High Taxed goods in India: పన్నుల అంశం భారతదేశంలో ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటుంది. ముఖ్యంగా, బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నప్పుడు ఇది హెడ్‌లైన్స్‌లోకి వస్తుంది. పన్ను రాయితీలను ప్రకటించి తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ప్రజలు ఆశిస్తారు. ప్రస్తుతం, భారతదేశంలో వస్తువులు & సేవల పన్ను (Goods and Services Tax - GST) కింద.. వస్తువులు & సేవలను వివిధ శ్లాబ్‌లుగా విభజించారు. GST రేట్‌ లిస్ట్‌లో 0%, 5%, 12%, 18%, & 28% స్లాబ్‌లు ఉన్నాయి. GST కౌన్సిల్ ప్రతి వస్తువు & సేవను ఈ ఐదు పన్ను స్లాబ్‌లలో ఏదో ఒకదానికి కేటాయించింది.

28% GST శ్లాబ్‌లో ఉన్న వస్తువులు2017లో, జీఎస్టీని అమల్లోకి తీసుకువచ్చినప్పుడు, మొత్తం 226 ఉత్పత్తులను 28 శాతం పన్ను శ్లాబ్‌లో చేర్చారు. కాలక్రమేణా వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, సలహాలు, సూచనల మేరకు ఈ జాబితాను జీఎస్‌టీ కౌన్సిల్‌ కుదించింది. ఇప్పుడు కేవలం 35 ఉత్పత్తులు మాత్రమే 28% GST స్లాబ్ పరిధిలో ఉన్నాయి. ముఖ్యంగా, విలాసవంతమైన లేదా అనవసరమైన వస్తువులను ఈ శ్లాబ్‌ కిందకు చేర్చారు. ఏ వస్తువు లేదా సేవను ఎంత పన్ను పరిధిలోకి తీసుకురావన్న అంశాన్ని జీఎస్‌టీ మండలి (GST Council) నిర్ణయిస్తుంది.

సిమెంట్, ఆటోమొబైల్ విడిభాగాలు, టైర్, మోటారు వాహన పరికరాలుపొగాకు, సిగరెట్, పాన్ మసాలావిమానం & యాక్స్ వంటి ప్రత్యేక వస్తువులుసినిమా టిక్కెట్లు, ఫైవ్ స్టార్ హోటళ్లలో ఆహారం & పానీయాలు

గతంలో 28%లో ఉండి ఇప్పుడు పన్ను తగ్గిన వస్తువులుకొన్ని సంవత్సరాల క్రితం, 28% పన్ను శ్లాబ్‌లో చేర్చిన 15 వస్తువులను పనఃసమీక్షించి, 18% పన్ను శ్లాబ్‌లోకి తీసుకువచ్చారు. వాటిలో... వాషింగ్ మెషీన్, 27 అంగుళాల టీవీ, వాక్యూమ్ క్లీనర్, ఫ్రిజ్ & పెయింట్ వంటి వస్తువులు ఉన్నాయి. పన్ను తగ్గించడం వల్ల ఆయా వస్తువుల ధరలు తగ్గి సామాన్య ప్రజలకు కొంత ఊరట లభించింది.

GST పరిధిలో లేని పెట్రోల్ & డీజిల్ప్రజలు, పరిశ్రమలకు నిత్యావసరమైన పెట్రోలు, డీజిల్ ప్రస్తుతం జీఎస్టీ పరిధిలోకి రావు. వీటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ (VAT), ఇతర పన్నులు విధిస్తున్నాయి. వీటిని జీఎస్టీ పరిధిలోకి తెచ్చి 28% శ్లాబులో ఉంచితే పెట్రోల్, డీజిల్ ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న పన్ను భారం సామాన్య ప్రజలు & పరిశ్రమలపై పెద్ద ప్రభావం చూపుతోంది. బడ్జెట్ 2025లో, ప్రభుత్వం ఈ రేట్లను మార్చి ఉపశమనం కలిగించడానికి ప్రయత్నిస్తుందని ప్రజలు ఆశిస్తున్నారు. అయితే, జీఎస్టీ రేట్లలో కీలక సవరణ ఉంటుందో, లేదో చెప్పడం కష్టం. ఆదాయ పన్ను పరిధికి సంబంధించి ప్రభుత్వం నుంచి పెద్ద ప్రకటన వస్తుందని నమ్మకమైన సమాచారం.

జీఎస్‌టీ కౌన్సిల్‌ భారతదేశంలో 01 జులై 2017న, వస్తువులు & సేవల పన్ను (GST) అమలులోకి వచ్చింది. వివిధ పరోక్ష పన్నులను ఏకీకృతం & విలీనం చేయడం ద్వారా భారతదేశ పన్నుల నిర్మాణంలో ఈ విప్లవాత్మక మార్పు వచ్చింది. భారత రాష్ట్రపతి నేతృత్వంలోని రాజ్యాంగ సంస్థ అయిన GST కౌన్సిల్ ఈ పన్నుల వ్యవస్థకు కేంద్రంగా పని చేస్తుంది. దేశవ్యాప్తంగా GST అమలు & పాలనను జీఎస్‌టీ కౌన్సిల్‌ నియంత్రిస్తుంది. ప్రస్తుతం, GST కౌన్సిల్‌లో 33 మంది సభ్యులు ఉన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి GST కౌన్సిల్ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. ఇంకా, ఆర్థిక శాఖ సహాయ మంత్రి, అన్ని రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉంటారు.

మరో ఆసక్తికర కథనం: క్రెడిట్‌ కార్డ్‌ ముద్దు, డెబిట్‌ కార్డ్‌ వద్దు - డిసెంబర్‌లో 8 లక్షలు, ఐదేళ్లలో డబుల్‌