Sonusood: 'సెలబ్రిటీలను టార్గెట్ చేయడం బాధాకరం' - అరెస్ట్ వారెంట్ వార్తలపై సోనూసూద్ తీవ్ర అసహనం
Sonusood Arrest Warrant: తనకు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యిందన్న వార్తలపై నటుడు సోనూసూద్ స్పందించారు. తమ లాయర్స్ కోర్టుకు సమాధానం ఇచ్చారని.. మీడియా అనవసరంగా దృష్టి సారిస్తోందని అన్నారు.

Sonusood Tweet On Arrest Warrant Issue: ప్రముఖ నటుడు సోనూసూద్‌కు (Sonusood) లూథియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరల్ కావడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా తాజాగా పోస్ట్ పెట్టారు. 'సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేస్తోన్న వార్తపై సంచలనాత్మకమైన విషయాలను స్పష్టం చేయాలి. విషయం సూటిగా చెప్పాలంటే నాకు ఎలాంటి సంబంధం లేని అంశం. ఈ విషయంలో కోర్టు నన్ను సాక్షిగా పిలిచింది. మా న్యాయవాదులు కోర్టుకు సమాధానం ఇచ్చారు. ఫిబ్రవరి 10వ తేదీన దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తాను. ఆ కేసుకు, నాకు ఎలాంటి సంబంధం లేదు. నా ప్రమేయం లేని విషయాలను మీ అందరికీ స్పష్టంగా వివరిస్తాను. దీనిపై మీడియా అనవసరంగా దృష్టి సారిస్తోంది. సెలిబ్రిటీలను టార్గెట్ చేయడం బాధాకరం.' అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే..?
కాగా, పంజాబ్‌లోని లూథియానా కోర్టు సోనూసూద్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. లూథియానాకు చెందిన న్యాయవాది రాజేశ్ ఖన్నా తనను మోహిత్ శర్మ అనే వ్యక్తి రూ.10 లక్షలు కోర్టులో కేసు వేశారు. రిజికా కాయిన్ పేరుతో తనతో పెట్టుబడి పెట్టించినట్లు చెప్పారు. ఈ కేసులో సోనూసూద్‌ను సదరు న్యాయవాది సాక్షిగా పేర్కొన్నారు. దీంతో విచారణ చేపట్టిన న్యాయస్థానం సోనూసూద్ సమాధానం చెప్పడానికి రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సోనూసూద్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచాలని పోలీసులను ఆదేశించింది. ముంబయిలోని అందేరి వెస్ట్‌లో ఉన్న ఒషివారా పోలీస్ స్టేషన్‌కు లుథియానా జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ రమన్ ప్రీత్ కౌర్ ఈ వారెంట్ జారీ చేశారు. 'సోనూసూద్‌కు పలుమార్లు సమన్లు పంపించినప్పటికీ అతను హాజరుకాలేదు. వెంటనే అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాలి.' అని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల 10వ తేదీన జరగనుంది.
కాగా, ఇటీవలే సోనూసూద్ మెగా ఫోన్ పట్టుకుని డైరెక్టర్‌గా మారారు. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఫతేహ్' ప్రేక్షకులను అలరించి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సైబర్ మాఫియా కథ ఆధారంగా ఈ సినిమా రూపొందగా.. జాక్వెలైన్ ఫెర్నాండెజ్, సీరుద్దీన్ షా, విజయ్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. జీ స్టూడియోస్, శక్తి సాగర్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.