DH Srinivasarao : తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఇటీవల మెడికల కాలేజీల ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ కాళ్లకు నమస్కారం చేశారు. సీఎం కేసీఆర్ కు ఓ ఉత్తరం లాంటిది ఇచ్చిన అనంతరం కాళ్లకు మొక్కారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేగింది. ఉన్నత స్థాయి అధికారి అయిన డీహెచ్ శ్రీనివాసరావు సీఎంకు పాదాభివందనం చేయడం ఏంటని నెటిజన్లు, ప్రతిపక్ష నేతలు విమర్శించారు. ఈ ఘటనపై డీహెచ్ శ్రీనివాసరావు తాజాగా స్పందించారు. కొత్తగూడెంలో ఆదివారం నిర్వహించిన వన మహోత్సవంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌కు పాదాభివందనం చేయడాన్ని కొందరు కావాలనే రాద్ధాంతం చేశారన్నారు. సీఎం కేసీఆర్ తనకు పితృ సమానులని ఒక్కసారి కాదు వందసార్లు మొక్కుతానన్నారు. బంగారు తెలంగాణ దిశగా సాగుతున్న పాలనా దక్షుడు సీఎం కేసీఆర్ అన్నారు. ఆయన పాదాలు తాకడం అదృష్టంగా భావిస్తానని డీహెచ్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
కేసీఆర్ మరో బాపూజీ
భద్రాద్రి- కొత్తగూడెం ప్రాంతానికి సీఎం కేసీఆర్ కొత్త వైద్యశాలను కేటాయించారని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. తెలంగాణకు కేసీఆర్ మరో బాపూజీ అన్నారు. కొత్తగూడెం ప్రాంతంలో కాలేజీలు లేకపోవడం వల్ల 30 ఏళ్ల క్రితం ఎంబీబీఎస్ చేయడానికి తాను హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ దాకా వెళ్లాల్సి వచ్చిందని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ ఇటీవల ఎనిమిది నూతన మెడికల్ కాలేజీలను వర్చువల్‌గా ప్రారంభించారు. సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, రామగుండంలో ఎనిమిది నూతన మెడికల్ కాలేజీలు ఏర్పాటుచేశారు. ఈ కాలేజీల్లో ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ తరగతులు ప్రారంభమయ్యాయి.
ఎమ్మెల్యే టికెట్ కావాలంటా?
సీఎం కేసీఆర్ పై, అధికార యంత్రాంగం తరచూ స్వామి భక్తిని ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే అనేక మంది కలెక్టర్లు, కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులు సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కి విమర్శలు ఎదుర్కొన్నారు. తాజాగా తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు కేసీఆర్ కాళ్లు మొక్కిన ఘటన కూడా వైరల్ అయింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న చాలామంది అధికారులు సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కడం చర్చనీయాంశం అయింది. దీంతో సోషల్ మీడియాలో డీహెచ్ శ్రీనివాసరావుపై తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల కాలంలో అధికారుల పాద పూజలు పెరిగిపోతున్నాయని సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ బానిసత్వానికి కేరాఫ్ గా మారిందని ఈ వీడియో పై విమర్శలు గుప్పించారు. మరి కొందరు కొత్తగూడెం ఎమ్మెల్యే టికెట్ కావాలంటా అని మెసేజ్ పెడుతున్నారు.
కలెక్టర్లు కూడా
సిద్దిపేట, కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ భవనాల ప్రారంభించిన సమయంలో ఆయా జిల్లాల కలెక్టర్లు వెంకట్రామారెడ్డి, శరత్ సీఎం కేసీఆర్ కు అప్పట్లో పాదాభివందనం చేశారు. అప్పట్లో కేసీఆర్ కాళ్లు మొక్కిన కలెక్టర్ల తీరుపై ఆసక్తికర చర్చ జరిగింది. అంతకు ముందు మంత్రి సత్యవతి రాథోడ్ కూడా సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులు ఇలా కేసీఆర్ కాళ్లు మొక్కి సమాజానికి ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.