HDFC Bank - HDFC Merger Impact: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో హెచ్‌డీఎఫ్‌సీ విలీనం జులై 1, 2023 నుంచి అమలులోకి వస్తుంది. HDFC గ్రూప్ చైర్మన్ దీపక్ పారిఖ్ (HDFC chairman Deepak Parekh) ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. ఈ రెండు పెద్ద కంపెనీల కలయిక రెండు సంస్థలకూ ఉపయోగపడుతుందని టాప్‌ మేనేజ్‌మెంట్‌ చెబుతోంది. అంతేకాదు, షేర్‌హోల్డర్లు, కస్టమర్లు, ఆర్థిక వ్యవస్థకూ ప్రయోజనం చేకూరుస్తుందట.


FD అకౌంట్‌ హోల్డర్ల పరిస్థితేంటి?
జులై 1, 2023న హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ కంపెనీ (HDFC) హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో విలీనం అవుతుంది, ఇక కనిపించదు. ఈ మెర్జర్‌ తర్వాత, హెచ్‌డీఎఫ్‌సీ డిపాజిటర్లు, గృహ రుణ కస్టమర్ల పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు తలెత్తిన పెద్ద ప్రశ్న.
FDFCలో డిపాజిట్స్‌ ఉన్న కస్టమర్లు, విలీనం తర్వాత, ఆ డిపాజిట్‌ను రద్దు చేసుకుని డబ్బు విత్‌ డ్రా చేసుకోవచ్చు లేదా రెన్యువల్‌ చేసుకోవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఈ రెండు ఆప్షన్స్‌ ఇస్తుంది. 


HDFC, 12 నెలల నుంచి 120 నెలల ఫిక్స్‌డ్‌ డిపాజిట్స్‌ (HDFC FD Rates) మీద 6.56 శాతం నుంచి 7.21 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. HDFC బ్యాంక్, 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు ఉన్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్స్‌ (HDFC Bank FD Rates) మీద 3 నుంచి 7.25 శాతం వడ్డీ చెల్లిస్తోంది.


హెచ్‌డీఎఫ్‌సీని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో కలిపేసిన తర్వాత, కస్టమర్లు తమ డిపాజిట్లపై బీమా ప్రయోజనం పొందుతారు. డిపాజిట్ ఇన్సూరెన్స్ & క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ నుంచి డిపాజిటర్లకు రూ. 5 లక్షల వరకు ఇన్సూరెన్స్‌ కవరేజ్‌ లభిస్తుంది. అంటే, రూ. 5 లక్షల వరకు ఉండే డిపాజిట్లకు దాదాపు 100 శాతం బీమా గ్యారెంటీ ఉంటుంది.


హోమ్‌ లోన్‌ కస్టమర్ల పరిస్థితేంటి?
HDFC చేసేది హోమ్‌ లోన్‌ బిజినెస్‌. విలీనం తర్వాత, హెచ్‌డీఎఫ్‌సీ హౌసింగ్‌ లోన్స్‌ అన్నీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు బదిలీ అవుతాయి. అంటే, హెచ్‌డీఎఫ్‌సీ గృహ రుణ ఖాతాదార్లంతా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లోన్‌ కస్టమర్లుగా మారిపోతారు. అదే సమయంలో, HDFC బ్యాంక్ కస్టమర్లందరికీ HDFC హోమ్ లోన్ ప్రొడక్ట్స్‌ ప్రయోజనం లభిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్‌లందరికీ హోమ్ లోన్ వడ్డీ రేట్లలో మార్పు కనిపిస్తుంది. 


హెచ్‌డీఎఫ్‌సీ షేర్‌హోల్డర్ల పరిస్థితేంటి?
HDFC బ్యాంక్‌లో HDFC మెర్జర్‌ తర్వాత, అర్హులైన షేర్‌హోల్డర్లకు, హెచ్‌డీఎఫ్‌సీలో హోల్డ్‌ చేస్తున్న ప్రతి 25 షేర్లకు బదులు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు చెందిన 42 షేర్లను ఇష్యూ చేస్తారు. ఆ షేర్లు డీమ్యాట్‌ అకౌంట్‌లో క్రెడిట్‌ అవుతాయి.


హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ - హెచ్‌డీఎఫ్‌సీ కంపెనీ డైరెక్టర్ల బోర్డ్‌ సమావేశం ఈ నెల 30న జరుగుతుంది. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ డైరెక్టర్ల బోర్డు చివరి సమావేశం అదే అవుతుంది. జూన్ 30న మార్కెట్ ముగిసిన తర్వాత రెండు ఆర్థిక సంస్థల బోర్డు మీటింగ్ ఉంటుందని, విలీనానికి రెండు బోర్డ్‌ల నుంచి ఆమోదం లభిస్తుందని దీపక్ పారిఖ్ చెప్పారు. 


HDFC బ్యాంక్, HDFC విలీనం గురించి 2022 ఏప్రిల్‌లో ప్రకటించారు. అప్పటి నుంచి వివిధ దశలను దాటుకుంటూ, ఎట్టకేలకు ఈ కథ క్లైమాక్స్‌ను చేరింది.


మరో ఆసక్తికర కథనం: ITR ఫైలింగ్‌ ముందే పాన్‌-ఆధార్‌ లింక్‌ చేయండి, ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌


Join Us on Telegram: https://t.me/abpdesamofficial