భారతదేశంలోని స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు సమీప భవిష్యత్తులో ఛార్జింగ్ కోసం సాధారణ USB టైప్-సీ పోర్ట్‌తో రావచ్చు. ఎలక్ట్రానిక్ పరికరాల కోసం యూనిఫాం ఛార్జింగ్ పోర్ట్‌గా USB టైప్-సీని స్వీకరించడానికి సెంట్రల్ ఇంటర్ మినిస్టీరియల్ టాస్క్ ఫోర్స్ ఏకాభిప్రాయానికి వచ్చింది. శాంసంగ్, యాపిల్ వంటి స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లతో పాటు పరిశ్రమల సంఘాలు, విద్యా సంస్థలు, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల నుంచి టాస్క్‌ఫోర్స్ ప్రతినిధులను ఏర్పాటు చేసింది. కామన్ ఛార్జింగ్ పోర్ట్ రోల్ అవుట్‌ను దశలవారీగా నిర్వహిస్తారని భావిస్తున్నారు.
స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌ల వంటి ఎలక్ట్రానిక్ పరికరాల కోసం USB టైప్-సీ పోర్ట్‌ను ప్రామాణిక ఎంపికగా స్వీకరించాలని టాస్క్‌ఫోర్స్ సూచించింది. స్మార్ట్‌వాచ్‌ల వంటి వేరబుల్ డివైజ్‌ల విషయంలో కూడా ఇది సాధ్యం అవుతుందో లేదో అంచనా వేయడానికి వినియోగదారుల వ్యవహారాల శాఖ ఒక సబ్ గ్రూప్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఫీచర్ ఫోన్‌లు కూడా ప్రామాణిక ఛార్జింగ్ పోర్ట్‌ను పొందాలా వద్దా అనే దానిపై కూడా చర్చించారు.
USB టైప్-సీని ప్రామాణిక ఛార్జింగ్ పోర్ట్‌గా స్వీకరించడం వల్ల ఎలక్ట్రానిక్ వ్యర్థాలపై కలిగే ప్రభావాన్ని అంచనా వేయడానికి పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (MoEFCC) ఒక అధ్యయనాన్ని నిర్వహించాలని సమావేశంలో వాటాదారులు సూచించారు. దాని రోల్ అవుట్‌ను దశలవారీగా నిర్వహించాలని అంగీకరించారు.
ఈ రోల్‌అవుట్‌ను ఎప్పుడు నిర్వహించాలనే విషయంలో ఎటువంటి టైమ్ లిమిట్‌ను పెట్టుకోలేదు. ది ఎకనమిక్ టైమ్స్ నివేదిక ప్రకారం యూరోప్‌లో యూరోపియన్ యూనియన్ (EU) చట్టం అమలులోకి వచ్చిన తర్వాత భారతదేశంలో ఈ మార్పులను అమలు చేయవచ్చని ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్ సూచించారు. దీని కారణంగా యాపిల్ మీదనే ఎక్కువ ప్రభావం పడనుందని అంచనా.
ప్రామాణిక ఛార్జింగ్ పోర్ట్‌గా USB టైప్-సీని తప్పనిసరి చేసే EU చట్టం 2024లో అమల్లోకి వస్తుంది. దీంతో వచ్చే సంవత్సరం లాంచ్ కానున్న ఐఫోన్ 15 సిరీస్‌లో యూఎస్‌బీ టైప్-సీ పోర్టే ఉంటుందని అనుకోవచ్చు. ప్రస్తుతం ఐఫోన్లలో లైట్నింగ్ కనెక్టర్‌ను అందిస్తున్నారు.
Also Read: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?