ICICI Bank-Videocon Fraud Case: ఐసీఐసీఐ బ్యాంకు మాజీ ఎండీ, సీఈవో చందాకొచ్చర్‌, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌కు బాంబే హైకోర్టు ఉపశమనం కల్పించింది. ఐసీఐసీఐ బ్యాంకు - వీడియోకాన్‌ కేసులో వారిని చట్టబద్ధంగా అరెస్టు చేయలేదని వ్యాఖ్యానించింది. లక్ష రూపాయల పూచీకత్తుతో మధ్యంతర బెయిల్‌కు అనుమతించింది.


ఐసీఐసీఐ బ్యాంకు - వీడియోకాన్‌ రుణాల మోసం కేసులో కొచ్చర్‌ దంపతులు విచారణకు సహకరించాలని ధర్మాసనం ఆదేశించింది. సీబీఐ ఎప్పుడు పిలిచినా ఆఫీసుకు వెళ్లాలని సూచించింది. 'పిటిషనర్ల (కొచ్చర్‌ దంపతులు) అరెస్టును మేం నిలిపివేస్తున్నాం. వారి అరెస్టు న్యాయ విరుద్ధంగా జరిగింది. అందుకే విడుదల చేస్తున్నాం' అని కోర్టు వెల్లడించింది. అలాగే పిటిషనర్లు తమ పాస్‌ పోర్టులను సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది.


సీబీఐ సాధారణ విచారణ చేపట్టి కొచ్చర్‌ దంపతులను అరెస్టు చేసిందని వారి తరఫు న్యాయవాది అమిత్‌ దేశాయ్‌ వాదించారు. తన భర్త వ్యాపారంలో ఏం జరుగుతుందో చందా కొచ్చర్‌కు తెలియదన్నారు. ఓ పురుష అధికారి ఆమెను అరెస్టు చేశారని, ఆ సమయంలో మహిళా అధికారులెవ్వరూ కనిపించలేదన్నారు. చట్టప్రకారం మహిళా అధికారి కచ్చితంగా ఉండాలని గుర్తు చేశారు. 


వీడియోకాన్‌ ‍‌గ్రూప్‌నకు ‍‌(Videocon Group) రుణాల మంజూరులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల మీద చందా కొచ్చర్‌ (Chanda Kochhar), ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌ను ‍‌(Deepak Kochhar) సీబీఐ గత శుక్రవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అవినీతి నిరోధక చట్టం కింద ఎలాంటి అనుమతి లేకుండానే తమను అరెస్టు చేశారని చందా కొచ్చర్‌, ఆమె భర్త బాంబే హై కోర్టుకు తెలిపారు. రిమాండ్ ఆర్డర్‌ను రద్దు చేయాలని తమ పిటిషన్‌లో న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కూడా చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌ న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు.


వీడియోకాన్ యజమాని వేణుగోపాల్ ధూత్‌ను (Venugopal Dhoot) కూడా సీబీఐ అరెస్ట్ చేసింది. రుణం మంజూరు చేసినందుకు చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌కు లంచం ఇచ్చిన ఆరోపణలపై వేణుగోపాల్ ధూత్‌ అరెస్ట్‌ అయ్యాడు. వీడియోకాన్‌ ‍‌గ్రూప్‌నకు లోన్ల జారీలో చందా కొచ్చర్ అనుచిత లబ్ధి పొందారన్న విషయం బయట పడడంతో, ఐసీఐసీఐ బ్యాంక్ CEO పదవి నుంచి 2018లో ఆమె వైదొలగవలసి వచ్చింది. 


ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate - ED) కూడా ఈ కేసును విచారణ చేస్తోంది. రూ. 7862 కోట్ల విలువైన 24 రుణాల మంజూరు కేసులను ఈడీ తవ్వుతోంది. చందా కొచ్చర్‌ ఆధ్వర్యంలోని ఐసీఐసీఐ బ్యాంకు, 2009 నుంచి 2018 మధ్యకాలంలో వీడియోకాన్‌కు అక్రమంగా ఈ రుణాలన్నీ ఇచ్చినట్లు ఈడీ అధికారులు భావిస్తున్నారు.