Motocorp stock slides 7 percent: ఐటీ శాఖ సోదాలతో హీరో మోటోకార్ప్‌ షేర్లు భారీగా పతనం అవుతున్నాయి. కంపెనీలో రూ.1000 కోట్ల మేరకు బోగస్‌ ఖర్చులను ఐటీ శాఖ గుర్తించినట్టు వార్తలు రావడంతో మార్కెట్‌ వర్గాలు వెంటనే తీవ్రంగా స్పందించాయి. ఇన్వెస్టర్లంతా ఒక్కసారిగా షేర్లను విక్రయించడం మొదలు పెట్టారు. దాంతో మంగళవారం ఒక్కరోజే హీరో మోటోకార్ప్‌ షేరు ధర 7 శాతం వరకు పతనమైంది.


హీరో మోటోకార్ప్‌ ఆఫీసుల్లో మార్చి 23 నుంచి 26 వరకు ఐటీ శాఖ సోదాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కొన్ని తప్పుడు ఖర్చులు గుర్తించినట్టు తెలిసింది. దీనిపై రెండు వర్గాలు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అయితే సోదాల్లో తప్పును నిరూపించే స్పష్టమైన ఆధారాలు ఫిజికల్‌, డిజిటల్‌ డేటా రూపంలో దొరికాయని ఏఎన్‌ఐ ద్వారా తెలిసింది.


మంగళవారం హీరో మోటోకార్ప్‌ షేరు రూ.2,210 వద్ద ముగిసింది. 7 శాతం అంటే రూ.167 వరకు నష్టపోయింది. క్రితం సెషన్లో రూ.2,377 వద్ద ముగిసిన షేరు నేడు రూ.2,385 వద్ద ఆరంభమైంది. ఎప్పుడైతే బోగస్‌ ఖర్చలు వార్త వచ్చిందో వెంటనే విక్రయాలు మొదలయ్యాయి. కాగా ఈ ఐటీ సోదాలు సాధారణంగా జరిగేవేనని హీరో మోటో కంపెనీ అంటోంది. 


'ఇది రొటీన్‌ ఎంక్వైరీ అని మేం అందరికీ సమాచారం ఇచ్చాం. అయితే ఆర్థిక ఏడాది ముగింపు ముందు చేపట్టడం మాత్రం కామన్‌ కాదు. మా వ్యాపారం ఎప్పట్లాగే సాగుతుందని మా స్టేక్‌ హోల్డర్లకు హామీ ఇస్తున్నాం' అని హీరోమోటో తెలిపింది.


Income Tax Raids on Hero Moto Corp Residence of Pawan Munjal: హీరో మోటోకార్ప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పవన్ ముంజల్‌కు ఐటీ శాఖ షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఆయన నివాసం, కార్యాలయాలలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. గురుగ్రామ్‌లోని పవన్ ముంజల్ నివాసంలో బుధవారం ఉదయం నుంచి ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. ఆయనతో పాటు సంస్థలో పనిచేసే ఉన్నతోద్యోగుల ఇళ్లు, ఆస్తులపై ఐటీ శాఖ ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. 


పన్ను ఎగ్గొట్టారని ఆరోపణలు..  


ఆదాయపు పన్ను ఎగ్గొట్టారనే (Hero Moto Corp suspected tax evasion) ఆరోపణలతో హీరో కంపెనీ అధినేత, వ్యాపారవేత్త పవన్ ముంజల్ ఇళ్లు, ఆస్తులపై ఐటీ నిఘా పెట్టింది. గురుగ్రామ్, హరియానా, ఢిల్లీతో పాటు మరికొన్ని నగరాల్లో ఆయనకు చెందిన ఆస్తులపై ఐటీ శాఖ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. పవన్ ముంజల్ సారథ్యంలో దూసుకెళ్తోన్న హీరో మోటాకార్ప్ ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, సెంట్రల్ అమెరికాలలో మొత్తం 40 దేశాలకు విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా 8 కేంద్రాల్లో మ్యానుఫాక్చరింగ్ జరుగుతోంది. అందులో భారత్‌లో 6 కేంద్రాలుండగా, బంగ్లాదేశ్, కొలంబియాలలో ఒక్కో చోట హీరో కంపెనీ ఉత్పత్తులు కొనసాగిస్తోంది. దేశంలో తయారయ్యే బైక్స్, టూ వీలర్ మార్కెట్‌లో 50 శాతం వాటా ఉత్పత్తితో భారత్‌లో అగ్ర స్థానంలో దూసుకెళ్తోంది హీరో కంపెనీ. ఈ క్రమంలో నేటి ఉదయం నుంచి పలు చోట్ల హీరో కంపెనీ అధినేత పవన్ ముంజల్ ఆస్తులతో పాటు కంపెనీలో పనిచేసే ఉన్నతోద్యోగుల ఇళ్లలో ఐటీ శాఖ దాడులు చేస్తోంది.