ఎమ్మెల్యే కొనుగోలు కేసులో ప్రశ్నలతో తెలంగాణ సిట్ అధికారులు సిద్ధంగా ఉన్నారు. మరి ఆ నలుగురు వస్తారా ఇప్పుడు ఇదే తెలంగాణలో హాట్ టాపిక్. ఎలాంటి అరెస్టులు వద్దని ఇప్పటికే హైకోర్టు ఆదేశించింది. మరి వాళ్లు రాకుంటే ఎలాంటి పరిణామాలు ఉంటాయి. సిట్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది. ఇదే చర్చనీయాంశంగా మారింది. 


ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలకంగా వ్యవహరించారని భావిస్తున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌్ సహా నలుగురికి నోటీసులు ఇచ్చింది సిట్. 21న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఇది తెలంగాణ రాజకీయాల్లోనే సంచలనంగా మారింది. 


బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్‌, కొచ్చిలోని అమృత ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌ వైద్యుడు జగ్గుస్వామి, కేరళలోని భారత్‌ ధర్మ జనసేన పార్టీ అధ్యక్షుడు తుషార్‌, కరీంనగర్‌ న్యాయవాది శ్రీనివాస్‌ను సిట్ విచారణకు పిలిచింది. 41ఏ సీఆర్పీసీ నోటీసులు అందజేసింది. 


ఈ రూల్స్ ప్రకారం నోటీసులు అందుకుంటే కచ్చితంగా వ్యక్తిగతంగా హాజరుకావాల్సి ఉంటుంది. కానీ ఈ నలుగురు ఏం చేస్తారో అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ విచారణకు హాజరైతే... సిట్ అధికారులు ఎలాంటి ప్రశ్నలు అడబోతున్నారు... వాళ్లు ఎలాంటి సమాధానం చెప్తారన్నది ఆసక్తిగా మారింది. ఆరోగ్య కారణంగాలు, ఇతర ముందస్తు కార్యక్రమాలు ఉంటే తప్ప కచ్చితంగా విచారణకు కావాల్సి ఉంటుంది. 


అరెస్టులు వద్దని చెప్పిన హైకోర్టు 


ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీకి షాకిచ్చింది తెలంగాణ హైకోర్టు. జాతీయ ప్రధాన కార్యదర్శి బిల్ సంతోష్ కు సిట్ నోటీసులపై స్టే విధించాలని బీజేపీ హైకోర్టును ఆశ్రయించగా.. సిట్ నోటీసులను రద్దు చేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఫామ్ హౌస్ కేసులో బీఎల్ సంతోష్ కు సిట్ నోటీసులపై బీజేపీ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. అయితే తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆయనను అరెస్ట్ చేయడానికి వీలు లేదని హైకోర్టు సూచించింది. సిట్ వేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను సైతం హైకోర్టు విచారించింది. ఢిల్లీలో ఓ వ్యక్తికి నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసులు సహకరించడం లేదని హైకోర్టుకు తెలపగా.. కేసు దర్యాప్తునకు అంతరాయం కలిగించవద్దని ఢిల్లీ పోలీస్ కమిషనర్ ను ఆదేశించాలని సిట్ కోరింది. తదుపరి విచారణను మంగళవారానికి హైకోర్టు వాయిదా వేసింది.


బిఎల్ సంతోష్, శ్రీనివాస్ లకు 41 (ఏ)Crpc నోటీసులు ఇవ్వడం మీడియాకు ఎలా లీక్ అవుతున్నాయని హైకోర్టు ప్రశ్నించింది. ఇక్కడి సిట్ పోలీసులు ఢిల్లీకి నోటీసులు ఇవ్వడానికి వెళ్లగా స్థానిక ఎన్నికలు ఉన్నందున నోటీసులు ఇచ్చేందుకు అక్కడి పోలీసులు నిరాకరించారని లాయర్ తెలిపారు. ఈ విషయంపై ఢిల్లీ పోలీసులు బిఎల్ సంతోష్ కు నోటీసులు సర్వ్ చేస్తారని హైకోర్టు చెప్పింది. ఢిల్లీ పోలీసులకు 41 (ఏ) నోటీసులు సిట్ అధికారులు ఇచ్చిన తరువాత బీజేపీ నేతకు విచారణకు సంబంధించి సిట్ నోలీసులను పోలీసులు ఇస్తారని మొన్నటి విచారణలో వెల్లడించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎలాంటి అరెస్ట్ చెయ్యడానికి వీల్లేదని స్పష్టం చేసిన హైకోర్టు.. సిట్ దర్యాప్తుపకు సహకరించాలని బీఎల్ సంతోష్ ను ఆదేశించింది.


ఫామ్ హౌస్ కేసులో సిట్‌ దూకుడు తెలంగాణలో రాజకీయంగా కాక రేపుతోంది. పలువురు ప్రజాప్రతినిధులు, బీజేపీ సానుభూతిపరులకు నోటీసులు ఇవ్వడం దుమారం రేగుతోంది. అలెర్ట్‌ అయిన బీజేపీ విషయాన్ని కోర్టులో తేల్చోవాలని చూస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ దూకుడు పెంచింది. కేసులో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉందని అనుమానిస్తున్న వారిని పిలిచి విచారించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఈ కేసులో అరెస్టైన వారు ఇచ్చిన సమాచారం. వీడియోలో ప్రస్తావనకు వచ్చిన వారికి నోటీసులు జారీ చేసింది.