Extra Charges On E-commerce Platforms: అమెజాన్‌ (Amazon), ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు లేదా బ్లింకిట్‌ (Blinkit), జెప్టో (Zepto), స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ (Swiggy Instamart) వంటి క్విక్ కామర్స్ పోర్టల్స్‌ నుంచి ప్రజలు ప్రతిరోజూ వేల సంఖ్యలో వస్తువులు కొంటుంటారు. ఈ ఫ్లాట్‌ఫామ్స్‌లో ఆర్డర్ చేసేటప్పుడు, ఓవరాల్‌ బిల్‌తో పాటు ప్రైస్‌ ధర విభజనను గమనించడం కూడా చాలా అవసరం. చాలామంది ఇది గమనించకుండా ఈ-కామర్స్‌, క్విక్ కామర్స్ కంపెనీల బుట్టలో పడుతున్నారు, భారీగా డబ్బు కోల్పోతున్నారు.


మీ బిల్లులోని హిడెన్‌ ఛార్జీలను గమనించారా?
Flipkart, Amazon వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు చిన్న పట్టణాల్లోనూ వస్తువులను డెలివరీ చేస్తున్నాయి. Zepto, Blinkit, Swiggy Instamart వంటి క్విక్ కామర్స్ పోర్టల్‌లు మెట్రో నగరాల ప్రజల దైనందిన జీవితాల్లో భాగంగా మారాయి. ఈ యాప్‌లు సౌలభ్యాన్ని అందిస్తున్నప్పటికీ, ఆర్డర్ చేసే ముందు మీరు ఎప్పుడైనా ఫైనల్‌ బిల్లును చూశారా?. మనం, ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫామ్‌లో ఏదైనా వస్తువును సెలెక్ట్‌ చేసుకున్న తర్వాత, ఆ వస్తువును కొనడానికి కార్ట్‌కు జోడిస్తాం. దానిని కొనే సమయంలో, వాస్తవ రేటు కంటే ఎక్కువ ధర చెల్లిస్తున్నాం, దీనిని చాలా మంది గమనించడం లేదు. అంటే, హిడెన్‌ ఛార్జీ రూపంలో కస్టమర్‌ బిల్లు & జేబుకు చిల్లు రెండూ పెరుగుతున్నాయి.


ధరలను డీకోడ్‌ చేయండి
ప్యాకేజింగ్ లేదా డెలివరీ ఫీజ్‌ వంటి సర్వీస్ ఛార్జీలు సాధారణ ఛార్జీలుగా ఉంటున్నాయి. ఆర్డర్‌ చేసిన వస్తువును మన ఇంటి గుమ్మం వద్దకు తీసుకొస్తారు కాబట్టి వాటిని సమర్థించవచ్చు. కానీ, సమర్థనీయం కాని ఛార్జీలు కూడా ఇప్పుడు విధిస్తున్నారు. ఉదాహరణకు... మీరు Flipkart నుంచి ఒక ఉత్పత్తిని ఆర్డర్ చేసినప్పుడు, ప్లాట్‌ఫామ్ ఫీజ్‌, హ్యాండ్లింగ్ ఫీజ్‌, సెక్యూర్ ప్యాకేజింగ్ ఫీజ్‌ వంటి ఛార్జీలను చూడవచ్చు. కానీ ఇక్కడే ఫ్లిప్‌కార్ట్‌ వంటి కంపెనీలు ట్విస్ట్ ఇస్తున్నాయి. ఇప్పుడు ప్రొటెక్ట్ ప్రామిస్ ఫీజ్‌ (Protect Promise Fee) కూడా వసూలు చేస్తున్నారు. ముందుగా వాగ్దానం చేసిన డెలివరీ తేదీకి ఆ వస్తువును తెచ్చి ఇచ్చేందుకు ఆ ప్లాట్‌ఫామ్‌కు చెల్లించే ఖర్చు ఇది. వాస్తవానికి, అప్పటికే ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండడానికి సదరు ఫ్లాట్‌ఫామ్‌ మీ దగ్గర నుంచి ఛార్జ్ చేస్తుంది. అంటే.. 'ప్రొటెక్ట్ ప్రామిస్ ఫీజ్‌' పేరిట మళ్లీ వసూలు చేస్తోంది, ఇది కస్టమర్‌కు రెట్టింపు భారం & ఘరానా మోసం.


ఇది ఫ్లిప్‌కార్ట్‌కు మాత్రమే పరిమితం కాదు. బ్లింకిట్, జెప్టో వంటి ప్లాట్‌ఫామ్స్‌లో మీరు ఆర్డర్‌ చేసిన వస్తువు MRP కంటే ఎక్కువ చెల్లిస్తున్నారు, ఒకసారి చెక్‌ చేసుకోండి. ఉదాహరణకు... రూ. 200 MRP ఉన్న డార్క్ చాక్లెట్ బార్ రూ. 210 తీసుకుంటున్నారు, ఇది 5% పెరుగుదల. చిన్న వస్తువులకు ఈ అదనపు ఖర్చు ఇంకా ఎక్కువగా ఉండొచ్చు. ఉదాహరణకు... రూ. 103 ధర గల చాక్లెట్‌ కోసం రూ. 142, దాదాపు 40% ఎక్కువ ఖర్చు చేయాల్సివస్తోంది.


పాల వంటి నిత్యావసర వస్తువుల విషయంలోనూ ఇదే జరుగుతోంది. లోకల్‌ స్టోర్‌లో చెల్లించే దానికంటే ఎక్కువ డబ్బును క్విక్‌ కామర్స్‌ ఫ్లాట్‌ఫామ్స్‌కు చెల్లించాల్సి వస్తోంది.


డబ్బును ఇలా ఆదా చేయవచ్చు
మీరు ఏదైనా వస్తువును ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసే ముందు, ధర విభజనను కచ్చితంగా గమనించడం. సాధ్యమైతే, మీ ఇంటి దగ్గరలో ఉన్న కిరాణా దుకాణం నుంచి ఆ వస్తువును, ముఖ్యంగా చాక్లెట్లు లేదా పాలు వంటి చిన్న వస్తువులను కొనండి. దీనివల్ల, కొన్న ప్రతిసారీ కొంత మొత్తం సేవ్‌ అవుతుంది. నెలవారీగా చూస్తే చాలా పెద్ద మొత్తంలో డబ్బును ఆదా చేసినట్లు మీరే గుర్తిస్తారు.


మరో ఆసక్తికర కథనం: రతన్ టాటా వీలునామాలో "రహస్య వ్యక్తి" - రూ.వందల కోట్ల ఆస్తి అతనికే!