Internship Opportunities In Top-500 Companies In India: యువతలో నైపుణ్యాభివృద్ధి కోసం, ఉపాధి అవకాశాలు కల్పించడానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ‍‌(Finance Minister Nirmala Sitharaman) బడ్జెట్ 2024లో (Union Budget 2024) ప్రవేశపెట్టిన రూ.800 కోట్ల పీఎం ఇంటర్న్‌షిప్ పథకానికి (Prime Ministers Internship Scheme) దేశంలోని అగ్రస్థాయి సంస్థల నుంచి మంచి స్పందన లభించింది. ఇంటర్న్‌షిప్ పథకం కింద ఇప్పటివరకు 90,849 మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. దేశంలోని టాప్‌-500 కంపెనీల్లో ఏడాదికి కనీసం 1.25 లక్షల మంది యువతకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించడం ఈ పథకం లక్ష్యం. 21 నుంచి 24 ఏళ్ల యువత కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చారు. 


ఇంటర్న్‌షిప్ పథకంలో 24 రంగాల కంపెనీలు
కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of Corporate Affairs) ప్రకారం, ఇంటర్న్‌షిప్ పోర్టల్ ఈ 03 అక్టోబర్ 2024న ప్రారంభమైంది. బిజినెస్ స్టాండర్డ్ రిపోర్ట్‌ ప్రకారం, 193 కంపెనీలు యువతకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు అందించాయి. ఈ పోర్టల్‌లో... మారుతి సుజుకి ఇండియా, ఐషర్ మోటార్, ఎల్ అండ్ టీ (లార్సెన్ & టూబ్రో), రిలయన్స్ ఇండస్ట్రీస్, ముత్తూట్ ఫైనాన్స్, జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ వంటి పెద్ద కంపెనీలు కూడా ఉన్నాయి. దాదాపు 24 రంగాలకు చెందిన కంపెనీలు ఇంటర్న్‌షిప్ పథకంలో పాల్గొన్నాయి. వీటిలో చమురు, గ్యాస్, ఇంధనం, ప్రయాణం, ఆతిథ్యం, ఆటోమొబైల్, బ్యాంకింగ్, ఆర్థిక రంగాలకు చెందిన సంస్థలు ఉన్నాయి.


737 జిల్లాల్లో ఉద్యోగాలు
యువతకు పీఎం ఇంటర్న్‌షిప్ పథకం కింద కార్యకలాపాలు, నిర్వహణ, ఉత్పత్తి, తయారీ, నిర్వహణ, అమ్మకాలు, మార్కెటింగ్ వంటి దాదాపు 20 రంగాల్లో ఉపాధి కల్పిస్తున్నారు. దేశంలోని 737 జిల్లాల్లో ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఈ పథకం ద్వారా, ఐదేళ్లలో కోటి మంది యువతలో నైపుణ్యాలను పెంచేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. ఇంటర్న్‌షిప్‌లో భాగంగా, ఎంపికైన యువతకు దేశంలోని పెద్ద కంపెనీల్లో ఒక సంవత్సరం పాటు పని చేసే అవకాశం లభిస్తుంది. అక్కడ వాళ్లు నిజమైన పని అనుభవాలను, వ్యాపార ఒత్తిడిని ఎదుర్కోవడం గురించి నేర్చుకుంటారు. 


ఎలా అప్లై చేసుకోవాలి? 
పీఎం ఇంటర్న్‌షిప్‌ పథకంలో మీరు కూడా భాగం కావొచ్చు. ఆన్‌లైన్ పోర్టల్ www.pminternship.mca.gov.in లింక్‌ ద్వారా, దేశంలోని టాప్‌-500 కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.


ఇంటర్న్‌షిప్ స్కీమ్‌లో చేరడానికి ఇదే అర్హత
అప్లై చేసుకునేవాళ్లకు 21-24 ఏళ్ల వయస్సు ఉండాలి. కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ITI), పాలిటెక్నిక్ డిప్లొమా లేదా డిగ్రీ సర్టిఫికేట్ ఉన్నవాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పటికే ఉద్యోగాలు చేసేవాళ్లు లేదా ప్రస్తుతం రెగ్యులర్ డిగ్రీ చదువుతున్న వాళ్లు ఈ స్కీమ్‌లో భాగం కాలేరు. దూరవిద్య చేస్తున్న వాళ్లు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా (PM Jeevan Jyoti Bima), ప్రధానమంత్రి సురక్ష యోజన (PM Surakha Yojana) కింద ఉచిత బీమా కవరేజ్‌ లభిస్తుంది. నెలకు 5 వేల రూపాయలు ఆర్థిక సాయంగా అందుతుంది. అందులో కేంద్ర ప్రభుత్వం వాటా రూ.4,500 కాగా, కంపెనీ వాటా రూ.500. అభ్యర్థుల టాలెంట్‌ను బట్టి, కంపెనీలు ఇంతకంటే ఎక్కువ కూడా చెల్లించే అవకాశముంది.


మరో ఆసక్తికర కథనం: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ యాప్‌ ప్రారంభం - బ్రహ్మాండమైన ఫీచర్లు, ఆఫర్లు