GST Collection August:
జీఎస్టీ వసూళ్ల రికార్డుల పర్వం కొనసాగుతోంది. 2023 ఆగస్టులో 11 శాతం వృద్ధి నమోదైందని రెవెన్యూ సెక్రెటరీ సంజయ్ మల్హోత్ర అన్నారు. ప్రభుత్వానికి ఈ నెల్లో 1.60 లక్షల కోట్ల మేర ఆదాయం వచ్చిందన్నారు. ఇక జులైలో జీఎస్టీ కలెక్షన్లు రూ.1,65,105 కోట్లుగా ఉన్న సంగతి తెలిసిందే.
'ఇంతకు ముందు నెలల్లాగే జీఎస్టీ గణాంకాలు వార్షిక ప్రాతిపదికన 11 శాతం మేర పెరిగాయి. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు 7.8 శాతంగా ఉంది. నామినల్ జీడీపీ వృద్ధిరేటు 8 శాతంగా నమోదైంది. 2022 ఆగస్టులో రూ.1,43,612 కోట్లు జీఎస్టీ రాబడి వచ్చింది. ఈసారి అది రూ.1.60 లక్షల కోట్లకు పెరిగింది. గతేడాది జులైతో పోలిస్తే ఈ సారీ 11 శాతం మేర పెరిగిన సంగతి తెలిసిందే' అని సంజయ్ మల్హోత్ర అన్నారు.
'జూన్ త్రైమాసికంలో జీఎస్టీ ఆదాయం 11 శాతం మేర పెరిగింది. జీడీపీలో పన్నుల శాతంతో పోలిస్తే 1.3 శాతంగా నమోదైంది' అని సంజయ్ మల్హోత్ర విలేకరులకు తెలిపారు. పన్ను రేట్లు పెంచనప్పటికీ నామినల్ జీడీపీ కన్నా అధికంగా వస్తు సేవల పన్ను వసూళ్లు పెరిగాయన్నారు. నిబంధనలను సరిగ్గా అమలు చేయడం, పన్ను వసూళ్లు మెరుగవ్వడమే ఇందుకు కారణాలన్నారు. పన్ను ఎగవేతలు తగ్గాయని ఆయన పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం మొదలు పెట్టిన 'మేరా బిల్ మేరా అధికార్' పథకాన్ని మల్హోత్ర ప్రశంసించారు. 'జీఎస్టీ వల్ల ప్రజలు, వినియోగదారులు, ప్రభుత్వాలు ప్రయోజనం పొందాయి. ప్రతి నెలా పన్ను వసూళ్లు పెరుగుతున్నాయి. జీఎస్టీ కింద పన్ను రేట్లు తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్రాలు కృషి చేస్తున్నాయి. జీఎస్టీ ఇన్వాయిస్ తీసుకోవడం తమ హక్కని ప్రజలు గుర్తించాలి. వస్తువు కొనుగోలు చేశాక తప్పనిసరి సేవలు పొందాలంటే బిల్లు కచ్చితంగా అవసరం. ప్రజల్లో అవగాహన పెంచేందుకే మేమీ పథకం ఆరంభించాం' అని ఆయన తెలిపారు.
"మేరా బిల్ మేరా అధికార్"తో ఏంటి లాభం?
ఇది చాలా సింపుల్ స్కీమ్. కొనుగోలుకు సంబంధించిన రిసిప్ట్ తీసుకుని, దానిని అప్‌లోడ్ చేస్తే చాలు. ఇద్దరు వ్యక్తులు కోటి రూపాయల చొప్పున గెలుచుకునే ఛాన్స్ ఉంటుంది. "మేరా బిల్ మేరా అధికార్" అనేది ఒక లాటరీ పథకం. లాభాపేక్షతో కాకుండా, సదుద్దేశంతో ప్రారంభించిన పథకం ఇది. వచ్చే నెల (సెప్టెంబర్) 1వ తేదీ నుంచి ఈ స్కీమ్ స్టార్ అవుతుంది. పైలెట్ ప్రాజెక్ట్‌గా, సరిగ్గా ఏడాది పాటు కొనసాగుతుంది.
కోటి రూపాయలు గెలవడం ఎలా?
కోటి రూపాయలు గెలవాలంటే ముందుగా 'డ్రా'కు అర్హత సాధించాలి. ఇదేం పెద్ద విషయం కాదు. ప్రతి నెలలో తీసుకున్న రిసిప్ట్‌ను ఆ తర్వాతి నెల 5వ తేదీ కల్లా అప్‌లోడ్ చేస్తే అర్హత పొందినట్లే. "మేరా బిల్ మేరా అధికార్" మొబైల్ యాప్ లేదా "www.merabill.gst.gov.in" పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి. దీంతోపాటు, రిసిప్ట్ తీసుకున్న వ్యక్తికి సంబంధించిన వివరాలను కూడా నమోదు చేయాలి. ఒక వ్యక్తి ఒక నెలలో 25 రిసిప్ట్స్‌ను అప్‌లోడ్ చేసేందుకు వీలుంటుంది. GSTN ఉన్న షాపు/సప్లయర్స్ నుంచి తీసుకున్న రశీదులను మాత్రమే అప్‌లోడ్ చేయాలి. రిసిప్ట్ కనీస విలువను రూ.200గా నిర్ణయించారు.
పోర్టల్ లేదా యాప్‌లో అప్‌లోడ్ చేసిన GST రిసిప్ట్స్ నుంచి ప్రతి నెలా డ్రా తీస్తారు. ముందుగా 800 రశీదులను ఎంపిక చేసి, ఒక్కో దానికి రూ.10 వేల చొప్పున ప్రైజ్ మనీ ఇస్తారు. ఆ తర్వాత మరో 10 రిసిప్ట్స్‌ను తీసి, వాటికి ఒక్కో దానికి రూ.10 లక్షల చొప్పున బహుమతి అందిస్తారు. ఇది కాకుండా, ప్రతి 3 నెలలకు ఒకసారి బంపర్ డ్రా తీస్తారు. బంపర్ డ్రాలో గెలుపొందిన రిసిప్ట్‌కు కోటి రూపాయలు అందజేస్తారు.