలిపారు. కానీ ఇప్పుడు ఈ నిబంధనను మార్చి కొత్త నిబంధనను అమలులోకి తెచ్చారు.


సుప్రీం కోర్టు ఆదేశం తర్వాత మార్పు


జనవరి 9, 2023న సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశం తర్వాత ఈ సవరణ జరిగింది. "సురజ్ ప్రతాప్ సింగ్ vs  CMD BSNL" కేసులో ఈ ఆదేశం ఇచ్చింది, ఇందులో పెన్షన్ ప్రయోజనాల గురించి స్పష్టత కోరింది. కోర్టు ఆదేశాల ప్రకారం నిబంధనల‌లో సవరణలు చేస్తూ, ఇప్పుడు PSU నుంచి తొలగించిన తర్వాత ఆ వ్యక్తి అందే ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ రద్దు చేయవచ్చు.


ఈ నిబంధన ఎవరికి వర్తిస్తుంది?


ఈ కొత్త నిబంధన ప్రభుత్వ శాఖల పబ్లిక్ సెక్టార్ యూనిట్లలో శాశ్వతంగా చేరిన ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తుంది. ఉదాహరణకు, టెలికాం శాఖ నుంచి BSNLకి లేదా ఏదైనా ఇతర శాఖ నుంచి HAL, BHEL మొదలైన వాటికి బదిలీ అయిన ఉద్యోగులు ఈ రూల్ పరిధిలోకి వస్తారన్నమాట.


సమీక్ష నిబంధన కూడా ఉంటుంది


అయితే, ఈ నిర్ణయం ఫైనల్‌ కాదు. ఎవరైనా ఉద్యోగిని PSU నుంచి తొలగించినట్లయితే, ఆ నిర్ణయాన్ని సంబంధిత మంత్రిత్వ శాఖ సమీక్షిస్తుంది. అంటే పెన్షన్ రద్దు చేసే నిర్ణయాన్ని PSU మాత్రమే కాదు, మంత్రిత్వ శాఖ అనుమతితోనే తీసుకోవాలి. అక్కడ అధికారులు చర్యలకు ఓకే అంటే మాత్రం పింఛన్ పోతుంది. 


PSU ఉద్యోగులు మరింత జాగ్రత్తగా ఉండాలి


ప్రభుత్వం  ఈ కొత్త నిబంధన ద్వారా, PSUలో పనిచేస్తున్న మాజీ ప్రభుత్వ ఉద్యోగులు తమ ప్రవర్తన, పనితీరులో మరింత జాగ్రత్తగా ఉండాలి అని ఈ కొత్త నిబంధనలతో  స్పష్టమవుతోంది. అనైతికత లేదా తీవ్రమైన అవకతవకలు ఇప్పుడు ప్రస్తుత ఉద్యోగం మాత్రమే కాదు, గతంలో సంపాదించిన ప్రభుత్వ పెన్షన్‌ను కూడా ప్రమాదంలో పడేస్తాయి. ఈ విషయంలో ఉద్యోగులు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని అంటున్నారు ఉన్నతాధికారులు.