HDFC Bank - HDFC Merger: హెచ్‌డీఎఫ్‌సీ కవల కంపెనీల మెర్జర్ తర్వాత, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ జాతకం మారిపోతుంది. హెచ్‌డీఎఫ్‌సీని తనలో కలుపుకుని, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బాహుబలిలా బలం పెంచుకుంటుంది. ప్రపంచంలోని అత్యంత విలువైన బ్యాంకుల లిస్ట్‌లోకి ఎక్కుతుంది. అతి పెద్ద అమెరికన్ & చైనీస్ బ్యాంక్‌ల సరసన పీటేసుకుని కూర్చుంటుంది.
బ్లూమ్‌బెర్గ్ డేటా ప్రకారం, మెర్జర్ తర్వాత... JP మోర్గాన్ చేస్ & కో (మార్కెట్ విలువ 416.5 బిలియన్ డాలర్లు), ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా లిమిటెడ్ (228.3 బిలియన్ డాలర్లు), బ్యాంక్ ఆఫ్ అమెరికా కార్పొరేషన్ (227.7 బిలియన్ డాలర్లు) తర్వాత నాలుగో స్థానంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (171.8 బిలియన్ డాలర్లు) నిలుస్తుంది.
హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్ మెర్జర్ జులై 1 నుంచి అమలులోకి వస్తుంది. కొత్త HDFC బ్యాంక్ ఎంటిటీకి దాదాపు 120 మిలియన్ల మంది కస్టమర్లు ఉంటారు, ఇది జర్మనీ జనాభా కంటే ఎక్కువ. బ్రాంచ్ నెట్‌వర్క్ 8,300కి పెరుగుతుంది. మొత్తం 1,77,000 పైగా సిబ్బంది మెర్జర్డ్ ఎంటిటీ కిందకు వస్తారు.
మార్కెట్ క్యాపిటలైజేషన్
HSBC హోల్డింగ్స్ Plc, సిటీ గ్రూప్ సహా చాలా బ్యాంకుల కంటే HDFC పైకి దూసుకుపోతుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత భారత్‌లో రెండో అతి కంపెనీగా కాలర్ ఎగరేస్తుంది. 27 జూన్ 2023 నాటికి, రూ.16,83,950 కోట్ల మార్కెట్ క్యాప్‌తో రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి స్థానంలో ఉంది. HDFC బ్యాంక్, HDFC మార్కెట్ క్యాప్‌ను జోడిస్తే, మెర్జ్‌డ్ ఎంటిటీ రూ.14,45,958 కోట్ల విలువతో సెకండ్ ప్లేస్‌లో ఉంటుంది. ఇప్పటి వరకు ఆ ర్యాంక్‌లో టాటా గ్రూప్ ఐటీ కంపెనీ టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్ (TCS) మూడో స్థానానికి పడిపోతుంది.
ఇడియన్ పీర్స్‌ను కూడా మెర్జర్డ్ ఎంటిటీ క్రాస్ చేసి ముందుకెళ్తుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా HDFC బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ కంటే రెండింతలు పెద్దదిగా మారుతుంది. 27 జూన్ 2023 నాటికి ఐసీఐసీఐ బ్యాంక్ ప్రస్తుత మార్కెట్ క్యాప్ రూ.6,52,555 కోట్లు. అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ SBI కన్నా దాదాపు మూడు రెట్లు పెద్దదిగా అవతరిస్తుంది. 27 జూన్ 2023 నాటికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ విలువ రూ.5.03 లక్షల కోట్లు.
డిపాజిట్ గ్రోత్
విలీనానికి ముందు, డిపాజిట్లను సంపాదించడంలో తన పోటీ బ్యాంకుల కంటే HDFC బ్యాంక్ స్థిరంగా ఔట్‌పెర్ఫార్మ్ చేసింది. విలీనం ద్వారా, హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లను చేర్చుకుని డిపాజిట్ బేస్‌ను పెంచుకోవడానికి మరో అవకాశం అందుతుంది. హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లలో దాదాపు 70% మందికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో అకౌంట్స్ లేవు. వాళ్లందరితో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ తెరిపించాలని బ్యాంక్ ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్‌లో కేవలం 2% మందే హెచ్‌డీఎఫ్‌సీ నుంచి హౌసింగ్ లోన్స్ తీసుకున్నారు. మెర్జర్ తర్వాత, బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్‌కు సొంతంగా హోమ్ లోన్స్ ఆఫర్ చేసే అవకాశం కూడా వస్తుంది.
స్టాక్ పెర్ఫార్మెన్స్
HDFC బ్యాంక్ షేర్లు, గత సంవత్సర కాలంలో నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ కన్నా తక్కువ రిటర్న్ ఇచ్చాయి. స్టాక్ పెర్ఫార్మెన్స్‌లో 18-20% వరకు లోన్ బుక్ పెరుగుదలపై ఆధారపడి ఉంటుందని, 2% RoA మీద ఆధారపడి ఉంటుందని మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ లెక్కలు వేశారు. విలీనం తర్వాత ఈ స్టాక్ రీరేట్ అవుతుందని వాళ్లు నమ్ముతున్నారు.
మరో ఆసక్తికర కథనం: ఇవాళ మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' TCS, ICICI Securities, BPCL
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.