శాంసంగ్ గెలాక్సీ ఏ52 స్మార్ట్ ఫోన్‌కు ఆండ్రాయిడ్ 13 ఆధారిత వన్ యూఐ 5.0 అప్‌డేట్‌ను అందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన బీటా అప్‌డేట్‌ను సెప్టెంబర్‌లోనే అందించగా ఇప్పుడు స్టేబుల్ అప్‌డేట్‌ను రోల్ అవుట్ చేస్తున్నారు. శాంసంగ్ ప్రత్యర్థి కంపెనీలు అయిన షావోమీ, రియల్‌మీ, ఐకూ, వన్‌ప్లస్ బ్రాండ్లు కూడా ఇప్పటికే కొన్ని ఫోన్లకు ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్‌ను అందిస్తున్నాయి.


ఆండ్రాయిడ్ 13 ఆధారిత వన్ యూఐ 5.0 అప్‌డేట్ ద్వారా శాంసంగ్ గెలాక్సీ ఏ52కి కొన్ని పర్సనలైజేషన్ ఆప్షన్లు రానున్నాయి. ఇది స్మార్ట్ ఫోన్‌కు అదనంగా కొన్ని ఫీచర్లను అందించనుంది. ఈ కొత్త ఫీచర్లలో కొన్ని ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టంకు సంబంధించినవి కాగా, కొన్ని వన్ యూఐకి సంబంధించినవి.


ఈ కొత్త అప్‌డేట్ ద్వారా ఏకంగా 16 కొత్త కలర్ థీమ్స్ అందుబాటులోకి రానున్నాయి. మల్టీపుల్ విడ్జెట్లను కూడా హోం స్క్రీన్‌లో కంబైన్ చేసే ఆప్షన్ రానుంది. వన్ యూఐ 5.0లో కూడా కొన్ని కొత్త ఫీచర్లు ఉన్నాయి. సెట్టింగ్స్‌లో అబౌట్ ఫోన్‌లోకి వెళ్లి అక్కడ మీ ఫోన్ అప్‌డేట్ చేసుకోవచ్చు. కొన్ని ఐవోఎస్ 16 తరహా ఫీచర్లు కూడా ఈ అప్‌డేట్‌తో రావడం విశేషం. ఇందులో లాక్ స్క్రీన్ పర్సనలైజేషన్ ఫీచర్ కూడా ఉండటం విశేషం.


శాంసంగ్ గెలాక్సీ ఏ52 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోఎల్ఈడీ ఇన్‌ఫినిటీ-ఓ డిస్ ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 720జీ ప్రాసెసర్‌పై శాంసంగ్ గెలాక్సీ ఏ52 పనిచేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.


ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఫోన్ వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్‌గా ఉండగా, దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 5 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా అందించారు. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.


ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్ యూఐ 3.0 ఆపరేటింగ్ సిస్టంపై శాంసంగ్ గెలాక్సీ ఏ52 పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గా కాగా, 25W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 4జీ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఈ ఫోన్‌లో అందించారు. దీని మందం 0.84 సెంటీమీటర్లు కాగా, బరువు 189 గ్రాములుగా ఉంది.


Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?