Digital Rupee Wallet:
కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ 'ఈ-రూపీ'! డిజిటల్ లావదేవీల్లో ఓ గేమ్ ఛేంజర్‌గా దీనిని రూపొందించాలని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా పట్టుదలగా ఉంది. క్రిప్టో కరెన్సీ వంటి డిజిటల్ కాయిన్లకు అడ్డుకట్టగా ఉపయోగపడుతుందని భావిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా నాలుగు ప్రధాన నగరాల్లో డిజిటల్ రూపాయి పైలట్ ప్రాజెక్ట్‌ను అమలు చేస్తోంది.
ఈ-రూపీ ప్రాజెక్టును స్వల్ప కాలంలోనే మరికొన్ని నగరాలకు విస్తరిస్తున్న నేపథ్యంలో చాలా మందికి కొన్ని సందేహాలు కలుగుతున్నాయి. యూపీఐ మాదిరిగా 'ఈ-రూపీ'కి బ్యాంకు ఖాతా అవసరమా అన్ని ప్రశ్నిస్తున్నారు. దీనిపై బ్యాంకు నిపుణులు ఏమంటున్నారంటే?
డిజిటల్ రూపాయి లీగల్ టెండర్! అంటే అధికారికంగా చెలమణీ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. యూపీఐ తరహాలో డిజిటల్ వాలెట్లకు బ్యాంకుతో అనుసంధానం అవసరం లేదని అంటున్నారు. అయితే పర్స్ లోడ్ చేసేందుకు, విత్‌డ్రా చేసేందుకు బ్యాంకు ఖాతాను అనుసంధానం చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
'సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీ ఫంగీబుల్ లీగల్ టెండర్. డిజిటల్ రూపంలో వీటిని భారతీయ రిజర్వు బ్యాంకు విడుదల చేస్తోంది. సీబీడీసీని తమ వద్ద నిల్వ చేసుకొనేందుకు బ్యాంకు ఖాతా అవసరం లేదు. ప్రాజెక్టులో భాగమవుతున్న బ్యాంకులు డిజిటల్ వాలెట్లను అందిస్తున్నాయి. వీటిద్వారా లావాదేవీలు చేపట్టొచ్చు. పర్సన్ టు పర్సన్, పర్సన్ టు మర్చంట్ లావాదేవీలు సాధ్యమవుతాయి' అని ఫిన్‌టెక్ సర్వీస్ ప్రొవైడర్ ఇన్‌సొల్యూషన్స్ గ్లోబల్ సీఈవో అనుప్ నాయర్ అన్నారు. అయితే వాలెట్ నింపాలన్నా, విత్‌డ్రా చేయాలన్నా బ్యాంకు ఖాతా తప్పనిసరిగా పేర్కొన్నారు.
'అవును, డిజిటల్ రూపాయి బ్యాంకు ఖాతాలకు అనుసంధానం అవుతుంది. బ్యాంకుల ద్వారా మీ వ్యక్తిగత ఈ-రూపీ వాలెట్లోకి డిజిటల్ రూపాయిని బదిలీ చేయాల్సి ఉంటుంది' అని డిజిటల్ ఈస్క్రూ పేమెంట్స్ కంపెనీ ఎండీ అశ్విన్ చావ్లా అన్నారు. బ్యాంకులే ఈ-రూపీని ఇస్తున్నాయి కాబట్టి పేపర్ కరెన్సీలాగే వాడుకోవచ్చని తెలిపారు. 'డిజిటల్ రూపాయి లావాదేవీల్లో బ్యాంకులు మధ్యవర్తులుగా ఉండవు. ప్రభుత్వం, కస్టమర్ మధ్యే వ్యవహారం నడుస్తుంది' అని పేర్కొన్నారు.
డిజిటల్ రూపాయి ప్రాజెక్టును దశలవారీగా విస్తరిస్తున్నారు. లావాదేవీలు చేపట్టేందుకు ఎనిమిది బ్యాంకులకు అనుమతి ఇచ్చారు. తొలి దశలో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, యస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ కస్టమర్లు ముంబయి, దిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్ నగరాల్లో లావాదేవీలు చేపట్టొచ్చు. మరికొన్ని రోజుల్లో బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్ కస్టమర్లకు సేవలు అందుతాయి. అతి త్వరలోనే అహ్మదాబాద్, గ్యాంగ్‌టక్, గువాహటి, హైదరాబాద్, ఇండోర్, కోచి, లక్నో, పాట్నా, సిమ్లాలో సేవలను విస్తరిస్తారు.
రియల్ టైమ్‌లో డిజిటల్ రూపాయి సృష్టి, బదిలీ, రిటైల్ ఉపయోగం, భద్రతను ఈ పైలట్ ప్రాజెక్టులో పరీక్షిస్తారు. దీన్నుంచి నేర్చుకున్న పాఠాలతో మిగిలిన ఫీచర్లు, డిజిటల్ రూపాయి ఆర్కిటెక్చర్‌ను భవిష్యత్తు పైలట్ ప్రాజెక్టుల్లో పరీక్షిస్తారు.
Also Read: డిజిటల్ రూపాయి చలామణీలోకి వచ్చిందోచ్, తొలిరోజు ₹275 కోట్ల లావాదేవీలు