Minister Harish Rao : ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్, బదిలీలపై సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. ఉద్యోగుల విషయంలో తమది ఫ్రెండ్లీ ప్రభుత్వం అన్నారు. తెలంగాణలో విద్యారంగాన్ని పట్టించుకోవడం లేదని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి హరీశ్‌ రావు ఆరోపించారు. అలాంటి విమర్శలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ లో పీఆర్‌టీయూఎస్‌ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... టీచర్ల రిక్రూట్‌మెంట్‌పై సీఎం కేసీఆర్‌ సానుకూలంగా ఉన్నారన్నారు. ఉపాధ్యాయులకు ఎలాంటి సమస్యలు వచ్చినా టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. త్వరలో ఎంప్లాయీస్‌ హెల్త్ కార్డు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. 


మరో 9 మెడికల్ కాలేజీలు 


విద్యారంగానికి అవసరమైన నిధులు కేటాయిస్తున్నామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. వైద్య విద్య కోసం రూ.2350 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక  12 వైద్య కళాశాలలు తెచ్చామన్నారు. తెలంగాణలో ఉపాధ్యాయులకు మంచి వేతనాలు అందుతున్నాయన్నారు. టీచర్ల బదిలీలు, పదోన్నతుల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. సీపీఎస్ సమస్యను సీఎం కేసీఆర్ తో చర్చిస్తామని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. జిల్లాకో మెడికల్ కాలేజీ లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుందన్నారు. ఇప్పటి వరకు 12 మెడికల్‌ కాలేజీలను ఏర్పాటుచేశాని తెలిపారు. దేశంలో ఎక్కడలేని విధంగా ఒక్క ఏడాదిలోనే ఎనిమిది మెడికల్ కాలేజీలు ప్రారంభించామన్నారు. వచ్చే ఏడాది మరో 9 మెడికల్ కాలేజీలు ప్రారంభింస్తామని చెప్పారు. తెలంగాణ ఏర్పడినప్పుడు 295 రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఉండగా, ఇప్పుడు 920కి పెరిగాయన్నారు. 4.46 లక్షల మంది పిల్లలకు బోధన అందిస్తున్నామన్నారు. రాష్ట్ర బడ్జెట్ లో 10 శాతం కేవలం విద్యపై ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. దేశ జీడీపీ తెలంగాణ కన్నా తక్కువే అన్నారు.  


తెలంగాణ దేశానికే ఆదర్శం 


తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే అసలు నిజాలు తెలుస్తాయని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రతి రంగంలో అభివృద్ధి చెందుతున్న తెలంగాణ దేశానికే ఆదర్శమన్నారు. మంచి చెడును విశ్లేషించిన నాయకత్వం కలిగిన ఉపాధ్యాయులు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని తెలియజేయాలని కోరారు. వైద్య ఆరోగ్య శాఖలో వివిధ వైద్య విద్య కోర్సులు అందులోకి వచ్చాయన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు 850 ఎంబీబీఎస్‌ సీట్లు మాత్రమే ఉండేవని, ప్రస్తుతం 2950కి పెరిగాయన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉస్మానియా గాంధీ కాకుండా 3 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవని మంత్రి హరీశ్ రావు గుర్తు చేశారు. 


త్వరలో 58 టిఫా ఏఎన్ఎంలు 


హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని కళాభవన్‌లో ఏఎన్ఎంల రెండో మహాసభలకు మంత్రి హరీశ్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. కొవిడ్ సమయంలో ఏఎన్ఎంలు చేసిన విశేష సేవలకు ఎంతో రుణపడి ఉన్నామన్నారు. అందరూ కలిసి ఆరోగ్య తెలంగాణను నిర్మించాలన్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా గర్భిణుల కోసం  58 టిఫా స్కానింగ్‌ కేంద్రాలు ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. ఏఎన్ఎం కేంద్రాలను పల్లె దవాఖానాలుగా మారుస్తున్నట్టు ప్రకటించారు. 2014లో గవర్నమెంట్ ఆసుపత్రుల్లో 30 శాతం డెలివరీలు అయ్యేవని ప్రస్తుతం 67 శాతానికి పెరిగాయన్నారు. గర్భిణీలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఏఎన్ఎంలు కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు.