ICICI - Bajaj Finance: దేశీయ స్టాక్ మార్కెట్‌లో ఫారిన్ ఫోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (FPIs) పెట్టుబడులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా, ఫైనాన్స్ రంగం మీద విదేశీ పెట్టుబడిదారులు ఎక్కువ ఫోకస్ పెట్టారు. తీసుకొస్తున్న ఫండ్స్‌లో పెద్ద మొత్తాన్ని ఆర్థిక రంగంలోని షేర్ల కొనుగోళ్ల కోసం వాడేస్తున్నారు.
జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో FPI ఇన్ ఫ్లోస్ రూ. 48,570 కోట్లు.
ఫారిన్ ఇన్ ఫ్లోస్ పెరగడంతో, ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో (2022 జులై-సెప్టెంబర్ త్రైమాసికం) బెంచ్‌మార్క్ నిఫ్టీ 8 శాతం పెరిగింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 వరుసగా 12 శాతం, 16 శాతం లాభపడ్డాయి.
అదనంగా కొన్న షేర్లు
జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో విదేశీ సంస్థాగత మదుపుదారులను ఎక్కువగా ఆకర్షించిన స్టాక్స్ ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank), బజాజ్ ఫైనాన్స్ (Bajaj Finance). ఈ మూడు నెలల కాలంలో, రూ. 64,991 కోట్ల విలువైన ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు, రూ. 25,708 కోట్ల విలువైన బజాజ్ ఫైనాన్స్ షేర్లను అదనంగా కొన్నారు. భారతి ఎయిర్‌టెల్‌లో రూ. 23,370, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో రూ. 21,906, హిందుస్థాన్ యూనిలీవర్‌లో రూ. 19,249 కోట్లను కుమ్మరించారు. ఇప్పటికే తమ పోర్ట్‌ఫోలియోల్లో ఉన్న ఈ కంపెనీల షేర్లకు వీటిని అదనంగా జోడించారు.
అమ్మేసిన షేర్లు
ఇదే మూడు నెలల కాలంలో, ఫారినర్లు కొన్ని ఇండియన్ షేర్లను విపరీతంగా అమ్మేశారు కూడా. రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) స్క్రిప్‌లను ఎక్కువగా వదిలించుకున్నారు. రూ. 44,622 కోట్ల విలువైన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లను, రూ. 17,838 కోట్ల విలువైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ షేర్లను, రూ. 16780 కోట్ల విలువైన ఇన్ఫోసిస్ షేర్లను, రూ. 7,037 పిరామల్ ఎంటర్‌ప్రైజెస్ షేర్లను, రూ. 4,720 ONGC కంపెనీ షేర్లను అమ్మేశారు.
ఫారిన్ ఇన్వెస్టర్లు ఒకేసారి వేల కోట్లు కుమ్మరిస్తారు లేదా వెనక్కు తీసుకుంటారు. కాబట్టి, వాళ్ల చల్లటి చూపు పడిన స్టాక్ ధరలు పెరుగుతాయి, కన్నెర్ర జేసిన స్టాక్ ధరలు పడిపోతాయి. FPIల నుంచి అత్యధిక ఇన్ ఫ్లోలను చూసిన మొదటి ఐదు కంపెనీల షేర్ ధరలు బాగా పెరిగాయి. అత్యధిక ఔట్ ఫ్లో ఉన్న కంపెనీల షేర్ ధరల్లో కరెక్షన్‌ను చూశాయి.
అమ్మకాల కంటే FPIల కొనుగోళ్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో... 764 NSE లిస్టెడ్ కంపెనీల్లో ఫారిన్ ఫండ్ మేనేజర్ల వాటా పెరిగింది. PRIME ఇన్ఫోబేస్ విశ్లేషణ ప్రకారం, ఈ కంపెనీల స్టాక్ ప్రైస్ సగటున 19.5 శాతం లాభాన్ని నమోదు చేశాయి. 552 కంపెనీల్లో విదేశీ పెట్టుబడి సంస్థల షేర్ హోల్డింగ్ క్షీణించింది. ఈ కౌంటర్లు తమ స్టాక్ ధరలు సగటున 12 శాతం పెరిగాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.