Jasprit Bumrah : వైజాగ్‌ (Vizag) వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో తొమ్మిది వికెట్లతో సత్తా చాటిన టీమిండియా పేసు గుర్రం జస్ర్పీత్‌  బుమ్రా(Jasprit Bumrah)... ఐసీసీ ర్యాంకింగ్స్‌(ICC Rankings)లో సత్తా చాటాడు. ఐసీసీ టెస్టు బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌(ICC Test  bowler Rankings) లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. తొలిసారి ఈ ఘనత అందుకున్నాడు. భారత్‌ నుంచి ఓ ఫాస్ట్‌ బౌలర్‌ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ స్థానం సాధించడం ఇదే మొదటిసారి. ఐసీసీ బౌలర్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న నాలుగో భారత బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. బిషన్‌ సింగ్‌ బేడి, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా తర్వాత బుమ్రా ఈ ఘనత అందుకున్నాడు. బుమ్రా మినహా మిగిలిన ముగ్గురు స్పిన్నర్లే కావడం గమనార్హం. బుమ్రా.. ప్యాట్‌ కమిన్స్‌, కాగిసో రబాడ, అశ్విన్‌లను అధిగమించి బౌలర్ల జాబితాలో అగ్రస్థానానికి ఎగబాకాడు. అశ్విన్‌ 11 నెలల తర్వాత అగ్రస్థానం కోల్పోవాల్సి వచ్చింది. రెండు స్థానాలు కిందకు పడ్డ అతడు ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నాడు. రబాడ రెండో స్థానం దక్కించుకున్నాడు. 



టాప్‌ టెన్‌లో విరాట్ ఒక్కడే
టెస్ట్‌ బ్యాటర్లలో దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు చేసిన కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ నంబర్‌వన్‌ స్థానంలో ఉన్నాడు. స్టీవ్‌ స్మిత్‌ రెండో స్థానంలో నిలవగా... భారత్‌ నుంచి విరాట్‌ కోహ్లీ ఏడో స్థానంలో ఉన్నాడు. టాప్‌ టెన్‌లో విరాట్‌ ఒక్కడే ఉన్నాడు. ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో ద్విశతకం అందుకున్న యువ బ్యాటర్‌ యశస్వి జైస్వాల్‌ 37 స్థానాలు ఎగబాకి బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో 29వ స్థానానికి చేరాడు. 14 స్థానాలు మెరుగుపరుచుకున్న శుభ్‌మన్‌ గిల్‌ 38వ స్థానంలో నిలిచాడు. 


మూడో టెస్ట్‌కు దూరమేనా..?
రాజ్‌ కోట్‌ వేదికగా జరిగే మూడో టెస్ట్‌కు బుమ్రాను దూరం పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొన్ని రోజులుగా వరుసగా మ్యాచ్‌ లు ఆడుతున్న పేసు గుర్రం బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలనే ఉద్దేశంతోనే టీమిండియా మేనేజ్ మెంట్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐదు మ్యాచ్‌ల సుదీర్ఘ టెస్టు సిరీస్‌లో ప్రతి మ్యాచ్‌ ఆడినా బుమ్రా ఫిట్‌నెస్‌పై ప్రభావం పడుతుందని టీమిండియా మేనేజ్‌మెంట్‌ భయపడుతుందన్న వార్తలు వస్తున్నాయి. చివరి 2 టెస్టులకు బుమ్రాను మరింత ఫిట్‌ గా ఉంచేందుకు తదుపరి టెస్టు నుంచి విశ్రాంతి కల్పించిందని తెలుస్తోంది. రెండో టెస్టులో బుమ్రా రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి దాదాపు 33 ఓవర్లు బౌలింగ్ చేశాడు. జట్టులోని మిగతా బౌలర్లతో పోలిస్తే బుమ్రా వేసిన ఓవర్ల సంఖ్య పెరిగింది. స్పిన్నర్‌కు అనుకూలమైన పిచ్‌పై జట్టులోని ముగ్గురు స్పిన్నర్లు బుమ్రా కంటే తక్కువ బౌలింగ్ చేశారు. తొలి టెస్టులోనూ బుమ్రా దాదాపు 25 ఓవర్లు బౌలింగ్ చేశాడు. బుమ్రా గైర్హాజరీలో మహ్మద్ సిరాజ్ జట్టులోకి రానున్నాడు. ఈ సిరీస్ నుంచి మహ్మద్ షమీ పూర్తిగా దూరమయ్యే అవకాశం ఉంది.


బుమ్రా అరుదైన ఘనత
వైజాగ్‌ టెస్టులో నిప్పులు చెరిగే బంతులతో బుమ్రా ఇంగ్లాండ్‌ పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్‌లో పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా తొమ్మిది వికెట్లు తీసి ఇంగ్లండ్‌ పతనాన్ని శాశించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు, సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసిన బుమ్రా ఓ అరుదైన ఘనత సాధించాడు. చేతన్‌ శర్మ తర్వాత ఇంగ్లండ్‌పై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన భారత సీమర్‌గా బుమ్రా రికార్డుల్లోకెక్కాడు.