New Zealand vs South Africa: దక్షిణాఫ్రికా(South Africa)తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ (New Zealand)ఘన విజయం సాధించింది.
కివీస్ జట్టు ముందు ప్రొటీస్ యువ జట్టు తేలిపోయింది. తొలి టెస్టులో 281 పరుగుల తేడాతో సఫారీ జట్టును న్యూజిలాండ్ చిత్తుగా ఓడించింది. నాలుగు రోజుల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది. 529 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన దక్షిణాఫ్రికా 247 పరుగులకే ఆలౌటైంది. కైల్ జేమిసన్ నాలుగు, మిచెల్ శాంట్నర్ 3 వికెట్లతో సఫారీ యువ జట్టు పతనాన్ని శాసించారు. సౌతాఫ్రికా జట్టులో డేవిడ్ బెడింగ్‌హమ్ (87), రువాన్ డి స్వార్ట్ (34), రేనార్డ్ వాన్ టోండర్ (31), జుబేర్ హంజా (36) పోరాడారు. కానీ ఆ పోరాటం కివీస్ విజయ అంతరాన్ని మాత్రమే తగ్గించింది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 179 పరుగుల వద్ద న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 511 పరుగులు చేయగా.. దక్షిణాఫ్రికా 162 పరుగులకే ఆలౌటైంది. తొలి టెస్టులో దక్షిణాఫ్రికా తరపున ఆరుగురు ఆటగాళ్లు అరంగేట్రం చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ సాధించిన రచిన్ రవీంద్ర ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా ఎంపికయ్యాడు.
రెండు ఇన్నింగ్సుల్లోనూ శతకాలు
గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన న్యూజిలాండ్(New Zealand) సీనియర్ ఆటగాడు కేన్ విలియమ్సన్(Kane Williamson) వరుస శతకాలతో చెలరేగిపోయాడు. భీకర ఫామ్‌లో ఉన్న కేన్ మామ.. వరుసగా రెండు సెంచరీలు చేసి పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో రెండు ఇన్నింగ్సుల్లోనూ విలియమ్సన్ శతక మోత మోగించాడు. బే ఓవల్‌లో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో.. కేన్ విలియమ్సన్ శతకంతో గర్జించాడు. క్లాస్ ఇన్నింగ్స్‌తో అలరించిన కేన్ మామ 30వ సెంచరీతో కొత్త రికార్డు సృష్టించాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ చేసి సుదీర్ఘ ఫార్మాట్‌లో 31 శతకాన్ని తన పేరిట లిఖించుకున్నాడు. దక్షిణాఫ్రికా బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ 132 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్లతో 109 రన్స్ బాదాడు. తద్వారా ఈ స్టార్ ఆటగాడు సుదీర్ఘ ఫార్మాట్‌లో 31వ సెంచరీ నమోదు చేశాడు.
రికార్డుల మోత
ఇప్పటికే భారత స్టార్ విరాట్ కోహ్లీ(Virat Kohli), క్రికెట్ లెజెండ్, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు డాన్ బ్రాడ్‌మన్ పేరిట ఉన్న 29 సెంచరీల రికార్డును అధిగమించిన కేన్ మామ.. ఇప్పుడు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్(Joe Root) రికార్డును బ్రేక్ చేశాడు. 30 సెంచరీల జో రూట్ రికార్డును విలియమ్సన్ బద్దలు కొట్టాడు. మరొక సెంచరీ కొడితే ఈ కివీస్ మాజీ సారథి ..ఆస్ట్రేలియా రన్ మెషిన్ స్టీవ్ స్మిత్ సరసన నిలుస్తాడు. ప్రస్తుతం స్మిత్ 32 శతకాలతో టాప్‌లో కొనసాగుతున్నాడు. టెస్టుల్లో అత్యధిక సార్లు మూడంకెల స్కోర్ సాధించిన రెండో ఆటగాడిగా కేన్ నిలిచాడు.
మ్యాచ్ ముగిసిందిలా...
ఈ మ్యాచ్‌లో రచిన్ రవీంద్ర(240) డబుల్ సెంచరీతో విజృంభించగా.. విలియమ్సన్(118) సెంచరీతో జట్టుకు కొండంత స్కోర్ అందించాడు. అనంతరం సఫారీలను 162 పరుగులకే చుట్టేసిన కివీస్.. రెండో ఇన్నింగ్స్‌లో దూకుడుగా ఆడుతోంది. విలియమ్సన్ సెంచరీతో న్యూజిలాండ్ ఆధిక్యం 500 పరుగులు దాటింది. మూడో రోజు ఆట ముగిసే సరికి న్యూజిలాండ్ 4 వికెట్ల నష్టానికి 179 రన్స్‌తో ఉన్న కివీస్ అదే స్కోరు వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. 529 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన దక్షిణాఫ్రికా 247 పరుగులకే ఆలౌటైంది.