Congress Political Crisis:
కార్యకర్తలకు- లీడర్లకు గ్యాప్ తగ్గించాలి..
దాదాపు పదేళ్లుగా కాంగ్రెస్ పతనమవుతూనే ఉంది. ఒకటి, రెండు రాష్ట్రాలు మినహా మరే రాష్ట్రాల్లోనూ ఉనికి కాపాడుకోలేకపోతోంది. పూర్వవైభవం మాట అటుంచితే..కనీసం మనుగడ సాగించినా చాలు అనుకునే పరిస్థితుల్లో ఉంది ఆ పార్టీ. అంతర్గత కలహాలతోనే ఇలా పతనమైందన్నది బహిరంగ రహస్యం. నాయకులందరినీ గాంధీ కుటుంబమే వెనకుండి నడిపిస్తుందని, ఎంత సీనియర్ నేత అయినా..వారి మాట చెల్లదని రాజకీయాల్లో వినిపించే మాట. కానీ...మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక...పార్టీలో చాలా మార్పులు వస్తాయని అంచనా వేస్తున్నారు. గాంధీ కుటుంబంలో కాకుండా వేరే వ్యక్తి అధ్యక్ష పదవిలో ఉండడం వల్ల అప్పుడే మార్పులు మొదలయ్యాయనీ అంటున్నారు. అందుకు తగ్గట్టుగానే...ఖర్గే పార్టీలోని సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా...పార్టీ కార్యకర్తలకు, లీడర్లకు మధ్య ఉన్న ఖాళీని పూరించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. త్వరలోనే "కాంగ్రెస్ జన సంపర్క్" క్యాంపెయిన్‌ను మొదలు పెట్టనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా...కార్యకర్తలకు, నేతలకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించాలని భావిస్తున్నారు. ఢిల్లీలోని పార్టీ హెడ్‌క్వార్టర్స్‌లో నవంబర్ 21న ఉదయం రెండు గంటల పాటు పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమయంలో ఖర్గేను అపాయింట్ మెంట్ లేకుండానే ఎవరైనా నేరుగా వెళ్లి కలిసే అవకాశముంది. రెండు రోజుల పాటు ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నారు.
బలోపేతం..
గతంలోనూ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ ఎన్నికైనప్పుడు ఇలాంటి సమావేశాలు నిర్వహించారు. కానీ...ఆ తరవాత ఆపేశారు. ఈ సారి కూడా ఇదే రిపీట్ అవుతుందా అన్నది తేలాల్సి ఉంది. కాంగ్రెస్‌ను బలోపేతం చేయడమే తన లక్ష్యమని ఖర్గే ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పారు. కార్యకర్తల్ని పార్టీకి దగ్గర చేయడంపైనా దృష్టి సారిస్తానని వెల్లడించారు. వారి సమస్యలను వింటూ పరిష్కరించే ప్రయత్నాలు చేస్తానని తెలిపారు. పార్టీ కార్యకర్తలెవరైనా తనను నేరుగా వచ్చి కలవొచ్చని చెప్పారు.
రాజస్థాన్‌పై క్లారిటీ ఏది..?
ఖర్గే అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే రాజస్థాన్‌లోని రాజకీయ పరిణామాలు సవాల్ విసిరారు. అయితే...ఖర్గే రాజస్థాన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవటం లేదని తెలుస్తోంది. గహ్లోట్‌ను సీఎం కుర్చీ నుంచి పక్కకు తప్పించడంపై మల్లికార్జున్ ఖర్గే ఏ మాత్రం ఆసక్తిగా లేరని సమాచారం. అంటే...పరోక్షంగా సచిన్ పైలట్ వర్గాన్ని "సైలెంట్"గా ఉండమని హెచ్చరించినట్టే. రాజస్థాన్ రాజకీయాల్లో అలజడి రేపిన గహ్లోట్‌పై చర్యలు తీసుకోవాలని అధిష్ఠానం భావించటం లేదట. నిజానికి...పైలట్, గహ్లోట్ ఫైట్ చాన్నాళ్లుగా కొనసాగుతోంది. అధిష్ఠానానికి ఇది తలనొప్పి తెచ్చి పెడుతోంది. అయినా...ఎందుకు పరిష్కరించకుండా వదిలేస్తున్నారనేదే అర్థం కావట్లేదు. ఖర్గే అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక...అశోక్ గహ్లోట్‌తో భేటీ అయ్యారు. చాలా సేపు మాట్లాడుకున్నారు. ఆ సమయంలోనే పైలట్ విషయం ప్రస్తావించి ఉంటారని తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలనేదీ చర్చించారట.
Also Read: Maharashtra: ఠాక్రేకు షాక్ ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు, ఈసీ నిర్ణయం సరైందేనన్న న్యాయస్థానం