ICICI Bank Credit Card New Rules: ఈ మధ్య కాలంలో చాలా బ్యాంక్‌లు, క్రెడిట్ కార్డ్‌ జారీ కంపెనీలు క్రెడిట్‌ కార్డ్‌ రూల్స్‌ను కఠినంగా మారుస్తున్నాయి. గతంలో ఇచ్చిన ఆఫర్లు, ప్రయోజనాలను యూజర్ల నుంచి దూరం చేస్తున్నాయి. దేశంలోని అతి పెద్ద ప్రైవేట్‌ బ్యాంక్‌ల్లో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంకు కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. బీమా, విద్యుత్, నీటి బిల్లులు, ఇంధన సర్‌ఛార్జ్, కిరాణా కొనుగోళ్లపై ప్రయోజనాలను తగ్గించడమే కాకుండా విమానాశ్రయ లాంజ్‌లను ఉపయోగించడం కోసం ఖర్చు చేయాల్సిన పరిమితిని రెట్టింపు చేసింది. ఈ ఏడాది, ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్ రూల్స్‌ మారడం ఇది రెండోసారి. కొత్త నిబంధనలు ఈ ఏడాది నవంబర్ 15 నుంచి అమల్లోకి వస్తాయి.


స్కూల్‌, కాలేజీల్లో ఫీజు చెల్లిస్తే 1 శాతం టాన్జాక్షన్‌ ఫీజ్‌
ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డ్‌ను ఉపయోగించి క్రెడ్‌ (Cred), పేటీఎం ‍(Paytm), చెక్‌ (Check), మొబిక్విక్‌ (MobiKwik) వంటి థర్డ్ పార్టీ పేమెంట్ యాప్‌ల ద్వారా స్కూల్‌ లేదా కాలేజీ ఫీజు చెల్లించినందుకు ఒక శాతం లావాదేవీ రుసుమును బ్యాంక్‌ వసూలు చేస్తుంది. అయితే, ఇదే ఫీజ్‌ను మీరు పాఠశాల/ కళాశాల వెబ్‌సైట్ లేదా PoS మెషీన్ ద్వారా చెల్లింపు చేస్తే ఎలాంటి ఛార్జీ ఉండదు.


ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌లోకి యాక్సెస్‌ కోసం రెట్టింపు ఖర్చు
ఇప్పటి వరకు, ఎయిర్‌పోర్టు లాంజ్‌ను వినియోగించుకోవాలంటే ఏదైనా త్రైమాసికంలో ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్ ద్వారా రూ.35 వేలు వెచ్చించాల్సి వచ్చేది. ఇకపై, ఈ పరిమితిని రూ.75 వేలకు పెంచారు. ఇది ఒక త్రైమాసికంలో భారీ మొత్తం, సాధారణ యూజర్లకు పెద్ద షాక్‌. ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌లతో పాటు, ఈ బ్యాంక్‌తో లింక్ అయిన దాదాపు అన్ని కో-బ్రాండెడ్‌ క్రెడిట్ కార్డ్‌లకు కూడా ఈ నియమం వర్తిస్తుంది.


యుటిలిటీ, బీమా చెల్లింపులపై రివార్డ్‌ల్లో కోత
యుటిలిటీలు, ఇన్సూరెన్స్ పేమెంట్‌ చేసినందుకు ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డ్‌హోల్డర్లు ఇకపై తక్కువ రివార్డ్‌ పాయింట్లు పొందుతారు. ప్రీమియం కార్డ్ హోల్డర్లు యుటిలిటీ, బీమా చెల్లింపులపై ప్రతి నెలా రూ.80 వేల వరకు ఖర్చు చేస్తే రివార్డ్‌లు పొందుతారు. ఇతర కార్డుదారులకు ఈ పరిమితి రూ.40 వేలు మాత్రమే. ఒక నెలలో యుటిలిటీ చెల్లింపులు రూ.50 వేలు దాటితే 1 శాతం టాన్జాక్షన్‌ ఫీజ్‌ చెల్లించాలి. ఇది కాకుండా, కిరాణా & డిపార్ట్‌మెంటల్ స్టోర్ల ద్వారా లభించే రివార్డ్ పాయింట్లపై కూడా పరిమితి విధించారు. ఇక్కడ, ప్రీమియం కార్డుదారులు ప్రతి నెలా అదనంగా రూ.40 వేల వరకు ఖర్చు చేస్తేనే రివార్డులు పొందుతారు. మిగిలిన కార్డుదార్లు అదనంగా రూ.20 వేలు ఖర్చు పెట్టాలి.


ఇంధన సర్‌ఛార్జ్‌పై డిస్కౌంట్‌పై కొత్త పరిమితి
కార్డ్‌ హోల్డర్లు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్‌ కార్డ్‌ను ఉపయోగించి పెట్రోల్‌/డీజిల్‌ కొన్నప్పుడు ఇంధన సర్‌ఛార్జ్‌పై అందించే డిస్కౌంట్‌పై బ్యాంక్‌ కొత్త పరిమితిని నిర్ణయించింది. వివిధ రకాల కార్డ్‌లపై డిస్కౌంట్ల పరిమితి ఈ ఏడాది నవంబర్ 15 నుంచి మారుతుంది. డ్రీమ్‌ఫాక్స్‌ (Dreamfox) కార్డ్‌పై అందిస్తున్న 'స్పా యాక్సెస్'ను కూడా ఐసీఐసీఐ బ్యాంక్‌ నిలిపేసింది.


మరో ఆసక్తికర కథనం: దేశంలో 5 అత్యంత ఖరీదైన కార్లు, వాటి ఓనర్లు - తెలుగు వ్యక్తి దగ్గర టాప్‌ మోడల్‌