RBI's E-rupee Pilot: 2022 నవంబర్‌ 1వ తేదీ నుంచి భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) తీసుకొచ్చిన డిజిటల్‌ రూపాయి చేతులు మారడం మొదలైంది. తొలిరోజున (‌నవంబర్‌ 1వ తేదీ) ₹275 కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. భారత దేశ ఆర్థిక వ్యవస్థ చరిత్రలో ఇదొక 'ల్యాండ్‌మార్క్ మూమెంట్'.


RBI తీసుకొచ్చిన డిజిటల్‌ రూపాయిని ఈ-రూపాయి లేదా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) అని కూడా పిలుస్తున్నారు. ప్రస్తుతానికి డిజిటల్‌ రూపాయి వినియోగాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా (ప్రయోగాత్మకంగా) చేపట్టారు. ప్రభుత్వ సెక్యూరిటీల్లో (G-secs) సెకండరీ మార్కెట్ ట్రేడ్స్‌ కోసం మాత్రమే, అది కూడా హోల్‌సేల్‌ పద్ధతిలో (e₹-W) వినియోగిస్తున్నారు. తొలిరోజు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముగిసింది. రూ. 275 కోట్ల విలువైన 48 ట్రేడ్‌లు జరిగాయి. 


దేశంలో అతి పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) - ప్రభుత్వ యాజమాన్యంలోనే ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) మధ్య మొదటి ఒప్పందం కుదిరింది. CBDC లేదా డిజిటల్ రూపాయిని ఉపయోగించి తన దగ్గరున్న సెక్యూరిటీలను BoBకి SBI విక్రయించింది. 


ఐదేళ్ల కాల పరిమితి ఉన్న ప్రభుత్వ పేపర్లను (‌బాండ్లు) IDFC ఫస్ట్ బ్యాంక్‌కు ICICI బ్యాంక్ విక్రయించింది. ఇది కాకుండా మరో లావాదేవీ కూడా జరిగింది, కోటక్‌ మహీంద్ర బ్యాంక్‌ ఈ ట్రేడ్‌ చేసిందని మార్కెట్‌ వర్గాల సమాచారం. కానీ, అధికారికంగా వివరాలు వెల్లడి కాలేదు.


మంగళవారం, రెగ్యులర్‌ బాండ్ మార్కెట్‌లో జరిగిన మొత్తం ట్రేడింగ్ పరిమాణం రూ. 20,865 కోట్లు.


రెగ్యులర్‌ బాండ్ మార్కెట్ ట్రేడ్స్‌లో T+1 ప్రాతిపదికన సెటిల్‌మెంట్ ఉంటుంది. అంటే, లావాదేవీ జరిగిన తర్వాత సెక్యూరిటీలను సెటిల్‌ చేయడానికి ఒక రోజు గడువు ఉంటుంది. డిజిటల్ కరెన్సీని ఉపయోగించే ట్రేడ్స్‌లో సెటిల్‌మెంట్లు T+0 ప్రాతిపదికన జరుగుతాయి. రియల్ టైమ్‌లో సెటిల్‌మెంట్‌ పూర్తవుతుంది. అంతేకాదు, డిజిటల్ రూపాయిని ఉపయోగించే బ్యాంకులు తప్పనిసరిగా RBI వద్ద CBDC ఖాతాలను తెరవాలి. కాబట్టి సెటిల్‌మెంట్‌ రిస్క్ ఉండదు. 


తొలి విడతలో, హోల్‌సేల్‌ ఈ-రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌లో పాల్గొనడానికి 9 బ్యాంకులకు కేంద్ర బ్యాంక్‌ అనుమతి ఇచ్చింది. అవి... స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యెస్ బ్యాంక్, IDFC ఫస్ట్ బ్యాంక్, HSBC.


డిజిటల్‌ రూపాయి ఉపయోగం
డిజిటల్‌ రూపాయితో చాలా ఉపయోగాలు ఉన్నాయి. కేంద్ర బ్యాంకు ద్వారా జరిగే క్యాష్‌ సెటిల్‌మెంట్లు తగ్గడం వల్ల వాటి మీద లావాదేవీ వ్యయాలు తగ్గుతాయి. ఫలితంగా బ్యాంకుల మీద ఆర్థిక భారం తగ్గుతుంది. ఫైనల్‌గా, ఆ ప్రయోజనం కస్టమర్లకు చేరుతుంది. రిటైల్‌ డిజిటల్‌ రూపాయి కూడా అందుబాటులోకి వస్తే, ఆన్‌లైన్‌ ఆర్థిక మోసాల బెడద గణనీయంగా తగ్గుతుంది. చేతిలో డబ్బులు పెట్టుకునే రోజులు చరిత్రగా మారతాయి. దేశీయంగా అమలవుతున్న పైలెట్‌ ప్రాజెక్ట్‌ ఫలితాలను బట్టి ఇతర హోల్‌సేల్‌ లావాదేవీలకు, విదేశీ చెల్లింపులకు కూడా డిజిటల్ రూపాయి లావాదేవీల పరిధిని విస్తరిస్తారు.


రిటైల్‌ వెర్షన్‌ ఎప్పుడు?
రిటైల్ వెర్షన్‌ కోసం కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్‌ను నెల రోజుల్లో ప్రారంభిస్తామని రిజర్వ్‌ బ్యాంక్‌ తెలిపింది. అయితే, డే వన్‌ నుంచే వీటిని అందరికీ అందుబాటులోకి తీసుకురారు. డిజిటల్ రూపాయి రిటైల్ సెగ్మెంట్‌లో (e₹-R) పైలెట్‌ ప్రాజెక్టు కోసం కొన్ని ప్రాంతాల్లో పరిమిత వినియోగదారు - వ్యాపార సమూహాలకు (క్లోజ్డ్ యూజర్ గ్రూప్‌లు) లావాదేవీల కోసం ఎంపిక చేస్తారు. తక్కువ విలువతో డిజిటల్ లావాదేవీలు జరిగేందుకు అనుమతి ఇస్తారు.


భౌతిక కరెన్సీని రద్దు చేస్తారా?
ప్రస్తుతం చలామణీలో ఉన్న కరెన్సీ నోట్లు, నాణేలకు డిజిటల్‌ రూపమే సెంట్రల్‌ బ్యాంక్‌ తీసుకొస్తున్న డిజిటల్‌ కరెన్సీ. ప్రస్తుతమున్న కరెన్సీని గానీ, కాయిన్లను గానీ రద్దు చేయరు. అవి కూడా ఎప్పుటిలాగే చలామణీలో ఉంటాయి. వీటికి అదనంగా సీబీడీసీ ఉపయోగపడతాయి.