HDFC Bank Q4 Result Preview: దేశంలో అతి పెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, 2022-23 ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికం (Q4) ఫలితాలను శనివారం (15 ఏప్రిల్ 2023) విడుదల చేస్తుంది. కొన్ని త్రైమాసికాలుగా బ్యాంకింగ్ రంగం బలంగా ఉండడంతో, మార్చి త్రైమాసికంలోనూ, బ్యాంకుల నుంచి బలమైన నంబర్లను మార్కెట్ ఆశిస్తోంది.
బలమైన రుణ వృద్ధి, అన్ని సెగ్మెంట్ వ్యాపారాల్లో పట్టు పెరగడంతో, జనవరి-మార్చి కాలంలో, నికర లాభంలో రెండంకెల స్ట్రాంగ్ గ్రోత్‌ను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నివేదించే అవకాశం ఉంది. అంచనాలకు తగ్గట్లుగా ఫలితాలు వస్తే, బ్యాంకింగ్ రంగ ఆదాయాల సీజన్‌ను బుల్లిష్ నోట్‌లో స్టార్ట్ అవుతుంది.
నికర లాభంలో 21% వృద్ధి అంచనా
ఏడు బ్రోకరేజీలు ఇచ్చిన సగటు అంచనాల ప్రకారం, HDFC బ్యాంక్ నికర లాభం సంవత్సరానికి (YoY) 21% పెరిగి రూ. 12,180 కోట్లకు చేరుకుంది.
ఏ బ్యాంక్ ఫలితాల్లోనైనా కీలకంగా చూడాల్సింది నికర వడ్డీ ఆదాయం (NII). ఆర్జించిన వడ్డీ - చెల్లించిన వడ్డీ మధ్య వ్యత్యాసం ఇది. HDFC బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం సంవత్సరానికి 33% పెరిగి రూ. 25,050.4 కోట్లకు చేరుకుందని అంచనా.
బ్యాంక్ రుణ వృద్ధి
ఈ నెల ప్రారంభంలో రుణదాత ప్రకటించిన తాత్కాలిక సంఖ్యల ప్రకారం, మార్చి త్రైమాసికం చివరి నాటికి అడ్వాన్స్‌లు సంవత్సరానికి 17% వృద్ధి చెంది రూ. 16 లక్షల కోట్లకు చేరుకున్నాయి, డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే 6% పెరిగాయి. దేశీయ రిటైల్ రుణాలు సంవత్సరానికి 21% వృద్ధి చెందాయి. వాణిజ్య & గ్రామీణ బ్యాంకింగ్ రుణాలు 30% జంప్ చేశాయి. కార్పొరేట్, ఇతర టోకు రుణాలు 12.5% పెరిగాయి.
బ్యాంక్ ఫలితాల్లో చూడాల్సిన మరో కీలకాంశం కాసా రేషియో (కరెంట్, సేవింగ్స్ డిపాజిట్లు). తాత్కాలిక సమాచారం ప్రకారం.. Q4లో HDFC బ్యాంక్ డిపాజిట్లు రుణాల కంటే వేగంగా పెరిగాయి. మార్చి చివరి నాటికి ఇవి రూ. 18.8 లక్షల కోట్లుగా ఉన్నాయి, ఇది గత ఏడాది కాలంతో పోలిస్తే దాదాపు 21% పెరిగాయి. రిటైల్ డిపాజిట్లు సంవత్సరానికి 23.5%, హోల్‌సేల్ డిపాజిట్లు 10% వృద్ధి చెందాయి.
ఆస్తి నాణ్యత
గ్రాస్ నాన్-పెర్ఫార్మింగ్ అసెట్ (GNPA) రేషియో స్థిరంగా ఉంటుందని కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ అంచనా వేసింది. తక్కువ స్లిప్పేజ్‌లు (<2%), మెరుగైన రికవరీ, బలమైన రుణ వృద్ధితో ఇది సాధ్యమవుతుందని చెప్పింది.
GNPA నిష్పత్తి 1.21%, NNPA 0.32%గా ఉంటుందని ICICI డైరెక్ట్ లెక్క వేసింది. HDFC లిమిటెడ్ విలీనం నేపథ్యంలో, ప్రొవిజన్లను రూ. 3,361 కోట్లకు పెంచాలని చెబుతోంది.
కీలకంగా చూడాల్సిన విషయాలు:
* అధిక వడ్డీ రేట్ల నేపథ్యంలో రుణ వృద్ధి, డిపాజిట్ల ఔట్‌లుక్
* క్రెడిట్ కార్డ్స్ వ్యాపారంలో వృద్ధి, భవిష్యత్ పథం
* FY24లో మార్జిన్ ట్రెండ్
* ఆస్తి నాణ్యతపై మేనేజ్‌మెంట్ కామెంటరీ
* HDFC లిమిటెడ్ విలీన కాల గడవుపై అప్‌డేట్
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.