Taxes on Petrol and Diesel: మోదీ 3.0 ప్రభుత్వంలో, హర్దీప్ సింగ్ పురికి మరోమారు కేంద్ర పెట్రోలియం శాఖ బాధ్యతలు అప్పగించారు. దీంతో, పెట్రోలియం ఉత్పత్తులను GST పరిధిలోకి తీసుకురానున్నారనే వార్తలు జోరందుకున్నాయి. వాస్తవానికి... పెట్రోల్, డీజిల్, సహజ వాయువు వంటివాటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు పురి ఇటీవల చెప్పారు. ఇది అమల్లోకి వస్తే, ఇంధన ధరల నుంచి ప్రజలకు కొంత ఊరట లభిస్తుంది. పెట్రోల్‌, డీజిల్‌ రేట్లను జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే, రాష్ట్రాలకు అందుతున్న పన్నుల రాబడి తగ్గుతుందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం, పెట్రోల్‌ & డీజిల్‌పై GST బదులు వ్యాట్‌ (VAT లేదా Value Added Tax) వసూలు చేస్తున్నారు.


రాష్ట్రాలకు పెద్ద ఆదాయ వనరు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెద్ద వనరుల్లో ఒకటి పెట్రోలియం ఉత్పత్తులు. రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలియం ఉత్పత్తుల నుంచి పెద్ద మొత్తంలో ఆర్జిస్తున్నాయని అధికారిక డేటా చూపిస్తోంది. కొన్ని రాష్ట్రాల మొత్తం ఆదాయంలో ఐదో వంతు పెట్రోలియం ఉత్పత్తులే సంపాదించి పెడుతున్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2023-24లో, గుజరాత్ మొత్తం పన్నుల ఆదాయంలో 17.6 శాతం పెట్రోలియం ఉత్పత్తుల నుంచి వచ్చింది. తమిళనాడు 14.6 శాతం, మహారాష్ట్ర 12.1 శాతం ఆర్జించాయి.


2022-23 ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల్లో పెట్రోలియం ఉత్పత్తుల ద్వారా కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వాలు రూ. 5,45,002 కోట్లు ఆర్జించాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ. 7,74,425 కోట్లు, 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ. 6,72,719 కోట్లు, 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ. 5,55,370 కోట్లు, 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ. 5,75,632 కోట్లు, 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ. 5,43,026 కోట్లు పెట్రోలియం ఉత్పత్తుల ద్వారా వచ్చింది.


గత దశాబ్ద కాలంలో, దాదాపు అన్ని రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లు పెరిగాయి. ఫలితంగా రాష్ట్రాల మొత్తం పన్ను ఆదాయం కూడా పెరిగింది. 2014-15లో, అన్ని రాష్ట్రాలు కలిపి పెట్రోలియం పన్నుల నుంచి రూ. 1.37 లక్షల కోట్లు ఆర్జించాయి. 2023-24లో ఈ మొత్తం రూ. 2.92 లక్షల కోట్లకు పెరిగింది. పెట్రోల్ & డీజిల్‌లను GST పరిధిలోకి తీసుకువస్తే పన్ను వ్యవస్థ క్రమబద్ధం అవుతుంది, ఇంధన ఖర్చులు తగ్గుతాయి. ఇంధన పన్నులపై ఎక్కువగా ఆధారపడే రాష్ట్రాలకు ఇది సమస్యగా మారుతుంది. 


పెట్రోల్‌, డీజిల్‌తో రాష్ట్రాలకు ఎలా ఆదాయం వస్తోంది?
పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం వసూలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సొమ్ము చేసుకుంటుండగా, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ విధించి ఆదాయాన్ని పెంచుకుంటున్నాయి. పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉన్నప్పటికీ, రాష్ట్రాలు సొంతంగా వ్యాట్‌ (VAT) విధిస్తున్నాయి. ధరల్లో వైవిధ్యానికి ఇదే కారణం. సాధారణంగా, పెట్రోల్‌పై వ్యాట్‌ 20-35% వరకు, డీజిల్‌పై 12-20% మధ్య ఉంటుంది.


విశేషం ఏంటంటే.. వ్యాట్‌ వడ్డింపులో మన తెలుగు రాష్ట్రాలే తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో అత్యధికంగా 35 శాతం వ్యాట్‌ వసూలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 31 శాతం VAT విధించారు, దీనిది రెండో స్థానం.


జీఎస్టీ పరిధిలోకి వస్తే రాష్ట్రాలకు నష్టం
ప్రస్తుతం GSTలో 4 పన్ను శ్లాబ్‌లు ఉన్నాయి. అవి - 5%, 12%, 18% & 28%. ఇంధనాన్ని అత్యంత ఖరీదైన 28 శాతం శ్లాబ్‌లోకి తీసుకువచ్చినప్పటికీ, పెట్రోల్ ధరలు ప్రస్తుత రేటు కంటే తగ్గుతాయి. ఉదాహరణకు.. మన దేశంలో, పన్నులకు ముందు పెట్రోల్ ధర దాదాపు రూ.55గా ఉంది. దీనిపై 28% చొప్పున జీఎస్టీ విధిస్తే, పెట్రోల్ రిటైల్ ప్రైస్‌ దాదాపు రూ.72 అవుతుంది. అంటే, ప్రస్తుత రేటు కంటే రూ.23 వరకు తగ్గుతుంది. డీజిల్ ధర కూడా ఇదే విధంగా తగ్గుతుంది.


పెట్రోలియం ఉత్పత్తులపై పన్నుల వల్ల పెద్ద రాష్ట్రాలు బాగా లాభపడుతున్నాయి. పెద్ద రాష్ట్రాల్లో ఎక్కువ జనాభా ఉండడం వల్ల ప్రజలకు ఎక్కువ వాహనాలు అవసరమవుతాయి. కాబట్టి, సహజంగానే పెట్రోల్, డీజిల్ వినియోగం పెరుగుతుంది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కువ ఆదాయం వస్తోంది.


ప్రభుత్వ డేటా ప్రకారం, పెట్రోలియం నుంచి మహారాష్ట్ర పన్ను ఆదాయం 2018-19లో రూ. 27,190 కోట్ల నుంచి 2023-24లో రూ. 36,359 కోట్లకు పెరిగింది, ఐదేళ్లలో 34 శాతం వృద్ధి నమోదైంది. అతే కాలంలో... ఉత్తరప్రదేశ్‌ పన్ను ఆదాయం రూ. 19,167 కోట్ల నుంచి రూ. 30,411 కోట్లకు చేరింది, 59 శాతం పెరిగింది.


మరో ఆసక్తికర కథనం: 'అభివృద్ధి చెందిన భారత్‌' లక్ష్యం కోసం మోదీ సర్కార్‌ ఫోకస్‌ చేసే కీలక రంగాలివి