Home Loan: మన దేశంలో అధిక దవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వడ్డీ రేట్లను పెంచినా, ఆ ప్రభావం రియల్ ఎస్టేట్ మీద పెద్దగా కనిపించలేదు. EMI మొత్తం పెరుగుతున్నా గృహ రుణాలు తీసుకునేవాళ్లు వెనక్కు తగ్గలేదు. భారతదేశ సెంట్రల్ బ్యాంక్ విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి.
15 శాతం వృద్ధి
2023 మార్చి నెలలో గృహ రుణ బకాయిలు ఏడాది ప్రాతిపదికన 15 శాతం పెరిగాయి. దీంతో, గృహ రుణ బకాయిల మొత్తం (Housing loans outstanding) రికార్డ్ సృష్టించింది.
2022 మే నెల నుంచి రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు పెంచుతూ వచ్చింది, 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా 250 బేసిస్ పాయింట్లు లేదా 2.50 శాతం మేర వడ్డీ రేట్లను పెంచింది. నివాస ప్రాపర్టీ కొనుగోలుతో సహా అన్ని రుణాలపై వడ్డీ రేట్లను కఠినతరం చేసింది. గత ఆర్థిక సంవత్సరం మొత్తంలో వడ్డీ రేట్ల పెంపు చక్రం తిరుగుతూనే ఉన్నా, హౌస్ లోన్లు తీసుకునే వాళ్ల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది.
2023 మార్చి చివరి నాటికి, గృహ రుణాల బకాయిలు 15 శాతం పెరిగి రికార్డు స్థాయిలో రూ. 19.36 లక్షల కోట్లకు చేరుకున్నాయి. 2022 మార్చి చివరి నాటికి ఇవి రూ. 16.84 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇది కూడా ఏడాది ప్రాతిపదికన 12.9 శాతం వృద్ధి. 2021 మార్చిలో గృహ రుణాల బకాయిలు రూ. 14.92 లక్షల కోట్లుగా ఉన్నాయి. కొవిడ్ పరిస్థితిని అధిగమించిన తర్వాత దేశ ఆర్థిక పరిస్థితి నెమ్మదిగా లయలోకి వస్తోందని ఈ సంఖ్య స్పష్టంగా సూచిస్తోంది. కొవిడ్ సమయంలో పడిని ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, తమకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని ప్రజలు తపిస్తున్నారు. గృహ రుణ రేట్లు పెరిగినా వెరవకుండా లోన్ తీసుకుని ఇల్లు కొనుక్కోవడమో, కట్టుకోవడమో చేస్తున్నారు.
పర్సనల్ లోన్లు కూడా పెరిగాయి
ఇంటి రుణాలతో పాటు... 2023 మార్చి నెలలో వ్యక్తిగత రుణాలు తీసుకున్న వారి సంఖ్య కూడా పెరిగినట్లు RBI నివేదికలో వెల్లడైంది. ఆ నెలలో వ్యక్తిగత రుణాల వృద్ధి రేటు 20.6 శాతంగా తేలింది. అంతకుముందు ఏడాది మార్చి నెలలో ఈ సంఖ్య 12.60 శాతం మాత్రమే.
ఇండస్ట్రియల్ క్రెడిట్ రేట్‌లో వృద్ధి
పరిశ్రమల రుణాల విషయంలోనూ, ఈ ఏడాది మార్చి నెలలో 5.7 శాతం వృద్ధి నమోదైంది. గత ఏడాది మార్చి నెలలో ఈ వృద్ధి రేటు 7.5 శాతంగా ఉంది. అయితే, వ్యాపార రుణాల వృద్ధి రేటు భారీగా తగ్గింది.
పెద్ద పరిశ్రమలకు ఈసారి మార్చిలో 3 శాతం ఎక్కువ రుణాలు ఇచ్చారు. గత ఏడాది మార్చిలో ఇది కేవలం 2 శాతం మాత్రమే. మధ్యతరహా పరిశ్రమలకు గత ఏడాది 54.4 శాతం ఎక్కువ రుణాలు పంపిణీ చేయగా, ఈ ఏడాది 19.6 శాతానికి పడిపోయింది. సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు ఇచ్చే రుణాల వృద్ధి రేటు 12.3 శాతంగా ఉంది. గతేడాది ఇది 23 శాతంగా ఉంది.
వ్యక్తిగత రుణ విభాగాలలో కన్స్యూమర్ డ్యూరబుల్స్, హౌసింగ్, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అడ్వాన్స్‌లు, క్రెడిట్ కార్డ్ బకాయిలు, విద్య మరియు వాహన రుణాలు ఉన్నాయి.
2023 మార్చిలో, వ్యవసాయం & అనుబంధ కార్యకలాపాలకు అందించే క్రెడిట్ గత ఏడాది మార్చిలోని 9.9 శాతంతో పోలిస్తే, ఈసారి 15.4 శాతం వృద్ధిని నమోదు చేసిందని ఆర్‌బీఐ తెలిపింది.
2023 మార్చి నెల బ్యాంక్ రుణాల గణాంకాలను ఎంపిక చేసిన 40 వాణిజ్య బ్యాంకుల నుంచి ఆర్‌బీఐ సేకరించి, క్రోడీకరించింది. అన్ని బ్యాంకులు ఇచ్చిన మొత్తం ఆహారేతర రుణాల్లో వీటిది 93 శాతం వాటా.