HDFC Bank Increased Loan Interest Rates: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ‍‌(RBI), తన ద్రవ్య విధానాన్ని ప్రకటించడానికి ముందే.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒక షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. దేశంలో అతి పెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన HDFC బ్యాంక్,  MCLR (మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్‌) పెంచింది. దీంతో, ఆ బ్యాంక్‌ గృహ రుణాలు, కారు రుణాలు, వ్యక్తిగత రుణాలు మరింత ఖరీదైనవిగా మారాయి. 


HDFC బ్యాంక్, తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్లను 10 బేసిస్ పాయింట్లు (0.10 శాతం) పెంచింది. కొత్త రేట్లు ఈ రోజు (08 ఫిబ్రవరి 2024 ) నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో, HDFC బ్యాంక్‌కు సంబంధించిన అన్ని రుణాల EMI మొత్తం ఈ రోజు నుంచి పెరుగుతుంది. 


హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొత్త లోన్‌ రేట్లు (HDFC Bank New Loan Rates)


హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం ప్రకారం, వివిధ కాల పరిమితి (Tenure) కలిగిన రుణాల మీద బ్యాంక్ MCLR 8.90 శాతం నుంచి 9.35 శాతం మధ్యలో ఉంటుంది.


బ్యాంక్‌ ఒక రోజు MCLR/ ఓవర్‌నైట్ MCLR 0.10 శాతం పెరిగి, 8.80 శాతం నుంచి 8.90 శాతానికి చేరింది.


ఒక నెల MCLR 10 బేసిస్ పాయింట్లు పెరిగి, 8.85 శాతం నుంచి 8.95 శాతానికి చేరుకుంది.


మూడు నెలల MCLR కూడా 0.10 శాతం పెరిగి, 9.00 శాతం నుంచి 9.10 శాతానికి చేరుకుంది.


ఆరు నెలల MCLR 10 బేసిస్ పాయింట్లు పెరిగి, 9.20 శాతం నుంచి 9.30 శాతానికి చేరుకుంది.


ఇది కాకుండా, కన్జ్యూమర్‌ లోన్లకు సంబంధించి, ఒక సంవత్సరం MCLRను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 05 బేసిస్ పాయింట్లు (0.05 శాతం) పెంచింది. దీంతో ఆ రేట్‌ 9.25 శాతం నుంచి 9.30 శాతానికి చేరింది. బ్యాంక్ 2-సంవత్సరాల MCLR 9.30 శాతం నుంచి 9.35 శాతానికి పెరిగింది. 3 సంవత్సరాల MCLRలో బ్యాంక్ ఎలాంటి మార్పు చేయలేదు, అది 9.30 శాతం వద్దే ఉంది.


రెపో రేట్‌ను యథాతథంగా కొనసాగించిన ఆర్‌బీఐ


ఆర్‌బీఐ రెపో రేట్‌ (RBI Repo Rate) ఈసారి కూడా మారలేదు. రెపో రేట్‌పై స్టేటస్‌ కో కొనసాగించాలని రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన కమిటీ (RBI MPC) నిర్ణయించింది. దీంతో, వరుసగా ఆరో సారి కూడా రెపో రేట్‌ మారలేదు, 6.50 శాతం వద్దే ఉంది. రెపో రేట్‌తో పాటు, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (MSF) రేట్‌ను 6.75% వద్ద, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (SDF) రేట్‌ను 6.25% వద్దే ఆర్‌బీఐ కొనసాగించింది, వీటిని కూడా మార్చలేదు.


డిజిటల్‌ చెల్లింపుల భద్రతను మరింత పెంచడానికి ఒక ఫ్రేమ్‌వర్క్‌ను తీసుకురావాలని యోచిస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌ (RBI Governor Shaktikanta Das) చెప్పారు. రిటైల్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ ఆఫ్‌లైన్‌లోనూ పని చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.


దేశంలో చిల్లర ద్రవ్యోల్బణాన్ని (Retail Inflation) 4 శాతం లోపునకు తీసుకురావాలన్న లక్ష్యానికి కేంద్ర బ్యాంక్‌ కట్టుబడి ఉన్నట్లు దాస్ స్పష్టం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24లో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 5.4 శాతంగా నమోదు కావచ్చని ఆర్‌బీఐ అంచనా వేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇది 4.5 శాతానికి తగ్గుతుందని లెక్కగట్టింది. 


మరో ఆసక్తికర కథనం: తక్కువ EMI ఆశలు ఆవిరి, ఆర్‌బీఐ దాస్‌ ప్రసంగంలో కీలకాంశాలు ఇవే