WFH vs WFO: 


కంపెనీలేమో ఆఫీసులకు రమ్మంటున్నాయి. ఉద్యోగులేమో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ (Work From Home) కావాలంటున్నారు. అటు యాజమాన్యాలు ఇటు ఉద్యోగుల మధ్య ఇది ఘర్షణకు దారితీస్తోంది. అయితే హైబ్రీడ్‌ వర్క్‌ కల్చర్‌ను కొనసాగించడమే మంచిదని విశ్లేషకులు అంటున్నారు. ఎక్కువ శాతం మంది ఫ్లెక్సిబిలిటీని (Flexibility) కోరుకుంటున్నారని ఓ సర్వేలో తేలింది. వర్క్‌ లైఫ్‌ బ్యాలెన్స్‌కు ఇదెంతగానో ఉపయోగపడుతోందని వెల్లడించింది. రెండు వర్గాలకూ ఇది విన్‌ విన్‌ సిచ్యువేషన్‌గా తెలిపింది.


సీల్‌ హెచ్‌ఆర్‌, ఎకనామిక్‌ టైమ్స్‌ సంయుక్తంగా ఓ సర్వే నిర్వహించాయి. వివిధ రంగాల్లోని 3800 పైగా ఉద్యోగులు ఇందులో పాల్గొన్నారు. వారిలో 76 శాతం మందికి పైగా ఉద్యోగులు హైబ్రీడ్‌ లేదా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఇవ్వాలని కోరుతున్నారు. ఒకవేళ కంపెనీలు ఆఫీసులకు రమ్మని ఒత్తిడి చేస్తే, ఫ్లెక్సిబిలిటీకి అంగీకరించకపోతే ఇతర అవకాశాలను అన్వేషిస్తామని 73 శాతం మంది కుండ బద్దలు కొట్టారు. ఇక 35 శాత మంది కార్యాలయాల్లో ఎక్కువ రోజులు పనిచేయాలన్న నిర్ణయాన్ని స్వాగతించారు.


జేపీ మోర్గాన్‌ ఛేజ్‌, గోల్డ్‌మన్‌ సాచెస్‌, మెటా, టీసీఎస్‌ వంటి కంపెనీలు ఉద్యోగులను ఆఫీసులకు రావాలని ప్రోత్సహిస్తున్నాయి. కరోన సమయంలో విపరీతంగా క్రేజ్‌ పొందిన జూమ్‌ సైతం 50 మైళ్ల దూరంలోని ఉద్యోగులు వారానికి రెండు రోజులు ఆఫీసులకు రావాలని పిలుపునిచ్చింది. అయితే అనుభవజ్ఞులు మాత్రం హైబ్రీడ్‌ విధానం ఇద్దరికీ మంచిదని చెబుతున్నారు. 'నూతన పని వాతావరణం, పద్దతులు, ఉద్యోగులు ఇష్టాలకు మధ్య కంపెనీలు సమతూకం తీసుకురావాలి. వేగంగా మారుతున్న ప్రపంచంలో ఉత్పత్తి పెరగాలన్నా, ప్రతిభావంతులు తమవద్దే ఉండాలంటే ఇది తప్పదు' అని సీఎల్‌ హెచ్‌ సీఈవో ఆదిత్య నారాయణ అన్నారు.


కరోనా మహమ్మారి తర్వాత హైబ్రీడ్‌ పని విధానానికే ఉద్యోగులు ఎక్కువగా ప్రధాన్యం ఇస్తున్నారని డెలాయిట్‌ ఇండియా డైరెక్టర్ నీలేశ్‌ గుప్తా అన్నారు. 'ఇప్పుడు ఉద్యోగులు ఎంత పనిచేస్తున్నారో  కొలిచే పద్ధతులు మారిపోయాయి. ఎన్ని గంటలు పనిచేశారన్నది కాకుండా ఎంత పని చేస్తున్నారన్నదే ముఖ్యం. అందుకే పని పూర్తయ్యేంత వరకు ఉద్యోగులు ఫ్లెక్సిబిలిటీ కోరుకుంటున్నారు. అప్పుడే వ్యక్తిగత, ఉద్యోగ జీవితాలు బాగుంటాయని నమ్ముతున్నారు' అని ఆయన అన్నారు. ఉద్యోగుల కోసం కంపెనీలూ మారుతున్నాయి. 88 శాతం కంపెనీలు ఏదో ఒక రకంగా ఫ్లెక్సిబిలిటీని ఆఫర్‌ చేస్తున్నాయని ఆయన తెలిపారు.


ఐటీసీ ఆఫీసుల నుంచే పని చేయాలని ఆదేశించింది. అయితే వైట్‌కాలర్‌ ఉద్యోగులు వారానికి రెండు రోజులు ఇంటి నుంచి పనిచేసేందుకు అనుమతిస్తోంది. కొన్ని సర్వేల ఫలితాలు సమీక్షించాక డీబీఎస్‌ బ్యాంకు హైబ్రీడ్‌ పని విధానానికి ఏర్పాట్లు చేసింది. ఫ్రంట్‌లైన్‌ స్టాఫ్‌ బ్రాంచుల్లో పనిచేస్తుండగా మిగతా ఉద్యోగుల్లో 60-40 నిష్పత్తిలో హైబ్రీడ్‌ విధానంలో కొనసాగుతున్నారు. ఉద్యోగులు ఈ విధానాన్ని ఎంతగానో ఇష్టపడుతున్నారని అంతర్గత సర్వేల్లో తేలింది. తమ కోసం కంపెనీ ఇలాంటి ఏర్పాటు చేయడంతో 83 శాతం మంది ఆనందంగా ఉన్నారు. ఈ విధానం అటు సమాజం, వాతావరణం, ప్రకృతి ఇటు ఉద్యోగులకూ మంచిదేనని వివిధ సర్వేలు తెలిపాయి.


Also Read: ఆధార్‌తో బ్యాంక్‌ అకౌంట్‌ హ్యాక్‌ చేయొచ్చా!