Fastag e-KYC Update Last Date: ఊరు వెళ్లడానికో, షికారు కోసమో, మరేదైనా పని మీదో.. కారు తీసుకుని హైవే ఎక్కి ఓ 50 కిలోమీటర్లు వెళితే చాలు, ఏదోక టోల్ గేట్ (Tollgate) తగులుతోంది. అక్కడ రహదారి సుంకం (Toll) చెల్లిస్తేనే ముందుకు వెళ్లడానికి దారి వదులుతారు. ఫాస్టాగ్ రాక ముందు, డబ్బు చెల్లించడానికి టోల్ ప్లాజా (Toll plaza) దగ్గర ఎంత సేపు ఎదురు చూడాల్సి వచ్చేదో వాహనదార్లందరికీ గుర్తుండే ఉంటుంది. 2019 డిసెంబర్‌లో ఫాస్టాగ్‌ను లాంచ్ చేశారు. ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత టోల్ గేట్ దగ్గర బండిని ఆపాల్సిన అవసరం లేకపోయింది.
2023 నవంబర్ 30 నాటికి, మన దేశంలో దాదాపు 8 కోట్ల (7,98,07,678) ఫాస్టాగ్‌లు జారీ అయ్యాయి. ఇప్పటికి వాటి సంఖ్య 8 కోట్లు దాటి ఉంటుందన్నది ఒక అంచనా. కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన సమాచారం ప్రకారం, జాతీయ రహదారులపై ఉన్న ఫీజ్ ప్లాజాల (fee plazas) నుంచి వసూలైన మొత్తంలో 98.9% శాతం డబ్బు ఫాస్టాగ్‌ల ద్వారానే వస్తోంది. అంటే, టోల్ గేట్ దాటుతున్న ప్రతి 100 బండ్లలో దాదాపు 99 బండ్లు ఫాస్టాగ్ వాడుతున్నాయి.
ఫాస్టాగ్‌ల ఈ-కేవైసీ గడువు పెంపు
వాహనదార్లు ఫాస్టాగ్‌లకు కూడా ఈ-కేవైసీ పూర్తి చేయాలి. ఈ-కేవైసీ పూర్తి చేయాల్సిన గడవు 2024 జనవరి 31తోనే ముగిసినా, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI), ఆ సమయాన్ని మరో నెల పొడిగించింది. ఇప్పుడు, వాహనదార్లకు ఈ నెలాఖరు వరకు (2024 ఫిబ్రవరి 29 వరకు) సమయం దొరికింది, ఈ లోగా ఫాస్టాగ్ ఈ-కేవైసీ పనిని పూర్తి చేయాలి.
ఫిబ్రవరి 29 లోగా ఫాస్టాగ్ ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే, ఆ ఫాస్టాగ్‌ను డీయాక్టివేట్ చేస్తామని NHAI హెచ్చరించింది. ఫాస్టాగ్‌లో బ్యాలెన్స్ ఉన్నా.. కేవైసీ పూర్తి చేయకపోతే అవి పని చేయవు. ఆ ఫాస్టాగ్‌లను బ్యాంకులు నిలిపేస్తాయి. ఈ ఇబ్బంది ఉండకూడదనుకుంటే, ఇచ్చిన టైమ్‌లోగా ఫాస్టాగ్‌కు కేవైసీ పూర్తి చేసుకోవడం ఒక్కటే దారి. దీనికి సంబంధించి ఇంకా ఏదైనా సమాచారం మీకు కావాలనుకుంటే, మీ సమీపంలోని టోల్‌ప్లాజా సిబ్బందితో మాట్లాడొచ్చు. లేదా, సంబంధిత బ్యాంక్ కస్టమర్ కేర్ నంబర్‌కు కాల్ చేసి తెలుసుకోవచ్చు.
ఒక వాహనానికి ఒక ఫాస్టాగ్ మాత్రమే (One Vehicle, One FASTag) ఉండాలి. కానీ, కొందరు యూజర్లు ఒకే ఫాస్టాగ్‌ను ఒకటి కంటే ఎక్కువ బండ్లకు వాడుతున్నారు. అంతేకాదు, ఒకే వాహనానికి ఒకటి కంటే ఎక్కువ ఫాస్టాగ్‌లను తగిస్తున్నారు. కొంతమంది విషయంలో.. కేవైసీ పూర్తి కాకుండానే ఫాస్టాగ్‌లు జారీ అయినట్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయడానికి ఫాస్టాగ్ కేవైసీని గవర్నమెంట్ తీసుకొచ్చింది. దీనివల్ల, ఒకే వాహనం-ఒకే ఫాస్టాగ్ సాధ్యమవుతుంది.
ఫాస్టాగ్ ఈ-కేవైసీని ఎలా అప్‌డేట్ చేయాలి? (How to Update Fastag e-KYC?)
- ఫాస్టాగ్ వెబ్‌సైట్‌తో పాటు 'నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్' (NETC) వెబ్‌సైట్ ద్వారా ఫాస్టాగ్ కేవైసీ పూర్తి చేయవచ్చు.
- ఫాస్టాగ్ కేవైసీ స్టేటస్ తెలుసుకునేందుకు, ముందుగా, ఫాస్టాగ్ వెబ్‌సైట్‌లోకి వెళ్లండి.
- మొబైల్ నంబర్, పాస్‌వర్డ్ లేదా OTP ద్వారా మీ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి.
- డ్యాష్‌బోర్డులో ‘My Profile’ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మీ ఫాస్టాగ్ కేవైసీ స్టేటస్ కనిపిస్తుంది.
- కేవైసీ పూర్తి అయినా/కాకపోయినా మీకు అక్కడే అర్ధం అవుతుంది.
- ఒకవేళ కేవైసీ పూర్తి కాకపోతే, వెబ్‌సైట్‌లో అడిగిన వివరాలు పూరించి, సబ్మిట్ చేయాలి.
మొబైల్ నంబర్ రిజిస్టర్ కాకపోతే ఏం చేయాలి?
- మీ మొబైల్ నంబర్ NHAI వద్ద రిజిస్టర్ కాకుంటే.. యాప్ స్టోర్ నుంచి ‘మై ఫాస్టాగ్' (My FASTag) యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- మై ఫాస్టాగ్ డౌన్‌లోడ్ పూర్తయిన తర్వాత, అందులో అడిగిన వివరాలు పూరించి రిజిస్టర్ చేసుకోవాలి.
- ఒకవేళ, బ్యాంక్ జారీ చేసిన ఫాస్టాగ్ అయితే, సంబంధిత బ్యాంక్ బ్రాంచ్‌కి వెళ్లి మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేసుకోవాలి.
- మొబైల్ నంబర్ రిజిస్టర్ పూర్తయిన తర్వాత, పైన చెప్పిన స్టెప్స్ ఫాలో అయ్యి కేవైసీ పూర్తి చేయవచ్చు.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి